ఎడతెరిపి లేకుండా దగ్గు... పరిష్కారం చెప్పండి

1 Aug, 2016 00:21 IST|Sakshi
ఎడతెరిపి లేకుండా దగ్గు... పరిష్కారం చెప్పండి

లంగ్ కౌన్సెలింగ్


నా వయసు 58 ఏళ్లు. గత 35 ఏళ్లుగా నేను సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. రోజూ విపరీతంగా సిమెంట్ పొడి వెలువడే చోట ఉంటాను. కొన్నిరోజుల నుంచి నాకు విపరీతంగా దగ్గు వస్తోంది. అది పొడి దగ్గే. అయితే దగ్గినప్పుడు పొత్తికడుపులోనూ, అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. అంతేకాకుండా ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని కొన్ని మందులు రాసిచ్చారు. కొంతకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. అసలు నాకేమైంది. ఏ స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలిస్తే నాకు నయమవుతుంది? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - జె. ప్రసాద్, కొత్తగూడెం
ఈమధ్యకాలంలో లంగ్‌కు సంబంధించిన జబ్బులు మనదేశంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా పొగతాగడం, వాతావరణంలో దుమ్ము, మనం తీసుకునే ఆహారం. ఇక మీ విషయానికి వస్తే... మీరు గత 35 ఏళ్లుగా నిత్యం సిమెంట్ దుమ్ము వెలువడే చోట పనిచేస్తున్నట్లు చెప్పారు. అది మీ అనారోగ్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కంటికి కనిపించనంత సైజ్‌లో ఉండే సిమెంట్ ధూళిని కొన్నేళ్లుగా పీల్చడం వల్ల అది ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి చేరి ‘మీసోథీలియోమా’ అనే జబ్బుకు కారణం కావచ్చు. గనులు, పరిశ్రమల్లో దీర్ఘకాలం పని చేసేవారికి ఈ తరహా జబ్బులు సోకుతున్నట్లు ఈమధ్యకాలంలో కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ జబ్బు ఊపిరితిత్తుల చుట్టూ ఆవరించే ఉండే కణజాలం పొరను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు చెప్పి లక్షణాలను బట్టి మీకు ఈ వ్యాధి సోకినట్లు అనుమానించాల్సి వస్తోంది. మీరు వెంటనే థొరాసిక్ సర్జన్‌ను సంప్రదించండి. వీడియో అసిస్టెడ్ సర్జరీ ద్వారా మీకు ‘మీసోథీలియోమా’ ఉందా లేదా అని నిర్ధారణ చేస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్స పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకవేళ మీకు జబ్బు ఉందని తెలిసినా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారు. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స సాధ్యమే. నిపుణులైన వైద్యులతో తగిన చికిత్స తీసుకుంటే మీరు పూర్తిగా కోలుకుంటారు.

 

డాక్టర్ పి.నవనీత్ సాగర్ రెడ్డి
సీనియర్ పల్మునాలజిస్ట్
యశోద హాస్పిటల్స్  సోమాజిగూడ  హైదరాబాద్

 

మరిన్ని వార్తలు