బంజరు భూమిని... బంగరు భూమిగా..!

15 Jul, 2014 00:24 IST|Sakshi
బంజరు భూమిని... బంగరు భూమిగా..!

ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటుంటారు. మరి డా.రామ్ కటారియా పిచ్చిని ఏమంటారు? ఆయన మాటల్లోనే వినండి... ‘‘నా పిచ్చే నా శక్తి.’’ ఇంతకీ ఆయన చేసిన పిచ్చి పని ఏమిటి? కొంత వెనక్కి వెళ్లాలి మనం... మన్‌చర్, పుణే(మహారాష్ట్ర)లో చేయి
తిరిగిన వైద్యుడిగా రామ్ కటారియాకు పేరుంది. అందమైన ఇల్లు ఉంది. దేనికీ లోటు లేదు. కొడుకులు పెద్దవాళ్లై ఎవరి దారి వారు చూసుకున్నాక మాత్రం శూన్యం ఆవరించినట్లు అనిపించింది కటారియాకు. ఒంటరితనం దరి చేరింది. చుట్టుపక్కల ఎందరు ఉన్నా లేనట్లే అనిపించేది. స్నేహితులు ఉన్నా లేనట్లే అనిపించేది... ఈ శూన్యంలో తనకు ఇష్టమైన వ్యాపకమేదైనా తోడుండాలి.
 ఏమిటది?

పచ్చదనం అంటే కటారియాకు ఇష్టం. చెట్లంటే ఇష్టం. వాటి నీడన కూర్చోవడం అంటే ఇష్టం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం అంటే ఇష్టం. మరోవైపు బయట ఎక్కడ చూసినా పరిస్థితి భిన్నంగా ఉంది. చెట్లు కొట్టి వేస్తున్నారు. ఎటు చూసినా పచ్చదనం లోపించి ఎడారి ముఖం కనిపిస్తోంది.
 
‘కొన్ని వందల చెట్లు మధ్య నేను బతకాలి. వాటి పచ్చదనాన్ని ఆస్వాదించాలి’ అనుకున్నారాయన ‘‘నాది అందమైన కల మాత్రమేనా? నిజం చేసుకోలేనా?’’ అనుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం విని ఊరి వాళ్లందరూ ముక్కు మీద వేలు వేసుకోవడమే కాదు, ‘‘ఇతనికి పిచ్చి పట్టిందేమో’’ అని కూడా అనుకున్నారు. ఇంతకీ కటారియా తీసుకున్న నిర్ణయం ఏమిటి? తన ఇంటిని అమ్మాలని! చెట్ల మధ్య బతకాలని!!
 
ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులతో ఆయన తన కలను వెదుక్కుంటూ వెళ్లాడు. రాజ్‌గుర్‌నగర్ అనే చిన్న పట్టణానికి సమీపంలో కడుసుగాన్ అనే ప్రాంతంలో వంద ఎకరాల భూమిని కొన్నాడు. అది సారవంతం కాని బంజరుభూమి.‘‘ఇన్ని ఎకరాల భూమిని ఏం చేసుకుంటారు? ఫ్యాక్టరీగానీ పెడతారా?’’ అని అడిగాడు ఒకాయన ‘‘లేదు. వందలాది చెట్లు నాటుతాను, ఇక్కడొక చిన్న ఇల్లు కట్టుకొని బతుకుతాను’’ సమాధానమిచ్చాడు కటారియ అవతలి వ్యక్తి ఖంగు తిన్నాడు. ‘ఇలాంటి వారు కూడా ఉంటారా?’ అని ఆశ్చర్యపోయాడు.
     
చుట్టు పక్కల గ్రామస్థుల సహాయసహాకారాలు తీసుకొని లక్షలాది చెట్లు నాటారు. ఫాంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా మొక్కలకు నీళ్లు అందే ఏర్పాటు చేశారు. ఆయన పట్టుదల చూసి బీడు భూమి గుండెలో తేమ చేరినట్లు ఉంది. లక్ష చెట్లు బతికాయి. దర్జాగా పెరిగాయి. పుష్కర కాలం క్రితం ఆ బంజరు భూమిని చూసిన వాళ్లు ఇప్పుడు అటు వెళితే ముక్కు మీద వేలేసుకోవడం ఖాయం. దీనికి ‘గాంధీ క్షేత్రం’ అని పేరు పెట్టాడు కటారియా. కేవలం ‘పచ్చదనం’ దగ్గర మాత్రమే ఆగిపోలేదు కటారియా. ‘‘గ్రామల్లో నివసించే శ్రామికులే నిజమైన ఉత్పాదకులు’’ అని చెప్పే కటారియా వారు పట్టణాలకు వలస పోకుండా రకరకాల వ్యవసాయ సంబంధిత పనుల ద్వారా తన క్షేత్రంలో ఉపాధి కల్పించారు. ‘‘వారిలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీసి ఆత్మవిశ్వాసం కలిగించే బాధ్యత మాత్రం మనపై ఉంది’’ అని చెబుతున్నారు.
 
ఈ సుందర క్షేత్రానికి సంబంధించిన వార్తలు ఆనోటో ఈ నోటా పడి పుణేలోని ‘బ్లాక్ శ్వాన్’ అనే ట్రావెల్ కంపెనీ వరకు వెళ్లాయి. సందర్శకుల పర్యటన కోసం ‘బ్లాక్ శ్వాన్’ కటారియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘ఇది సంతోషించాల్సిన విషయం. ప్రకృతి అందాలే కాదు... సంకల్పబలం ఉంటే సాధ్యం కానిది లేదు అనే సందేశం కూడా పర్యాటకులకు చేరువవుతుంది’’ అంటున్నారు కటారి. ఒకవైపు క్షేత్రానికి సంబంధించిన పనుల్లో తల మునకలవుతూనే మరోవైపు వైద్యాన్ని కూడా కొనసాగిస్తున్నారు. పేదలకు ఉచితవైద్యసేవలు అందిస్తున్నారు.
 
‘గ్రామీణ విద్యాపీఠ్’, ‘రూరల్ యూనివర్శిటీ’లాంటి కార్యక్రమాలతో సహా గ్రామాల అభివృద్ధికి రకరకాల ప్రణాళికలు తయారుచేసుకుంటున్నారు కటారియా. పట్టణాల వైపు మాత్రమే కాదు, గ్రామాల వైపు తొంగి చూసే రోజు రావాలని కలలు కంటున్నారు. వివిధరంగాలలో నిష్ణాతులైన రిటైర్డ్ ఉద్యోగులతో సామాజిక సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తున్నారు. ‘‘మాది స్వచ్ఛంద సంస్థ కాదు. ఉద్యమం’’ అంటారాయన. జనరల్ ఫిజిషియన్ అయిన రామ్ కటారియాకు సైకాలజీ ఇష్టమైన సబ్జెక్ట్. మనస్తత్వ పరిశీలనలోనే కాదు, శక్తియుక్తులను ఉపయోగించుకోవడంలోనూ ఆయనది అందె వేసిన చెయ్యి. అందువల్లే ఎడారిలాంటి భూమి ఆయన చేతిలో పచ్చటి క్షేత్రమైంది. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అది కేంద్రం అయింది.

మరిన్ని వార్తలు