ఏంటా ఆశ్చర్యం?

3 Jan, 2019 00:12 IST|Sakshi

చెట్టు నీడ

ఓ గురువు తన శిష్యులకు పాఠం చెబుతున్నారు.అప్పుడు ఓ నాస్తికుడు అక్కడికి వచ్చాడు. ఆ గురువుగారి తీరుతెన్నులను, విధానాలను కించపరుస్తూ మాట్లాడాడు. అవమానపరిచాడు. ఇదంతా అక్కడున్న శిష్యులు చూస్తూనే ఉన్నారు. వారికేమీ బోధపడలేదు. ఎందుకంటే అతనిని అంతకుముందెన్నడూ వారెవరూ చూడలేదు. తమ గురువుగారు ఎవరితోనూ గొడవపడటం కానీ వాదులాటకు దిగటం కానీ ఎప్పుడూ చూడలేదు. అసలాయనలో కోపమే ఎరుగరు. అటువంటిది ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చీరావడంతోనే రెచ్చిపోవడం వారికి విచిత్రంగా చూస్తున్నారు. గురువుగారు ఎలా స్పందిస్తారోనని వారిలో ఆసక్తి పెరిగింది.మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడుతూ వచ్చిన ఆ నాస్తికుడు ‘‘మిమ్మల్ని ఓ బౌద్ధ భిక్షువుగానో లేక జెన్‌ గురువుగానో నేనెందుకు స్వీకరించాలి... ఎందుకు నమస్కరించాలి’’ అని అడిగాడు కటువుగా.అతనలా అంటున్నప్పటికీ ఆ గురువుగారేమీ ఆగ్రహించలేదు. రెచ్చిపోలేదు. అతని మాటలను ఖండించలేదు.

అతనితో ఎంతోమర్యాదగానే మాట్లాడుతూ, ‘‘మీరు చెప్పిందల్లా నిజమే. మీ సిద్ధాంతాలనూ మీ నమ్మకాలనూ నేను ఎందుకు కాదంటాను....మీ దారి మీది. నా దారి నాది. నేనేమీ మీ అభిప్రాయాలకు అడ్డురాను.కానీ ఒక్క విషయం... నేనే కాదు నాలాంటివారు ఓ ఆశ్చర్యాన్ని చెయ్యగలరు’’ అన్నారా గురువు.‘‘అదేంటీ’’ అని అడిగాడు నాస్తికుడు.గురువుగారు ప్రశాంత చిత్తంతో ఇలా అన్నారు...‘‘ఎవరైనా తప్పు చేసినా, మాకు ద్రోహం చేసినా, అవమానించినా వారిపై మేము మండిపడం. కోప్పడం. ద్వేషం పెంచుకోము. వారి మాటలను అప్పటికప్పుడే మరచిపోతాము. అంతే తప్ప వాటిని మనసులో ఉంచుకుని లోలోపల రగిలిపోము....’’ అని చెప్పారు.అందుకే అంటారు జ్ఞానుల దగ్గర ఒకరిని క్షమించిన వాటి నీడలు కూడా చూడలేమని.
 – యామిజాల జగదీశ్‌  

మరిన్ని వార్తలు