మౌనంగా ఒక పూట

3 Mar, 2018 00:05 IST|Sakshi

చెట్టు నీడ 

సాయంత్రమైంది. పొద్దు గుంకింది.  నిశ్శబ్దంగా చీకటి ఆవరిస్తోంది.  బయట కీచురాళ్ల చప్పుడు మొదలవుతోంది.

ఒక ఆశ్రమ పాఠశాలలో ఆ రోజు మౌనం గొప్పతనం గురించి బోధించాడు గురువు. వారానికి ఒక రోజైనా మౌనంగా ఉండటం వల్ల ఎంత మానసిక ప్రశాంతత దొరుకుతుందో వివరించాడు. పాఠం విన్న నలుగురు యువ విద్యార్థులు ఆరోజు నుంచే దాన్ని అమలు చేయాలనుకున్నారు. వాళ్లు అలిఖితంగా సంజ్ఞల ద్వారానే ఆ రోజంతా పెదవి విప్పకూడదని ఒప్పందం చేసుకున్నారు.  నలుగురూ తమ బసకు వెళ్లారు. మౌనంగా వారి పొద్దు గడిచింది. ఒక్క మాటా మాట్లాడకుండానే వారి వారి పనులు చేసుకున్నారు. సాయంత్రమైంది. పొద్దు గుంకింది. నిశ్శబ్దంగా చీకటి ఆవరిస్తోంది. బయట కీచురాళ్ల చప్పుడు మొదలవుతోంది.

‘ఎవరైనా లాంతరు వెలిగిస్తే బాగుంటుంది’ అన్నాడు ఒక యువకుడు.అంతసేపూ వున్న మౌన వాతావరణం ఆ మాటతో భంగపడింది.మొదటి యువకుడి మాటకు ఆశ్చర్యపోతూ, ‘మనం ఈరోజంతా ఒక్క మాట కూడా మాట్లాడకూడదని అనుకున్నాం కదా!’ అని గుర్తు చేశాడు మరో యువకుడు.ఈ ఇద్దరి సంభాషణ వల్ల మూడో యువకుడికి కోపమొచ్చింది. ‘మీ ఇద్దరూ మూర్ఖుల్లా వున్నారు. ఎందుకు మాట్లాడారు?’ అని అడిగాడు.‘అయితే నేనొక్కడినే అన్నమాట ఇంతసేపూ మాట్లాడకుండా వున్నది’ అని ముగించాడు నాలుగో యువకుడు.

>
మరిన్ని వార్తలు