మా పాపకు బ్రెయిన్ టీబీ.. పరిష్కారం చెప్పండి

2 Mar, 2016 23:14 IST|Sakshi

న్యూరాలజీ కౌన్సెలింగ్
 
మా అమ్మాయి వయసు 20 ఏళ్లు. మెదడుకు టీబీ సోకడంతో బాధపడుతోంది. తరచూ ఫిట్స్ వస్తున్నాయి. జ్వరం కూడా వస్తూ ఉంది. అమ్మాకి ప్రాణహాని ఏదైనా ఉందా?
 - సునంద, వైరా

 సాధారణంగా టీబీ జబ్బు ఊపిరితిత్తులకు వస్తుంది. అయితే ఇది మన దేహంలోని ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. ఛాతీ టీబీ ఉన్నవారు సరైన మందులు వాడకపోయినా, ఇతర భాగాలకు వ్యాప్తి చెందవచ్చు. మెదడుకు టీబీ రావడం అన్నది చాలా ప్రమాదకరమైనది. ఇది మెదడుకు పాకితే రోగికి తీవ్రమైన తలనొప్పి,  వాంతులు, మూర్ఛరావడం, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలకి స్కానింగ్, లంబార్ పంక్చర్ అనే పరీక్షల ద్వారా జబ్బును తెలుసుకోవచ్చు. దీనికి ఇచ్చే మందులు పనిచేయడానికి మూడు నుంచి నాలుగు వారాల వరకు సమయం పట్టవచ్చు. అయితే ఈలోపే మెదడులో పలు మార్పులు వచ్చి, కణాలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం జరగవచ్చు. మెదడులోని నీరు బయటకు వెళ్లే దారి మూసుకుపోవడం వల్ల నీరు ఎక్కువగా చేరి, మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని వీపీ షంట్ అనే పద్ధతి ద్వారా ఈ నీటిని తొలగించవచ్చు. ఒకసారి మెదడుకు టీబీ వచ్చాక పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్ల వరకు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి మొండి జబ్బు ఉన్నవారిలో ఎండీఆర్ టీబీ ఉన్నవారిలో ఎనిమిది రకాల మందులు వాడాల్సి రావచ్చు. ఇటువంటి జబ్బు ఉన్నవారిలో యాభై శాతం మందికి మందులతో ప్రయోజనం ఉండదు. కానీ మీ అమ్మాయికి జబ్బు ఏ దశలో ఉందో తెలుసుకొని తగిన చికిత్స తీసుకుంటే జబ్బు నయమయ్యే అవకాశం ఉంది.
 
నా భర్త వయసు 50 ఏళ్లు. ప్రతిరోజూ మద్యం తాగుతూ ఉంటారు. ఒక్కోసారి ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడు. మద్యం తాగకుండా ఒకరోజు కూడా ఉండలేరు. మద్యం తాగకపోతే వణుకుతూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? - కల్పన, ఒంగోలు
మద్యం తాగేవారిలో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ జరిగి ఫిట్స్ రావచ్చు. కొంతమంది చీప్‌లిక్కర్‌కు అలవాటు పడిన వారిలో ఒక్కసారిగా మానేయడం వల్ల కూడా ఫిట్క్ రావచ్చు. మద్యం ఆపేసిన కొద్దిమందిలో రెండురోజులు పొంతనలేకుండా మాట్లాడటం, ఉమ్మివేయడం వంటివి చేస్తుంటారు. దీన్ని డెలీరియమ్ ట్రెమర్స్ అంటారు. దీన్ని మందులతో తగ్గించవచ్చు. అయితే మద్యం జోలికి పోకుండా క్రమం తప్పకుండా  టాబ్లెట్స్ తీసుకునేలా చూడాలి. కొంతమందిలో మందులతో ఈ అలవాటును మాన్పించలేకపోతే ‘డీ-అడిక్షన్’ సెంటర్‌లో ఉంచి చికిత్స అందించాలి. మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌నూ, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, సరైన చికిత్స తీసుకుంటే మీ ఆయనకు ఫిట్స్ రాకుండా చూడవచ్చు.
 
డా. మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్
హైదరాబాద్
 
 డర్మటాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు కేవలం 28 ఏళ్లు. నా కణతల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అలా ఉన్నాయి. ప్రస్తుతం అవి చెంపలపైన కూడా వస్తున్నాయి. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
 - సునయన, కందుకూరు

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కణతల మీద, బుగ్గల మీద ‘ఫొటోపిగ్మెంటేషన్’ వల్ల ఇలా నల్ల మచ్చలు వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ కింద సూచనలు పాటించండి.  మీరు రెండు శాతం గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న మైల్డ్ ఫేస్‌వాష్‌ను ఉపయోగించండి  ఇక ఎండకు వెళ్లినా వెళ్లకపోయినా 50 ఎస్‌పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయండి. ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి  రాత్రివేళ కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్‌తో పాటు విటమిన్-సి ఉండే క్రీమును  ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా కనీసం నాలుగు వారాల పాటు రాసుకుంటూ ఉండాలి  కొన్ని వారాల తర్వాత మీరు కొన్ని కెమికల్ పీలింగ్, మైక్రోడెర్మాబ్రేషన్ లేదా ఫ్రాక్షనల్ లేజర్ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాల్సి రావచ్చు. మన దేహంలోని అతి పెద్ద భాగం మన చర్మం. దాన్ని సంరక్షించుకోవడం మనందరికీ చాలా అవసరం. అది చాలా ప్రధానం కూడా. కేవలం సమస్య వచ్చినప్పుడు చర్మానికి చికిత్స చేయించుకోవడం కంటే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం అవసరం. అవి... ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.  అందులో ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవాలి.
 
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్
 
 హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నడుమునొప్పి వస్తోంది. ఇది ఎక్కువకావడంతో ఎమ్మారై తీయించాను. డిస్క్ బల్జ్‌తో పాటు సయాటికా కూడా ఉందని అన్నారు. హోమియోలో పరిష్కారం ఉందా?
 - వెంకటరామ్, నయాపూల్

సయాటికా బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. దీన్ని త్వరగా గుర్తించి సరైన సమయంలో గుర్తించి, హోమియో చికిత్స చేయించుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో ద్వారా సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. సయాటికా నరం శరీరంలోని నరాలన్నింటిలోనూ పెద్దది. పొడవాటి ఈ నరం వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలి వెనకభాగంలోంచి కాలి చివరి వరకూ వెళ్తుంది. వెన్నుపూసల లోపలి నుంచి ప్రయాణం చేసే నరాల ఒత్తిడి వల్ల కాలు వెనకభాగం నొప్పికి గురవుతుంది. దీన్ని ‘సయాటికా నొప్పి’ అంటారు. ఈ నొప్పి వీపు కింది భాగంలో మొదలై తొడ, కాలు వెనకభాగం, మడమల వరకూ పాకే అవకాశం ఉంది. తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పు వంటి లక్షణాలు చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 62 శాతం మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరు అవుతుంటారు.

కారణాలు:  నర్వ్ కంప్రెషన్... అంటే నరం ఒత్తిడికి గురికావడం వల్ల అది ప్రయాణం చేసే దారిలో నొప్పి  స్పైనల్ డిస్క్ హెర్నియేషన్... అంటే ఎల్4, ఎల్4 నరాల రూట్స్ ఒత్తిడికి గురై సయాటికా వచ్చే నొప్పి  పెరిఫార్మిన్ సిండ్రోమ్: అంటే... దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిన్ కండరం నరం మూలాన్ని నొక్కుకుపోయేలా చేస్తుంది. శాక్రో-ఇలియాక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్... అంటే శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో పిండం బరువు పెరిగి నరం మూలాన్ని నొక్కివేయడం వల్ల కూడా సయాటికా రావచ్చు.

పరీక్షలు: ఎక్స్-రేతో పాటు ఎమ్మారై స్కాన్‌తో డిస్క్ హెర్నియేషన్, డిస్క్ ప్రొలాప్స్ నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స: హోమియో విధానంలో సయాటికా నొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మందులను శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి, తగిన మోతాదులో వాడటం వల్ల ఈ విధానంలో సమస్య శాశ్వతంగా నయమవుతుంది.
 
డాక్టర్ మురళి
కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు