చిత్రాల్లో సిలబస్‌, బొమ్మల టీచరమ్మ

13 Feb, 2020 11:31 IST|Sakshi
సోలిపూర్‌ పాఠశాలలో పెయింటింగ్‌ వేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మ

గోడలపై పాఠ్యాంశాలను చిత్రిస్తూ పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా సిలబస్‌ను బోధిస్తున్న తిరునగరి పద్మ.. పుస్తకాల్లోని విషయాలను నేరుగా చెప్పడం కంటే బొమ్మలు, గుర్తుల రూపంలో చూపిస్తే అవి ఎప్పటికీ పిల్లలకు గుర్తుంటాయని అంటున్నారు. బడి పరిసరాలను కూడా తన చిత్రాలతో అందంగా మార్చేస్తున్న ఈ ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలు తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. పద్మ ఉపాధ్యాయురాలే అయినప్పటికీ.. పిల్లలకు బొమ్మల ద్వారా పాఠాలను అర్థం చేయించడంతో పాటు సమాజంలో వివక్షకు గురి అవుతున్న మహిళల సమస్యలపైన కూడా తన కుంచెను ఎక్కుపెట్టారు. ఈమె స్వస్థలం హన్మకొండ. 2008 డీఎస్సీలో తెలుగు పండిట్‌గా ఎంపికై, దేవరుప్పుల మండలం రామరాజుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలో పని చేశారు. తర్వాత సోలిపూర్‌ పాఠశాలకు వచ్చారు. 

రైలు బోగీగా తరగతి గది
తనకూ టీచరే స్పూర్తి
ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో డ్రాయింగ్‌ టీచర్‌ గీసే చిత్రాలను పద్మను ఆకర్షించాయి. అప్పటి నుంచి పై చదువుల్లో నిమగ్నం అయినప్పటికీ తనకు ఇష్టమైన చిత్రకళను సాధన చేస్తూ వచ్చారు. తనే టీచర్‌ అయ్యాక.. పాఠాలకు బొమ్మల రూపం ఇచ్చి పిల్లలకు ఆసక్తి కలిగేలా విద్యాబోధన చేస్తున్నారు. అందుకోసం సొంత డబ్బులను పెట్టి రంగులు కొంటున్నారు.  స్కూల్‌ టైమ్‌ పూర్తయ్యాక, ఆదివారాలు.. గోడలపై చిత్రాలు వేయడానికి తన సమయాన్ని కేటాయించుకున్నారు. పాఠశాల గదులు, ప్రహరీ గోడలపై పద్మ వేస్తున్న పెయింటింగ్స్‌ పిల్లల్లే కాదు, పెద్దల్నీ ఆకర్షిస్తున్నాయి.  ఆలోచింపజేస్తున్నాయి. బోధించడానికి, పిల్లలు అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉండే అంశాలను చిత్రాల రూపంలో గీయడానికి ఆమె చాలానే కష్టపడతారు. తెలుగు వ్యాకరణం, ప్రపంచపటం, సూర్య కుటుంబం, రైలుబండి, హరితహారం, పల్లె అందాలు.. ప్రతి చిత్రం వెనుక పద్మ కష్టం, సృజనాత్మకత ఉంటాయి. మొత్తానికి ఈ చిత్రాలతో ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.

సామాజిక స్పృహ
మరోవైపు తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతలపైన కూడా తన గళం వినిపిస్తున్నారు పద్మ. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై తరచు కవితలు రాస్తుంటారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తారు. ప్రత్యక్షంగా సామాజిక సేవ కూడా చేస్తుంటారు. స్టీల్‌ పాత్రలను, పాత బట్టలను సేకరించి వాటిని పాఠశాలలోని నిరుపేద, అనాథ పిల్లలకు అందిస్తుంటారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన పద్మ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేషనల్‌ అవార్డు, సావిత్రి భాయి పూలే రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.– ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామఫొటోలు: బైరి శ్రీకాంత్‌

మరిన్ని వార్తలు