ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే...

22 Jul, 2014 23:20 IST|Sakshi
ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే...

వేదిక

కాలం ఎలా ఎవరి కోసమూ ఆగదో... వయసు కూడా అంతే. పరుగులు తీస్తుంది తప్ప ఎక్కడా ఆగనే ఆగదు. అందుకే అది మన చేయి దాటిపోయేలోపు చేయాల్సింది చేసెయ్యాలి. లేదంటే తర్వాత తీరిగ్గా బాధపడినా ఉపయోగం ఉండదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకనేనా? నేను ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయలేదు. దానికి ఇప్పటికీ బాధపడుతున్నాను.
 
నాన్న సివిల్ ఇంజినీర్. అమ్మ డాక్టర్. ఇద్దరూ ఎంత బిజీ అంటే... పొద్దున్న నేను లేవకముందు, సాయంత్రం నేను నిద్రపోయాక మాత్రమే నా ముఖాన్ని చూసేంత. దాంతో వాళ్లిద్దరి ముఖాలూ చూసే చాన్స్ నాకెప్పుడో కానీ దక్కేది కాదు. మొదట్లో బెంగగా ఉండేది. తర్వాత అలవాటైపోయింది. కాలేజీ ఈడు వచ్చేసరికి ఆ ఏకాంతం బాగుందనిపించేది. నేనేం చేసినా అడిగేవాళ్లు లేరని చాలా స్వేచ్ఛగా ఫీలయ్యేదాన్ని. నన్ను చేర్పించినప్పుడు మాత్రమే అమ్మా నాన్నలు నా కాలేజీలో అడుగు పెట్టారు.
 
ఆ తర్వాత ఎప్పుడూ వచ్చిందే లేదు. నాకు మాత్రం ఏ లోటూ రానిచ్చేవారు కాదు. కావలసినంత పాకెట్ మనీ. అది దేనికి ఖర్చు పెడుతున్నానో చూసే తీరిక వారికెప్పుడూ లేదు. నేను ఆ డబ్బును పార్టీలు చేసుకోవడానికి ఉపయోగించాను. తిరగడానికి కారుంది. అందులో నేనెక్కడికి వెళుతున్నానో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మమ్మీకి గానీ, డాడీకి గానీ అనిపించలేదు. నేను ఆ కారును నా బాయ్ ఫ్రెండ్‌తో పిక్నిక్స్‌కి వెళ్లడానికి వాడుకున్నాను. నన్ను అడిగేవాళ్లు లేరన్న ఫీలింగ్ నన్నెంత పెడతోవ పట్టిస్తోందో అప్పుడు అర్థం కాలేదు.
 
ఏనాడూ సరిగ్గా చదివింది లేదు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. సప్లిమెంటరీ రాసినా పాసవ్వలేదు. మళ్లీ మళ్లీ రాయడంతోనే రెండేళ్లు గడిచిపోయింది. నా క్లాస్‌మేట్స్ అందరూ ముందుకెళ్లిపోయారు. త్వరత్వరగా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో సెటిలైపోయారు. ఎప్పుడూ చదువు మీద మనసు లేదు కాబట్టి నా చదువు పూర్తయ్యేసరికి చాలాకాలమే పట్టింది. అత్తెసరు మార్కులతో పాసయ్యాను కాబట్టి మంచి ఉద్యోగం వట్టి కల గానే మిగిలిపోయింది. నాన్న రికమెండేషన్‌తో ఏదో చిన్న ఉద్యోగమైతే వచ్చింది కానీ మిగతా వాళ్లలాగా నేను బాగా సెటిలవ్వలేకపోయానే అన్న బాధ ఇప్పటికీ నన్ను తొలిచేస్తూ ఉంది.
 
కనీసం ఏదైనా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిద్దామన్నా కూడా వయసు పరిమితి అయిపోయి, అదీ కలగానే మిగిలిపోయింది. చదువుకోవాల్సిన వయసులో సరదాల కోసం ఆరాటపడ్డాను. స్థిరపడాల్సిన వయసులో చదువు పూర్తి చెయ్యాలని ఆరాటపడ్డాను. ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని బతకాల్సిన వయసులో మంచి సెటిల్‌మెంట్ కోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాను. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికి అర్థం చేసుకున్నాను. కానీ ఏం లాభం... అందమైన కెరీర్‌ని, ఆనందకరమైన జీవితాన్ని కోల్పోయాను!
 - నళిని, బెంగళూరు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా