దొంగతనం చేయని సొమ్ము

23 Mar, 2018 00:05 IST|Sakshi

చెట్టు నీడ

‘మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు’ అని కత్తి తీశాడు దొంగ. ‘నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు’  ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు.

ఒక సాధువు ఇంట్లో కూర్చుని మంత్రాలు ఏవో పఠిస్తున్నాడు. అప్పటికే బాగా రాత్రయింది. అయినా సాధువు లోతుగా పఠనంలో మునిగివున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ అలికిడికి సాధువు ఏకాగ్రత చెదిరింది. ‘మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు’ అని కత్తి తీశాడు దొంగ. ‘నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు’ ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు. సాధువు చెప్పినట్టే దొంగ పెట్టె దగ్గరికి వెళ్లాడు. ‘అందులో కొన్ని నాకోసం ఉంచు, రేపు కొన్ని అవసరాలున్నాయి’ అన్నాడు సాధువు. సాధువు చెప్పినట్టే కొన్ని ఉంచి, మరికొన్ని సొమ్ములు తీసుకుని బయటికి వెళ్లబోయాడు దొంగ.

‘కనీసం సొమ్ములు తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పే మర్యాదైనా పాటించవయ్యా’ అన్నాడు సాధువు. దొంగ సిగ్గుపడ్డాడు. సాధువు చెప్పినట్టే ‘కృతజ్ఞతలు’ చెప్పి వెళ్లిపోయాడు. అయితే, ఆ రాత్రే ఆ దొంగను గస్తీ తిరుగుతున్న రక్షక భటులు పట్టుకున్నారు. తెల్లారి సాక్ష్యం తీసుకోవడం కోసం సాధువును పిలిపించారు. ‘లేదు, ఈయన నా సొమ్ములు దొంగతనం చేయలేదు. ఆయన కొన్ని కావాలన్నాడు, నేను ఇచ్చాను. దానికి బదులుగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు’ అన్నాడు సాధువు. దాంతో, రక్షక భటులు దొంగను వదిలేశారు. ఆ తర్వాత ఆ దొంగ కూడా దొంగతనాన్ని వదిలేశాడు. 

మరిన్ని వార్తలు