నేను చచ్చిన తర్వాత రా

13 Jul, 2018 00:10 IST|Sakshi

చెట్టు నీడ

జనక మహారాజు గొప్ప వేదాంతి. అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలు నేర్చుకుని రావలసిందిగా ఓ గురువు, తన శిష్యుడైన ఓ యువకుడిని పంపించాడు. ఆ యువకుడు ఎంతో దూరం ప్రయాణం చేసి, జనకుడిని వెదుక్కుంటూ వచ్చాడు. అతను వచ్చే సమయానికి జనకుడు కొలువులో ఉన్నాడు. ఆ సమయంలో లోనికి వెళ్లడం భావ్యం కాదు కనుక ఈ యువకుడు, బయట ద్వారం దగ్గర ఉన్న కావలి వారికి ఒక చీటీ మీద ‘మీ వద్ద వేదాంత విషయాలను నేర్చుకుని రమ్మని మా గురువు గారు పంపించగా నేను వచ్చాను’ అని రాసి లోపలకు పంపించాడు. జనకుడు ఆ చీటీ చూసి, దాని వెనకాల ‘నేను చచ్చిన తర్వాత రండి’ అని రాసి తిరిగి పంపించాడు. ఆ యువకుడికి మతిపోయినంత పనైంది. ‘ఇదేంటి, నేను ఈయన దగ్గర వేదాంత రహస్యాలను తెలుసుకుందామని వస్తే ఈయనేమో తాను చచ్చిన తర్వాత రమ్మని అంటున్నాడు... అనుకుని నిరాశతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తే ప్రయాణ బడలిక, ఆకలి, దప్పికలతో సొమ్మసిల్లినట్లు పడుకున్నాడు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి ఒక సత్రం కనిపిస్తే అక్కడికి వెళ్లాడు. కొంత సొమ్ము చెల్లించి, ఆకలి దప్పికలు తీర్చుకున్నాడు. మరునాడు మళ్లీ రాజు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ రాజ దర్శనం కాలేదు. ప్రతిసారీ తాను వచ్చానని కావలి వారితో కబురు పెట్టడం, రాజు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపెయ్యడం... అలా కొన్ని రోజులు గడిచాయి. కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తున్నారు. దేని మీదా ధ్యాస నిలవడం లేదు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నాడు. 

ఒక్కోసారి తనను అంత దూరం పంపించినందుకు గురువు మీద కోపం వచ్చి పెద్దగా తిట్టుకుంటున్నాడు. గొణుక్కుంటున్నాడు. చివరికి  తెచ్చుకున్న సొమ్మంతా అయిపోయింది. ఆకలితో నకనకలాడుతూ చెట్టుకింద కూర్చున్నాడు. అతని పరిస్థితి చూసి జాలిపడి ఎవరో తినడానికి ఏదో పెట్టబోయారు. అతనికి కోపం వచ్చింది. ‘నేనేమైనా అడుక్కునేవాడినా’ అని కసిరి పంపించేశాడు. అలాగే మునగదీసుకుని పడుకున్నాడు. ఆకలితో నిద్ర పట్టలేదతనికి. మరునాడు మళ్లీ ఎవరో ఏదో పెట్టడానికి ప్రయత్నించారు. ఈసారి కాదనలేదు. చేతులు చాచి ఆత్రంగా అందుకుని తినేశాడు. ఈసారి అతనికి ఆకలి తీర్చుకోవాలన్న ఆరాటం తప్ప తానెవరో, ఎక్కడినుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో గుర్తురాలేదు. ఆకలి తీరాక దుస్తులు తడుముకుంటుంటే చీటీ ఏదో చేతికి తగిలింది. తెరిచి చూశాడు. అప్పుడు స్ఫురించిందతనికి రాజు గారు చెప్పిన మాటల్లోని భావం... ‘నేను చచ్చిన తర్వాత’ అంటే ‘నేను’ అనే భావన నశించిపోవాలన్న సంగతి. దాంతో అతనికి ఇక రాజుగారి దగ్గరకు తిరిగి వెళ్లవలసిన అవసరం కలగలేదు. గొప్ప వేదాంతి అయ్యాడు. 
– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు