ప్లే స్కూల్‌లో  టీ పడితే?

7 Feb, 2018 00:51 IST|Sakshi
తల్లి ట్రేసీతో కొడుకు బెకర్‌ 

ఇది విన్నారా?

చిన్న పిల్లలను ప్లే స్కూల్స్‌లో వేయడం మన దగ్గర కూడా ఉంది. రెండేళ్ల వయసు పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లలను కాసేపు ప్లే స్కూల్లో వదిలి తీసుకురావడం మనకు తెలుసు. పిల్లలు అక్కడ ఆడుకుంటారు. కాని ఆడుకోవడంలో ఒక్కోసారి ప్రమాదం జరిగితే? మన దగ్గర కాసేపు గొడవ చేస్తాం... మన ఖర్మ అని ఊరుకుంటాం. కాని బ్రిటన్‌లో అలా కాదు. అక్కడ ఒక తల్లి తన రెండున్నర ఏళ్ల పిల్లవాణ్ణి ప్లే స్కూల్‌లో వేస్తే అక్కడ ఆ పిల్లవాడు గాయాల పాలు అయ్యాడు. ఆ తల్లి ఊరుకోక కోర్టుకెక్కింది. కోర్టు ఆమెకు పరిహారం ఇచ్చింది. ఎంతో తెలుసా? సుమారు నాలుగు లక్షలు. బ్రిటన్‌లోని తీరప్రాంత పట్టణమైన బోర్న్‌మెస్‌లో నివసించే ‘ట్రేసి’ అనే మహిళ తన రెండున్నరేళ్ల పిల్లవాణ్ణి ప్లే స్కూల్‌లో వేసింది. అది మంచి స్కూలే. కాని ఆ రోజు ప్లే టైమ్‌లో పిల్లలు ఆడుకుంటూ ఉండగా టీచరు టీ తెప్పించుకుంది. పొగలు గక్కే ఆ టీ టేబుల్‌ మీద ఉండగా ట్రేసి కుమారుడు రెండున్నరేళ్ల ‘బెకర్‌’ దానిని తన మీద ఒలకబోసుకున్నాడు. చిన్నపిల్లాడు కావడం వల్ల టీ వేడిగా ఉండటం వల్ల చేతి మీద బొబ్బలు వచ్చాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళితే చికిత్స చేస్తున్న వైద్యులు ఆ బొబ్బలు చూసి ప్లే స్కూల్‌ మీద కోర్టుకెళ్లమని ట్రేసీకి సూచించారు. ట్రేసి వెంటనే కోర్టుకెళ్లింది. ఇది జరిగింది 2015లో.

కేసు రెండేళ్ల పాటు సాగింది. చివరకు కోర్టు ఈ జనవరిలో ఆ ప్లేస్కూల్‌ వారిని 4,300 పౌండ్లు (సుమారు నాలుగు లక్షలు) పరిహారం కట్టమని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తంలో వైద్యం కోసం చేసిన ఖర్చు పోగా మిగిలిన దానిని పిల్లవాడి పేరు మీద ఫిక్స్‌డ్‌ చేయమని కూడా కోర్టు చెప్పింది. అయితే అందులో విశేషం లేదు. బెకర్‌ తల్లి ట్రేసి అప్పటి నుంచి స్కూళ్లలో కాలిన గాయాల బారిన పడే పిల్లల కోసం ఒక నిధిని సేకరించే పనిలో పడింది. పిల్లల వైద్యం కోసం కొన్ని డబ్బులు అందించే సంస్థలు ఏర్పడాలని భావిస్తోంది. ప్రచారం చేస్తోంది. బెకర్‌ ఆరోగ్యంగా ఉన్నాడు కానీ వేణ్ణిళ్లతో స్నానం చేయడానికి భయపడుతున్నాడు. వేడి టీ మీద పడటం వల్ల కలిగిన భయం తాలుకు ప్రభావం అది. ప్లే స్కూళ్లు మన దగ్గర తగిన జాగ్రత్తలతోనే నడుస్తున్నాయి. కాని నిర్వాహకులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటన చెబుతోంది. టీ విలువ పది రూపాయలు. కాని దాని కారణంగా ఏ ఇరవై వేలో ఫైను పడటం కంటే జాగ్రత్తగా ఉండటం మేలు కదా.

మరిన్ని వార్తలు