జానపదం టు జపాన్‌

29 Oct, 2018 00:35 IST|Sakshi

దేశంలోనే తొలి మహిళా పండ్వానీ జానపద కళాకారిణి తీజాన్‌ బాయి.. తనకు ప్రాణ సమానం అనుకున్న విద్య కోసం సర్వస్వాన్నీ వదులుకుని సాధన చేశారు. పండ్వానీ కళకే వన్నె తెచ్చారు.

తెలుగువారి హరికథ లాంటిదే ఛత్తీస్‌గఢ్‌ వారి పండ్వానీ. ఒక చేతిలో దండె వీణ, మరో చేతిలో తాళాలు, మెడలో పూలదండ, మైక్‌ ముందర నిలబడి కథ, కథలో భాగంగా నాట్యం.. ఇదీ పండ్వానీల ఆహార్యం. వారిలో ప్రఖ్యాతి చెందిన ఛత్తీస్‌ఘడ్‌ కళాకారిణి తీజాన్‌ బాయి.. భారత కథలను పండ్వానీలో ఉల్లాసంగా చెబుతారు. అనేక అవార్డులతో పాటు ఇటీవలే ఆమె జపాన్‌వారి ప్రతిష్ఠాత్మక ఫుకౌకా అవార్డు అందుకున్నారు. ఇన్ని విజయాల వెనుక ఎంతో కథ ఉంది. అది తీజాన్‌ జీవితంలోని చీకటి వెలుగుల గాథ.

చునక్‌లా పార్థి, సుఖవతి దంపతులు భిలాయ్‌ నగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న గనియారీ గ్రామంలో నివసిస్తుంటారు. ఇద్దరూ నిరక్షరాస్యులు. వారి ఆరుగురు సంతానంలో తీజాన్‌ ఆరో అమ్మాయి. గ్రామంలో నివసిస్తున్న మిగతా ఆడపిల్లల్లాగే తమ కూతురు కూడా ఇంట్లోనే ఉంటూ, ఇంట్లో వారికి సేవలు అందిస్తుంది అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే తీజాన్‌ తీరు వేరు. గొంతు విప్పి పాటలు పాడాలనుకుంది. అది కూడా మామూలుగా పాటలు పాడటం కాదు, పండ్వానీ చెప్పాలనుకుంది. ఆమె ఆలోచన చూసి అంతా ఆమెను ‘పిచ్చిది’ అనుకున్నారు.

తల్లి.. పీక నొక్కేస్తాననేది!
తీజాన్‌ వయసిప్పుడు 61. ఐదు దశాబ్దాల క్రితం ఈ జానపద కళాకారిణి, తాను పాడతానని అన్నప్పుడల్లా తన తల్లి ఏ విధంగా స్పందించేదో గుర్తు చేసుకుంటారు. ‘‘నన్ను బయటకు వెళ్లనియ్యకుండా, మా అమ్మ నన్ను ఇంట్లో పెట్టి బయట తాళం వేసేది. ఒక్కోసారి నా పీక నొక్కడానికి ప్రయత్నించేది. నేను పాడకుండా ఉండాలనేదే ఆవిడ కోరిక.

కాని నేను ఆపేదాన్ని కాదు. ఏం చేయాలి చెప్పండి. నాకు పాడటం అంటే చాలా ఇష్టం. ఇంక వేటి మీదా ఆసక్తి లేదు’  అంటారు తీజాన్‌. పండ్వానీ అనేది ఛత్తీస్‌గఢ్‌ లోని గిరిజన జాతికి చెందిన కళ. పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా ఉంది. పండ్వానీ కళకు గుర్తింపుగా తీజాన్‌కు 1987లో పద్మశ్రీ అవార్డు, 2003లో పద్మభూషణ్‌ వరించాయి. 1995లో నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ మ్యూజిక్, డ్యాన్స్‌ అండ్‌ డ్రామా వారి నుంచి సంగీత నాటక అకాడెమీ అవార్డు సైతం లభించింది.

సంతకం కూడా రాదు
తీజాన్‌ ఎప్పుడు జపాన్‌ వెళ్లినా, అక్కడివారు ఆమెను ‘డాక్టర్‌ తీజాన్‌’ అనే పిలుస్తారు. అందుకు కారణం తీజాన్‌ అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకోవడమే. అక్షరం కూడా చదువుకోని తీజాన్‌ తన పేరును మాత్రం దేవనాగర లిపిలో రాయగలుగుతారు. అది కూడా చేతి మీద పచ్చబొట్టుతో ఉన్న తన పేరును చూసి రాస్తారు.

‘బిల్లులు చెల్లించే చోట సంతకం చేయాల్సివచ్చినప్పుడు.. చేతి మీద ఉన్న పచ్చబొట్టును కాపీ కొడతాను’’ అంటారు నవ్వుతూ తీజాన్‌. కళా సంస్థల ఆహ్వానాలపై తీజాన్‌ జపాన్‌ వెళ్లినప్పుడు ప్రతిచోటా పండ్వానీ ప్రదర్శిస్తూ ఉపన్యాసాలిస్తుంటారు! ఆమె అనేక విద్యావేత్తల సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆ సంఘ సభ్యులంతా తీజాన్‌ జన్మించిన పార్థి సంచార జాతి గురించి తీజాన్‌ని అడిగి తెలుసుకుంటారు. ఆ జాతి చరిత్ర సంస్కృతులు తీజాన్‌ ఎంతో శ్రద్ధగా వివరిస్తారు.

అంతా తాతగారిని నిందించారు
తనకు  పండ్వానీ కళ మీద ఆసక్తి కలగడానికి కారణం తన తాత గారయిన బ్రిజాల్‌ పృధ్వి అంటారు తీజాన్‌. ఆయన దగ్గరే ఆమె ఈ విద్య నేర్చుకున్నారు. తీజాన్‌కి ఈ విద్య నేర్పుతున్నందుకు బంధువులంతా ఆయనను నిందించారు. బ్రిజాల్‌ తొణకలేదు బెణకలేదు, తీజాన్‌కి విద్య నేర్పడమే తన లక్ష్యంగా భావించారు. సబాల్‌ సింగ్‌ చౌహాన్‌ అనే bè త్తీస్‌గఢ్‌ రచయిత రచించిన మహాభారత కథల నుంచి కొన్ని ప్రధాన ఘట్టాలను ఎంచుకుని తీజాన్‌కు నేర్పారు. కొంతకాలానికి ఉమేద్‌ సింగ్‌ దేశ్‌ముఖ్‌ అనే ప్రముఖ కథకుడి దగ్గర రహస్యంగా ఈ విద్య నేర్చుకున్నారు తీజాన్‌.


మళ్లీ భర్త ఇంటికి వెళ్లలేదు!
తీజాన్‌కు పన్నెండేళ్లకే పెళ్లయింది. అత్తవారింట్లో అడుగు పెట్టిన తీజాన్‌కు అక్కడ కూడా చేదు అనుభవమే. అత్తింటివారు.. పండ్వానీ పాడటానికి అభ్యంతరం చెప్పారు. దానితో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి చిన్న గుడిసె వేసుకుని, ఇరుగుపొరుగు వారిని పాత్రలు అడిగి తెచ్చుకుని, వండుకుంటూ సొంతంగా జీవించడం ప్రారంభించింది. విద్యను విడిచిపెట్టడానికి సుముఖత చూపలేదు.

తన పదమూడవ ఏట పొరుగు గ్రామమైన చంద్రఖురీలో 10 రూపాయలకు మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చింది. కాపాలిక పద్ధతిలో.. అంటే నిలబడి పండ్వానీ పాడేది. సాధారణంగా ఈ పండ్వానీ పాడే మహిళలు వేదామతి పద్ధతిలో (కూర్చుని) పాడతారు.  ఒక్కోసారి ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారుతుంటే ఆమె మైమరచిపోయి కథ చెబుతూ ఉద్వేగానికి లోనయ్యేవారు. అటువంటి సమయంలో కథ చెప్పి వేదిక మీద నుంచి కిందకు దిగి, ఒక్క అడుగు కూడా వేయలేక వీల్‌చైర్‌లో ఇంటికి వెళ్లవలసి వచ్చేది. పండ్వానీ అంటే ఆమెకు ప్రాణం. అందుకే ఈ కళలో నైపుణ్యం సాధించారే కాని తీజాన్‌ తన భర్త ఇంటికి మళ్లీ ఎన్నడూ వెళ్లలేదు.

మరిన్ని వార్తలు