గురుబ్రహ్మి

5 Sep, 2014 00:30 IST|Sakshi
గురుబ్రహ్మి

 1979...
 ప. గో. జిల్లా, అత్తిలిలోని
 ఎస్.వి.ఎస్.ఎస్.ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్...
 వేసవి సెలవులు పూర్తయి వారం అవుతోంది.
 అన్ని క్లాసుల్లోనూ స్టూడెంట్స్ పలుచ పలుచగా ఉన్నారు.
 కానీ, ఒక్క క్లాస్ రూమ్ మాత్రం హౌస్‌ఫుల్!
 ఒక తెలుగు లెక్చరర్ పద్యం పాడుతుంటే పిన్‌డ్రాప్ సెలైన్స్.
 అదే పద్యాన్ని ఎన్టీఆర్‌లాగా, ఏయన్నార్‌లాగా, కృష్ణలాగా
 మిమిక్రీ చేసి పాడుతుంటే అందరూ ఈలలూ చప్పట్లూ.
 బట్టీ పట్టకుండానే ఆ పద్యం కంఠతా వచ్చేసింది వాళ్లకు.
 ఆ లెక్చరర్ స్టయిలే అంత!
 ఏదైనా కామెడీ మిళాయించే చెబుతారు.
 చేదు మాత్రకు షుగర్ కోటింగ్ తరహా.
 లేకపోతే ఓ తెలుగు క్లాస్‌కి అంత అంటెడెన్సా!
 ఇలాంటి ఇన్సిడెంట్లు ఆ తెలుగు లెక్చరర్ ఖాతాలో చాలానే ఉంటాయ్.
 ఇంతకూ ఆ తెలుగు లెక్చరర్ ఎవరో చెప్పనేలేదు కదా.
 హి ఈజ్ వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం!
 30 ఏళ్లుగా తెలుగు తెర నంబర్‌వన్ కమెడియన్.
 ఆయన పూర్వాశ్రమంలో తెలుగు లెక్చరర్.
 సుమారు ఎనిమిదేళ్లు అత్తిలి కాలేజ్‌లోనే పనిచేశారు.
 ఆ ఊరితోనూ... ఆ కాలేజ్‌తోనూ...
 అక్కడి స్టూడెంట్స్‌తోనూ...
 బ్రహ్మానందంకు బోలెడంత అనుబంధం ఉంది.
 ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లంతా ఎక్కడెక్కడో ఉన్నారు.
 ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్లకు ఇప్పటికీ గురువు గుర్తున్నారు.
 వాళ్లల్లో కొంతమందిని తమ గురువు గురించి అడిగితే...
 ఆ జ్ఞాపకాల ప్రవాహంలో తడిసి ‘బ్రహ్మానంద’భరితులయ్యారు.

 
ఆయన బోధించిన సవర్ణదీర్ఘ సంధి, చంపకమాల, ఉత్పలమాల... అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి!

‘కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ... అనే పద్యాన్ని ఎన్టీఆర్ అయితే ఎలా పాడతారు... ఏయన్నార్ అయితే ఇంకెలా పాడతారు... కృష్ణ, గుమ్మడి అయితే ఇంకే తీరుగా పాడతారు... ఒకసారి ఊహించుకోండి. మాకైతే ఆ అవసరం రాలేదు. ఎందుకంటే మా గురువుగారు... అదేనండీ బ్రహ్మానందంగారు ఇవన్నీ మాకు క్లాసులో మిమిక్రీ చేసి వినిపించేవారు. అంతేకాదు, ఇందిరాగాంధీ ఎలా మాట్లాడతారో, అచ్చం అలానే దింపేసేవారు. విమానం ల్యాండింగ్ కూడా భలే చేసేవారు. అసలు ఆయన క్లాస్ అంటేనే జోక్స్‌మయం. అందుకేనేమో మేం జ్వరమొచ్చినా ఆయన క్లాస్‌కి మాత్రం డుమ్మా కొట్టేవాళ్లం కాదు.  
 
ఆయన మిమిక్రీ చేస్తే బ్రహ్మాండం! దానివల్లే ఆయన చుట్టుపక్కల ఊళ్లల్లో పాపులర్ అయిపోయారు. పక్క ఊళ్లలో ఆయన మిమిక్రీ షోస్ చేయడానికి వెళ్తే, నేను ఆయనను నా సైకిల్ మీదే తీసుకెళ్లేవాణ్ణి. అత్తిలి సంత మార్కెట్‌లో ఎరుకల అమ్మన్నగారి డాబాలో, ఆయన, ఇంకో లెక్చరర్‌గారు కలిసి అద్దెకుండేవారు. స్టూడెంట్స్ మెస్ నుంచి మేమే క్యారేజీ పంపించేవాళ్లం.
 
నేను ఆయనకు ప్రియాతిప్రియమైన శిష్యుణ్ణి కూడా! నేను మంచి ఒడ్డూ పొడుగూ అని ఎస్.ఐ. ఉద్యోగానికి వెళ్లమన్నారు. వెళ్లాను కానీ ఆఖరి నిమిషంలో ఎంపిక కాలేదు. నేను లెక్చరర్ అయ్యి, ఎమ్‌ఫిల్, పీహెచ్‌డీ చేశానంటే అందుకు ఆయనే ప్రేరణ. నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అయినా, అప్పుడప్పుడూ మా గురువుగారి పాఠాలు గుర్తుకొచ్చేసి... ‘ముక్కంటి అంటే... మూడు నేత్రములు కలవాడు’ అని చెబుతుంటాను. ఆయన బోధించిన వ్యాకరణం, సవర్ణదీర్ఘ సంధి లాంటి సూత్రాలు ఛందస్సులో చంపకమాల, ఉత్పలమాల... అన్నీ ఇంకా గుర్తున్నాయి. అంత గొప్ప గురువు ఆయన!
 - డా. ఎం. సుందర్రావు, అసోసియేట్ ప్రొఫెసర్, కేసీఆర్‌ఎల్ డిగ్రీ కాలేజ్, భీమవరం
 
ఏదో ఒక జోక్‌తో మొదలుపెట్టి, చాలా తెలివిగా పాఠంలోకి దించేసేవారు!

అత్తిలి అనగానే అందరికీ బ్రహ్మానందంగారే గుర్తుకొస్తారు. అది ఆయన సొంత ఊరు కాకపోయినా, అత్తిలి గురించే ఆయన ఎక్కువ చెబుతుంటారు. అత్తిలి ఆడపడుచుగా ఈ విషయంలో నేను గర్వపడుతుంటా. నేను ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్‌ని. ఎప్పుడైనా మేం క్లాస్ ఇంట్రస్ట్ లేదని చెప్పినా, ఏదో ఒక జోక్‌తో మొదలుపెట్టి, చాలా తెలివిగా పాఠం చెప్పేసేవారు. క్లాసులో ఎంత సరదాగా ఉండేవారో. డిగ్రీ తర్వాత నాకు పెళ్లయి, మధ్యప్రదేశ్ వెళ్లిపోయా. ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చేశాం. ఇంతవరకూ ఆయనను కలవలేదు కానీ, ఇప్పటికీ అప్పటి బ్రహ్మానందంగారు అలానే గుర్తుండిపోయారు.
 - స్వర్ణలత, గృహిణి, హైదరాబాద్
 
బోర్ కొట్టకుండా పాఠమెలా చెప్పాలో ఆయనను చూసి నేర్చుకోవాలి!

రాజమండ్రిలో ‘అల్లుడా మజాకా’ షూటింగ్ జరుగుతోంది. నేనప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎస్‌ఐగా పనిచేస్తున్నా. చిరంజీవిగారు, బ్రహ్మానందంగారు... ఇంకా చాలామంది యాక్టర్లున్నారు. నేను బ్రహ్మానందంగారి దగ్గరకెళ్లి ‘‘నేను మీ అత్తిలి కాలేజ్‌లో  స్టూడెంట్‌ని’’ అనగానే, గుర్తు పట్టేశారు. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అంతటి గొప్ప నటుడి దగ్గర మేం పాఠాలు నేర్చుకున్నందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాం.
 
పిల్లలకు బోర్ కొట్టకుండా పాఠమెలా చెప్పాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. ‘గురువు’ అనే పదానికి గొప్ప రోల్‌మోడల్ ఆయన. ఓ చిన్న కాలేజీలో పనిచేసిన ఆయన, ఈ రోజు ప్రపంచం అంతా తెలిసే స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఏ హస్తమూ లేదు. అంతా ఆయన స్వయంకృషే. ‘అహ నా పెళ్ళంట’లో ‘అరగుండు’ పాత్ర చూసి ఎంతగా నవ్వుకున్నామో, లేటెస్ట్‌గా ‘రేసుగుర్రం’లో ‘కిల్‌బిల్ పాండే’ చూసీ అలాగే నవ్వుకున్నాం. ఆయన తర్వాత ఎంతోమంది కమెడియన్లు వచ్చారు... వెళ్లారు. కానీ ఆయన ఇప్పటికీ నెంబర్‌వన్‌గానే ఉన్నారు. ఈతరం వాళ్లు ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి.
 - అరిటాకుల శ్రీనివాసరావు, పోలీస్ అధికారి, శ్రీకాకుళం
 
నా పెళ్లిలో మిమిక్రీ చేసిఅందర్నీ నవ్వించారు!

నేను 1976-79 స్టూడెంట్‌ని. బాగా గుర్తు... అప్పట్లో ఆయన పట్నాల వెంకటేశ్వర్రావుగారి జ్యూయెలరీ షాపు పక్కనే అద్దెకుండేవాళ్లు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉండేది. ఆరోజుల్లో మా నాన్నగారు కాలేజ్ వైస్ ప్రెసిడెంట్. కానీ సార్ ఆయన్ని కూడా వదిలేవారు కాదు... బాగా అనుకరించేవారు. ఒక్కోసారి నాన్నగారి గొంతుతో నన్ను  కంగారు పెట్టేవారు. మాకు కూడా మిమిక్రీ నేర్పుదామని తెగ ట్రై చేశారు కానీ, మా వల్ల కాలేదు.  
 
1984 ఫిబ్రవరి 19న జంగారెడ్డిగూడెం సమీపంలోని ఓ పల్లెటూళ్లో నా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి మా గురువుగారు బ్రహ్మానందంగారు వచ్చారు. నేనడక్కుండానే మిమిక్రీ చేసి, పెళ్లికి వచ్చిన వారందరినీ భలే నవ్వించారు. ఇప్పటికీ ఈ విషయం అందరికీ నేను గర్వంగా చెప్పుకుంటుంటాను. ఆ తర్వాత అదే కాలేజ్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా చేసి రిటైరయ్యాను. ఇప్పటికీ నేనాయనతో టచ్‌లో ఉన్నా. మొన్నీమధ్యనే నర్సాపురంలో కలిశా. అంత పెద్ద స్థాయికెదిగినా ఇప్పటికీ ఆయన ‘‘ఏరా పాండూ!’’ అని ప్రేమగా పలకరిస్తుంటారు. అలాంటి గురువులు చాలా అరుదు!
 - బుద్దాల పాండురంగారావు, సీనియర్ అసిస్టెంట్ (రిటైర్డ్ ), అత్తిలి
 
ఆయన దగ్గర పాఠాలతోపాటు మనుషుల్ని ఎలా డీల్ చెయ్యాలో కూడా తెలుసుకున్నాను!

మా నాన్నగారు బందెల శ్రీరామ్మూర్తిగారు 1975లో ఈ కాలేజీ స్థాపించారు. సున్నం ఆంజనేయులు గారిని ప్రిన్సిపాల్‌గానూ, బ్రహ్మానందం గారిని తెలుగు లెక్చరర్‌గానూ మా నాన్నగారే అపాయింట్ చేశారు. నేను 1977లో బీకామ్‌లో చేరా.
 
మామూలుగా తెలుగు క్లాస్ అంటే చాలామందికి బోర్. కానీ మా కాలేజ్‌లో ఒక్క తెలుగు క్లాస్‌కే ఫుల్ అటెండెన్స్! దట్ క్రెడిట్ గోస్ టూ బ్రహ్మానందంగారు! అసలాయన తెలుగు పాఠం చెబుతుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. పాఠం మధ్యలో జోక్స్ చెప్తూ, తెలుగు పాఠాన్ని అంత హాస్యస్ఫోరకంగా గుర్తుండిపోయేలా ఎవరూ చెప్పలేరేమో! అందరూ నోళ్లు వెళ్ళబెట్టి పాఠాలు వినడమే తప్ప, ఆవలింతలొచ్చే ప్రసక్తే లేదు. అందుకేనేమో తెలుగులో ఒక్కరు కూడా ఫెయిలయ్యేవారు కాదు.
 
రామాయణ, భారతాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. పాఠ్యాంశంలో లేకపోయినా అప్పుడప్పుడూ వాటి గురించి బోధించేవారు. నాకెప్పుడూ ఆయన సీరియస్‌గా కనబడినట్టు గుర్తు లేదు. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. స్టూడెంట్స్‌ని కొట్టడం, తిట్టడం లాంటివి కూడా చేసేవారు కాదు. స్టూడెంట్స్‌తో చనువుగా ఉండేవారు కానీ, వాళ్లు నిక్‌నేమ్స్ పెట్టేంత అవకాశం ఇచ్చేవారు కాదు. ఆయన క్లాసు వల్ల పాఠాలతో పాటు, మనుషుల్ని ఎలా డీల్ చేయాలన్న అంశం కూడా మాకు జీవితంలో ఉపయోగపడింది. ఆయన దగ్గర చదువుకున్నవాళ్లు చాలామంది పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు, జడ్జీలు, ఎమ్మార్వోలు, తాసిల్దార్లు అయ్యారు. నేను డిగ్రీ పూర్తయిన రెండేళ్ల తర్వాత అదే కాలేజ్‌లో సూపరింటెండెంట్‌గా చేరా. వచ్చే ఏడాది రిటైరవుతున్నా.
 
ఆయన మొదటినుంచీ నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవారు. ఆయన ఎక్కడకు వెళ్లినా వెంట నేనుండాల్సిందే. ఆయన బ్యాచ్‌లర్‌గా ఉన్నన్ని రోజులూ మాతో కలిసి సినిమాలకు వచ్చేవారు. తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు... ఇలా ఎక్కడ సినిమా రిలీజైతే అక్కడకు వెళ్లిపోయేవాళ్లం. చుట్టుపక్కల ఊళ్లల్లో మిమిక్రీ షోస్ చేయడానికి వెళ్లినపుడు తోడుగా నన్ను తీసుకెళ్లేవారు. ఆఖరికి తెనాలి దగ్గర ఓ పల్లెటూళ్లో జరిగిన ఆయన పెళ్లిచూపులకు కూడా నన్ను ఆయన వెంట తీసుకెళ్లారు. ఈ కాలేజ్‌లో పనిచేసిన మా గురూజీ తెలుగువాళ్లంతా గర్వపడే స్థాయికెదిగారు. కానీ ఇంతవరకూ మేం ఆయనను కాలేజ్ తరపున సన్మానించలేకపోయామనే అసంతృప్తి నాలో చాలా ఉంది. మాస్టారూ! త్వరలోనే మీకు గురుదక్షిణ చెల్లించుకుంటాం !
 - బందెల సూర్యచంద్రరావు, ఎస్.వి.ఎస్.ఎస్. డిగ్రీ కళాశాల సూపరింటెండెంట్, అత్తిలి
 

మరిన్ని వార్తలు