చదువుకి వైద్యం

5 Sep, 2018 00:00 IST|Sakshi

నేడు టీచర్స్‌ డే

డాక్టర్‌ అవబోయి టీచర్‌  అవలేదు అనూరాధ. డాక్టర్‌ అయ్యాక.. టీచర్‌ అవ్వాలనుకుని చాక్‌పీస్‌తో చదువుకు  వైద్యం చేయడానికి బయల్దేరారు.

డాక్టర్‌ అనూరాధ కిశోర్, ఢిల్లీలో మంచి పేరున్న పీడియాట్రీషియన్‌. పిల్లల డాక్టర్‌గా పదిహేడేళ్ల అనుభవం ఆమెది. అలాంటి డాక్టరమ్మ ఓ రోజు టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు చేస్తానంటూ అప్లికేషన్‌ పెట్టుకున్నారు! ఆ మాట విన్న తోటి డాక్టర్లే కాదు, ఆమె అప్లికేషన్‌ను పరిశీలించి, ఆమోదించిన అధికారులు కూడా విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఈవిడకిదేం పిచ్చి అని ముఖాన అనలేదన్నమాటే కానీ దాదాపుగా కొంచెం అటూఇటుగా వారందరి అభిప్రాయం ఇదే!

చదువే అనారోగ్యమా?
ఇంతకీ అనూరాధ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం... పిల్లలు తరచూ అనారోగ్యం పాలు కావడమే. పిల్లలంటే ఆమె పిల్లలు కాదు. ఆమె దగ్గరకు తల్లిదండ్రులు తెస్తున్న పిల్లలు. ఎన్ని పరీక్షలు చేసినా పిల్లల్లో ఫిజికల్‌గా అనారోగ్యం కనిపించేది కాదు. అయితే ఒత్తిడికి లోనవుతున్న లక్షణాలు కనిపించేవి. మానసికంగానే వారిని ఏదో పీడిస్తున్నట్లుండేది. ఈ వయసులో వాళ్లకు ఇంకేం బరువు బాధ్యతలుంటాయని పీడించటానికి? బహుశా వారిని భయపెడుతున్న భూతం చదువే కావచ్చు, వారు భయపడుతున్న బూచి స్కూలే కావచ్చు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక నొప్పిని వాళ్లే వెతుక్కుంటూ ఉండవచ్చు. ఇవన్నీ తన ఊహాజనితమైన అనుమానాలేనా లేక పూర్తిగా నిజాలా? ఇది తెలియాలంటే స్కూలు ఎలాగుందో తెలుసుకోవాలి? పిల్లల మీద పాఠాల ఒత్తిడి ఎలా ఉంటోందో తెలుసుకోవాలి అనుకున్నారు డాక్టర్‌ అనూరాధ. ఆమె టీచర్‌ ట్రైనింగ్‌ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి వెనుక ఇంత కథ ఉంది.

పిల్లలవన్నీ సిక్‌ లీవులే!
కోర్సు అయ్యాక, ఢిల్లీ సమీపంలోని గుర్‌గ్రామ్‌లోని ప్రోగ్రెసివ్‌ స్కూల్‌లో కిండర్‌గార్డెన్‌ టీచర్‌గా చేరారు అనూరాధ. క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టిన తరువాత ఆమెకి ఒక్కో సందేహానికీ సమాధానం దొరికింది. క్లాస్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వాళ్ల అటెండెన్స్‌ హిస్టరీని, హెల్త్‌హిస్టరీని పరిశీలించారామె. ఏ క్లాస్‌లో అయినా చదువులో చురుకైన పిల్లలతోపాటు, రమారమిగా చదివేవాళ్లు, ఒక మోస్తరుగా చదువుతూ బొటాబొటి మార్కులతో గట్టెక్కేవాళ్లు, పాస్‌మార్కులు తెచ్చుకోవడమూ కష్టమే అనిపించే పిల్లలూ ఉంటారు. చురుగ్గా ఉండే పిల్లలు, యావరేజ్‌గా చదివేవాళ్లలోనూ అభద్రత కనిపించడం లేదు కానీ అంతకంటే తక్కువ గ్రహింపు శక్తితో ఉన్న పిల్లల్లోనే అటెండెన్స్‌ తగ్గడం గమనించారామె. స్కూలుకి ఆబ్సెంట్‌ అయిన కారణాలు ‘అనారోగ్యాలే’ అయి ఉంటున్నాయి!

తెలిసింది అడిగితే ఆత్మవిశ్వాసం
యావరేజ్‌ పిల్లల్ని చురుకైన పిల్లలతో కలిపి పాఠాలు చెప్పి వదిలేస్తే కుదరదనుకున్నారామె. అలా చెప్పడం వల్ల చురుకైన పిల్లలు త్వరగా నేర్చుకుంటూ, టీచర్‌ అడిగిన ప్రశ్నకు టక్కున బదులిస్తూ, తోటి పిల్లల వైపు విజయగర్వంతో చూస్తుంటారు. టీచర్‌ యావరేజ్‌ స్టూడెంట్‌ని ప్రశ్న అడిగినప్పుడు ఆ పిల్లవాడు తనకు సమాధానం తెలియదనే భయంతో బిగుసుకుపోతుంటాడు. తరచూ ఇలా జరుగుతుంటే పిల్లల్లో న్యూనత పెరిగిపోతుంది, ముడుచుకుపోతారు. స్కూలంటేనే భయపడుతూ, మానేయడానికి దారులు వెతుక్కుంటారు. మరే కారణం చెప్పినా అమ్మానాన్నలు ఒప్పుకోరు కాబట్టి పొట్టలో నొప్పి, కాలు నొప్పి వంటి కారణాలు చెప్తారు. మరికొందరిలో పాఠాల ఒత్తిడి, స్కూలు భయంతో జ్వరం వస్తుంటుంది కూడా. అందుకే అలాంటి పిల్లలను ఎక్కువ సేపు ఆటపాటల్లో ఉంచుతున్నారు అనూరాధ. అంతకంటే ఎక్కువగా ఆమె ఒక విషయాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. డల్‌ స్టూడెంట్స్‌లో ఎవరు ఏ పాఠాన్ని బాగా నేర్చుకున్నారో గమనించారు. క్లాస్‌లో వాళ్లను ఆ పాఠాల్లోని ప్రశ్నలే అడిగేవారు. దాంతో ఆ పిల్లల్లో టీచర్‌ ప్రశ్నలకు తాము కూడా సమాధానం చెప్పగలమని ఆత్మవిశ్వాసం కలిగింది. క్రమంగా స్కూలంటే భయం తగ్గడం మొదలుపెట్టింది.

ఫస్ట్‌ ఎయిడ్‌ కూడా క్లాస్‌లోనే
అనూరాధ క్లాస్‌లో పిల్లలంతా ఐదేళ్లలోపు వాళ్లే. ఆ వయసు పిల్లలు ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకోకుండా ఉండరు. పిల్లల గాయాలకు అనూరాధ స్వయంగా మందురాసి కట్టు కట్టడాన్ని చూసిన తోటి టీచర్లు... ‘టీచరైనా మీలో డాక్టర్‌ ఎక్కడికీ పోలేద’ని చమత్కరిస్తుంటారు. అప్పుడామె ‘‘డాక్టర్‌ వైద్యాన్ని వదిలేయవచ్చేమో కానీ వైద్యం డాక్టర్‌ని వదిలి వెళ్లదు. స్టెతస్కోపు పక్కన పెట్టి బ్లాక్‌బోర్డు పక్కన నిలబడగలిగాను, కానీ గాయాన్ని చూసినప్పుడు డాక్టర్‌ బయటకు వస్తుంది’’ అంటారు. అనూరాధ టీచర్‌ చేస్తున్న ప్రాక్టీస్‌ మంచి ఫలితాలనే సాధిస్తోంది. పిల్లలకు చదువు చెప్పడం రాకపోతే పిల్లలు పేషెంట్‌లవుతారు. చదువు చెప్పే విధానానికే వైద్యం చేస్తే పిల్లలు హాస్పిటల్‌ ముఖం చూడకుండా పెరుగుతారు. అనూరాధ అధ్యయనంలో తెలిసిన సంగతి ఏమిటంటే... పిల్లలు స్కూలంటే ముఖం చాటేస్తున్నారంటే, లోపం ఉన్నది పిల్లల్లో కాదు. ఆడుతూ పాడుతూ, ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా పాఠాన్ని చెప్పడం తెలియని విద్యావిధానానిదే లోపం. ఆ విధానంలో చదువు చెప్తున్న స్కూళ్లదే అసలైన లోపం. ఆ లోపాన్ని సరిదిద్దడానికి టీచర్లే పూనుకోవాలి.

ఐక్యూ వేరైనా ఒకేలా చూడాలి
పిల్లలతో గడపడం నాకిష్టం, అందుకే పీడియాట్రీషియన్‌ కోర్సు చదివాను. ఇన్నేళ్ల పాటు నా దగ్గరకు వచ్చిన పిల్లలు పేషెంట్‌లు. ఇప్పుడు నాకు రోజూ ఉదయాన్నే పిల్లలు పువ్వుల్లా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. చదువంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, క్లాస్‌ రూమ్‌లో పిల్లలందరినీ సమానం చేయగలగడం. నేనదే చేస్తున్నాను. నేను ఈ ఏడాది ఏప్రిల్‌లో టీచర్‌గా చేరాను. అప్పటి వరకు తరచూ స్కూలుకి ఆబ్సెంట్‌ అయిన పిల్లలెవరూ ఇప్పుడలా లేరు. స్కూల్‌ని ఇష్టపడుతున్నారు. 
– అనూరాధ 
– మంజీర

మరిన్ని వార్తలు