ట్రైన్‌ హోస్టెస్‌ల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు..

21 Jan, 2020 09:13 IST|Sakshi

విమానాలలో ఎయిర్‌ హోస్టెస్‌లు ఉంటారు. రైల్లో ఇప్పుడు ‘ట్రైన్‌ హోస్టెస్‌’లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విమాన ప్రయాణికులంత హుందాగా రైలు ప్రయాణికులు వారితో వ్యవహరించడం లేదు.

‘నీవు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. రైలు రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని పాత జోకు. భారతీయ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించడంలో సుదీర్ఘ ప్రయాణమే చేశాయి. ఎన్నో సమస్యలను దాటాయి. ఘన విజయాలూ సొంతం చేసుకున్నాయి. కన్ను తడవకుండా ఈ దేశంలో ఎవరైనాజీవితాన్ని దాటొచ్చేమోగాని రైలెక్కకుండా గమ్యాన్ని దాటలేడు. రైల్వే సేవలు తమ ప్రమాణాలు పెంచుకుంటూ వెళ్లినట్టే ప్రయాణికుడూ తన సంస్కారస్థాయినీ పెంచుకుంటూ పోతున్నాడు. అయితే అతడు నేర్చుకోవలసింది ఇంకా ఉందని ఇటీవలి ఉదంతాలు నిరూపిస్తున్నాయి.

దేశంలో ‘తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’ల పేరుతో రైల్వేశాఖ కార్పొరెట్‌ రైళ్లను ప్రారంభించింది. 2019 అక్టోబర్‌లో మొదటి కార్పొరెట్‌ రైలు లక్నో–న్యూఢిల్లీల మధ్య మొదలైంది. మొన్నటి (జనవరి 19, 2020) నుంచి రెండవ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ అహ్మదాబాద్‌ నుంచి ముంబైకు మొదలైంది. అయితే ఈ ఖరీదైన రైళ్లలో మహిళా యువశక్తికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రైల్వేశాఖ ‘ట్రైన్‌ హోస్టెస్‌’లను ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు ఆహార సదుపాయాలలో వీరు సహాయం చేస్తారు. అచ్చు ఎయిర్‌ హోస్టెస్‌లకు మల్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

అహ్మదాబాద్‌–ముంబై తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదలైన సందర్భంగా అహ్మదాబాద్‌లోగుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో ట్రైన్‌ హోస్టెస్‌లు.
అయితే కొందరు ప్రయాణికులకు మాత్రం ఇది కొత్తొక వింతగా ఉంది. వీళ్లు కలిగిస్తున్న ప్రధాన అసౌకర్యం ఈ హోస్టెస్‌లను ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం. వద్దని గట్టిగా వారించలేని పరిస్థితి కావడంతో ఇది వారికి ఇబ్బంది కలిగిస్తోంది. విమానాలలో అయితే ఎయిర్‌ హోస్టెస్‌ల అనుమతి లేకుండా వారిని ఫొటోలు తీయడానికి వీల్లేదు. ఇక్కడ మాత్రం అడక్కుండానే సెల్ఫీలు తీస్తున్నారు. వీరి పేరు అడుగుతున్నారు. నంబర్‌ అడిగేంతగా తెగిస్తున్నారు. ఇంకొందరు తమ సీట్ల దగ్గర ఉండే కాల్‌ బెల్‌ను ఊరికూరికే నొక్కి వెళ్లాక ‘పని చేస్తుందో లేదో చూద్దామని’ అని వెర్రినవ్వు నవ్వుతున్నారు. ఇంకా అన్యాయం ఏమిటంటే వీరి దుస్తుల గురించి తీర్పులు వెలువరించడం. ఎటువంటి దుస్తులు ధరించాలో చెప్పడం.

‘మీ ప్రయాణం మీరు చేయక మా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు?’ అని ఈ ట్రైన్‌ హోస్టెస్‌లు చికాకు పడుతున్నారు. అయితే రైల్వే శాఖ ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంది. ప్రయాణం ముగిశాక డ్యూటీ దిగిన ఎయిర్‌ హోస్టెస్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది. ఇబ్బంది పెట్టిన ప్రయాణికుడిని గుర్తించడం కష్టం కాదు. ఎందుకంటే సీట్‌ నంబర్‌ ఉంటుంది. సిసి కెమెరాలు కూడా ఉంటాయి. అమ్మాయిలు భిన్నమైన ఇటువంటి ఉపాధులను ధైర్యంగా ఎంచుకుంటున్నారు. వీలైతే వారిని మెచ్చుకోవాలి. నొచ్చుకునేలా చేయరాదు. అప్పుడే వారి జర్నీ వారు చేస్తారు. మన జర్నీ మనం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా