టాట్రూస్

26 Aug, 2016 22:59 IST|Sakshi
టాట్రూస్

ఒకప్పటి రోజుల్లో కొంతమంది తమకు ఇష్టమైన వారి పేరునో, ఇష్టదైవం ఆకృతినో, తమ మత చిహ్నాన్నో మాత్రమే పచ్చబొట్లుగా పొడిపించుకుని, పచ్చబొట్టూ చెరిగీ పోదులే అంటూ పాటలు పాడుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. వొంటిమీద... ఇంకా చెప్పాలంటే వొళ్లంతా సందులేకుండా వింత వింత టాటూలు వేయించుకోవడం ఇప్పుడు  ఫ్యాషన్. అదోవిధమైన క్రేజ్. అయితే అలా ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకోవడమంటే కోరికోరి ముప్పును కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే టాటూలు వేయడానికి వాడే పరికరాలు కనుక అపరిశుభ్రంగా ఉంటే బ్యాక్టీరియా త్వరగా వృద్ధిచెందే అవకాశం ఉందట. దానిమూలంగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

టాటూలు వేయించుకునేవారిపై యూరోపియన్ కమిషన్స్ జాయింట్ రిసెర్చ్ (జేఆర్‌సి) నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా టాటూలంటే పలురకాలైన ఇంకులను చర్మంలోకి చొప్పించి, వాటిని దీర్ఘకాలం పాటు కనిపించేలా చేయడమే! ఇక్కడే అసలు చిక్కొచ్చిపడుతోంది. అదేమంటే, అలా చొప్పించే ఇంకులన్నీ రసాయనాలతో కూడుకున్నవి కావడం, ఒకవేళ ఆ ఇంకు కనుక వొంటికి సరిపడకపోతే అది క్రమేపీ చర్మసంబంధ క్యాన్సర్‌కి దారితీస్తుందట. అదేవిధంగా టాటూలు వేసేందుకు వాడిన ఇంజెక్షన్ సూదుల్లాంటి పరికరాలు కనుక సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే అలర్జీ సంబంధమైన పలు ఇతర రకాల ఇబ్బందులూ తలెత్తుతాయి కాబట్టి, ఒకవిధంగా చెప్పాలంటే ఎక్కడపడితే అక్కడ అంటే చవగ్గా పొడుస్తున్నారు కదా అని మరీ రోడ్డుపక్కన కూర్చోబెట్టి టాటూలు వేసే వారి వద్దకు వెళ్లిపోకండి మరి!

 

మరిన్ని వార్తలు