కత్తెర పురుగుకు కళ్లెం

4 Dec, 2018 05:37 IST|Sakshi
కత్తెర పురుగు ఆశించిన మొక్కజొన్న పొలంలో తిప్పుకొని కొత్త చిగురేసిన మొక్క

మొక్కజొన్న నుంచి జొన్నకు పాకిన వైనం

రసాయనిక వ్యవసాయంలో విధ్వంసం సృష్టిస్తున్న

కత్తెర పురుగు ప్రకృతి సేద్య పద్ధతుల్లో అదుపులో ఉందంటున్న శాస్త్రవేత్తలు

రసాయనాలు వాడకుండా అదుపు సాధ్యమే: ఎఫ్‌.ఎ.ఓ.

మొక్కజొన్నను ఖరీఫ్‌లో ఆశించిన ఫామ్‌ ఆర్మీ వార్మ్‌ (కత్తెర పురుగు) తెలుగు రాష్ట్రాల్లో జొన్నకూ పాకింది. మొక్కజొన్నను అమితంగా ఇష్టపడే ఈ లద్దెపురుగు ఆ పంట అందుబాటులో లేనప్పుడు ఇతరత్రా 80 రకాల పంటలకు పాకే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) చెబుతోంది. చాలా ఏళ్లుగా అమెరికా, ఆఫ్రికాలలో పంటలను ఆరగిస్తున్న ఈ పురుగు మన దేశంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చాలా రాష్ట్రాలకు పాకింది.

గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇది మొక్కజొన్న పంటను ఆశించింది. మొక్కజొన్న నుంచి కొన్ని చోట్ల జొన్నకు, ఇతర రాష్ట్రాల్లో చెరకుకు కూడా పాకినట్లు చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులతో ప్రయోజనం లేదని, కషాయాలు, మట్టి ద్రావణం, రాక్‌ డస్ట్‌ వంటి రసాయనికేతర పద్ధతుల ద్వారానే సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని, రైతులు భయపడ వద్దని ఏపీలో పర్యటిస్తున్న ఎఫ్‌.ఎ.ఓ.కి చెందిన సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ, రైతు సాధికార సంస్థలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కత్తెర పురుగు వల్ల దిగుబడి నష్టాన్ని నిలువరించడవచ్చంటున్నారు.

అంతరపంటలు, కంచె పంటగా నేపియర్‌ గడ్డి
మొక్కజొన్న, జొన్న పొలాల్లో ఖచ్చితంగా అంతరపంటలు వేయటం మేలన్నారు. రబీలో మొక్కజొన్న వేస్తున్న రైతులు 2 సాళ్లు మొక్కజొన్న, 1 సాలు మినుము/పెసర అంతరపంటలుగా వేసుకోవాలి. కంచె పంటగా నేపియర్‌ గడ్డిని 4 వరుసలు వేసుకోవాలని డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ సూచించారు.

అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్‌..
ఈ పురుగు సోకిన మొక్కజొన్న మొక్కల మొవ్వుల్లో అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్‌ వేయడం, నీమాస్త్రం, వేపగింజల కషాయం (మార్కెట్‌లో అమ్మే వేపనూనె అంత బాగా పనిచేయటం లేదు) పిచికారీ ద్వారా ప్రకృతి వ్యవసాయదారులు కత్తెర పురుగు వ్యాప్తిని ఖరీఫ్‌లో సమర్థవంతంగా అరికట్టి, దిగుబడి నష్టాన్ని నివారించుకోగలిగారన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు పురుగు సోకగానే దున్నేశారని డా. జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు.

కత్తెర పురుగు లేత ఆకులను తినేస్తుందని, కండెలను ఏమీ చేయదని అంటూ ఇది కనిపించగానే రైతులు తోటలను తొలగించాల్సిన పని లేదన్నారు.  గుడ్డు దశలో ఉన్నప్పుడు గుడ్లను ఆకులపై గుర్తించి, నలిపేసి నిర్మూలించుకోవడం మంచిదన్నారు. విష ముష్టి (నక్స్‌ వామిక) కాయలను ముక్కలు కోసి 5 రోజులు మురగబెట్టి.. 10 లీటర్ల నీటికి చిన్న గ్లాసుడు చొప్పున ఇది చల్లాలని ఆయన తెలిపారు. పంచదార పొలంలో చల్లితే చీమలు వచ్చి ఈ పురుగులను తినేస్తాయి. 16 లీటర్ల స్రేయర్‌ ట్యాంకు నీటిలో 20 గ్రాముల పంచదార కలిపి పంటపై పిచికారీ చేస్తే.. ఈ తీపికి వచ్చే చీమలు పురుగులను తినేస్తాయని డా. జాకీర్‌ హుస్సేన్‌(88268 97278) అన్నారు.

ఇప్పట్లో నిర్మూలించలేం: ఎఫ్‌.ఎ.ఓ.
‘కత్తెర పురుగు చాలా ఏళ్ల నుంచే అమెరికా, ఆఫ్రికా సహా 60 దేశాల్లో ఉంది. భారత్‌లో అనేక దక్షిణాది, ఉత్తరాది రాష్టాలకు ఈ ఏడాది పాకింది. మొక్కజొన్న, జొన్న, చెరకుకు కూడా సోకింది. ఒకేసారి తుడిచిపెట్టడలేం. చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కానీ, జీవన పురుగుమందులు, ఎర్రమట్టి ద్రావణం, బయో పెస్టిసైడ్స్‌ తదితరాలతో అదుపు చేసుకోవచ్చు. రసాయనిక పురుగుమందులు చల్లితే సమస్య తీరదు. ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతుల ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించగలుగుతున్నట్లు రైతుల పొలాల్లో జరిపిన అధ్యయనంలో గుర్తించాం..’ అని ఎఫ్‌.ఎ.ఓ. సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ(70427 22338) వివరించారు.

డా. జాకీర్‌ హుస్సేన్‌, అన్నే సోఫీ

మరిన్ని వార్తలు