వెలుగమ్మాయి

8 Jul, 2014 22:35 IST|Sakshi
వెలుగమ్మాయి

‘నాకు జీవితమంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తి కాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి లాంటిది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక’ అంటాడు జార్జి బెర్నార్డ్‌షా. మారిషస్‌లో పుట్టిన 'ఊర్మిళాదేవి' దీ అదే లక్ష్యం. 180 ఏళ్ల క్రితం... ఊర్మిళాదేవి పూర్వీకులు మారిషస్‌లో స్థిరపడ్డారు. అక్కడి సంస్కృతిలోనే మమేకమైపోయారు. ఆ కుటుంబంలోనే పాతిక సంవత్సరాల క్రితం ఊర్మిళాదేవి పుట్టింది. తెలుగు నేలతో ముడిపడిన తన మూలాలను తెలుసుకుంది. తెలుగు నుడికారంపై మమకారం పెంచుకుంది. తెలుగు నేలపై వాలిపోయింది. తెలుగమ్మాయి అనిపించుకుంది.
 
ఆ రోజు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఫ్రెషర్స్‌డే ఉత్సాహంగా సాగుతోంది. విద్యార్థులంతా వారు తెలుగు ఎం.ఏ లో ఎందుకు చేరారో చెబుతున్నారు. అంతలో ఓ అమ్మాయి, ‘అందరికీ నమస్కారమండీ. తెలుగు భాషలో మంచి పట్టు సాధించేందుకే ఎం.ఏ తెలుగులో చేరాను.

నా దేశంలో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాను. తెలుగుదేశాన్ని త్రిలింగ దేశమంటారని పుస్తకాల్లో చదివి, త్రిలింగ క్షేత్రాల్ని దర్శించాలని ఉవ్విళ్లూరాను...’ అంటూ, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య శ్రీదేవిలా ముద్దుగా పలికింది. ఆ  మాటలకు అంతా కరతాళ ధ్వనులు చేశారు. అరవయ్యేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం చరిత్రలో అదో అరుదైన ఘట్టంగా చెప్పుకున్నారు. మారిషస్ నుంచి తెలుగు చదువుకునేందుకు ఓ అమ్మాయి రావడం అపూర్వంగా భావించారు.

అమ్మ ప్రోత్సాహంతోనే...
ఊర్మిళ పూర్వీకుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం. 1835లో బతుకు తెరువు కోసం మారిషస్ వలస వెళ్లిపోయారు. ఆ కుటుంబంలోని ప్రస్తుత తరానికి చెందిన దంపతులు నవీంద్, లక్ష్మి. వారి కవల కుమార్తెలు ఊర్మిళాదేవి, ఉష. ఊర్మిళ తల్లి తెలుగు ఉపాధ్యాయిని. తండ్రి ఆంగ్లం, సైన్స్, ఫ్రెంచ్ బోధించేవారు. ఆ కుటుంబ సభ్యులు తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోవడం, ఊర్మిళ తల్లిని బాధించేది. తెలుగులో పట్టా సాధించాలని ఆసక్తి ఉన్నా అప్పట్లో కళాశాలలు లేక చదవలేక పోయారు.

మారిషస్ ఆంధ్ర మహాసభ నిర్వహించిన తెలుగు ప్రవేశిక, ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. తెలుగు భాష విశిష్టత గురించి తల్లి తరచూ చెబుతుండటంతో ఊర్మిళకు ఆసక్తి పెరిగింది. అప్పటికే బి.ఎస్‌సి. పూర్తి చేసిన ఆమె బి.ఏ (తెలుగు) కూడా చదవాలని నిర్ణయించుకుంది.
 
బ్యాంకు ఉద్యోగం వద్దు... తెలుగు చదువే ముద్దు...
బ్యాంకు ఉద్యోగం సంపాదించిన ఊర్మిళ, సాయంత్రం కళాశాలలో బిఏ (తెలుగు) చదవాలని నిర్ణయించుకుంది. ‘‘కళాశాలకు కాస్త ముందుగా వెళ్లేందుకు అనుమతివ్వమని బ్యాంకు యాజమాన్యాన్ని ప్రాధేయపడ్డాను. వారు అంగీకరించలేదు. దాంతో చదువు కోసం ఉద్యోగాన్నే వదిలేశాను’’ అంటారు ఊర్మిళ. భారతీయ భాషలను ప్రోత్సహించడం కోసం మారిషస్ ప్రభుత్వం తెలుగు పాఠశాలలను కూడా స్థాపించింది.

మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న తెలుగు (బి.ఏ) కోర్సులో చేరింది. అక్కడ తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సౌదామిని మూర్తి గారి శిష్యరికంలో తెలుగు పరిజ్ఞానం పెంచుకున్నారు ఊర్మిళ. ‘‘ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర రచనలు చదివాను. విశ్వనాథ సత్యనారాయణ నాకు ఇష్టమైన కవి. ఆత్రేయ రాసిన ‘కప్పలు’ నాటకం స్ఫూర్తితో ‘మానవ స్వభావం, ‘ధన ప్రభావం’ అనే నాటకాలను రాసి ప్రదర్శించాను. ఈ రెండింటికీ పన్నెండు అవార్డులు లభించాయి. దాంతో మారిషస్ ఆంధ్ర మహాసభ ఉప కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు’’ అని ఊర్మిళ చెప్పారు.
 
చదువుకున్న చోటే ఉపాధ్యాయినిగా...
తాను చదువుకున్న మహాత్మాగాంధీ పాఠశాలలోనే తెలుగు ఉపాధ్యాయినిగా ఆమె చేరారు. ఇంతలో తెలుగు ఎం.ఏ. సీటు దొరికింది. స్టడీ లీవు తీసుకుని, విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్నారు. ‘‘నన్ను తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ మోహనరావు పరిచయం చేయగానే అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో బిడియంగా ఉండేదాన్ని.

అక్కడి స్నేహితులు నన్ను అక్కున చేర్చుకున్నారు. తక్కువ కాలంలోనే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా ఎంతసేపైనా తెలుగు మాట్లాడగలుగుతు న్నాను’’ అంటారు ఊర్మిళ.  ఆమెకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఎం.ఏ. తెలుగు చదువుతుండగానే గాత్ర సంగీతంలో సర్టిఫికెట్ కోర్సులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు.
 
తెలుగమ్మాయికి ఆత్మీయ వీడ్కోలు
రెండేళ్లలో చదువు పూర్తయింది. పరీక్షలైపోగానే మారిషస్ బయలుదేరారు ఊర్మిళ. ఆమెను మిత్రులంతా ఘనంగా సన్మానించారు. ఆడపిల్లను పుట్టింటికి సాగనంపినట్టు చీర, జాకెట్టు, పూలు, పండ్లు అందజేశారు. ‘‘ఏయూ తెలుగు విభాగం చరిత్రలో ఎంఏ తెలుగు చదివేందుకు ఓ విదేశీ విద్యార్థి రావడం ఇదే ప్రథమం. ఊర్మిళ తెలుగు భాషను ఎంతో నిజాయితీగా అభ్యసించింది. ఆమె స్వచ్ఛమైన తెలుగులో సంభాషిస్తుంటే ముచ్చటేసేది. ఆమె పదహారణాల అచ్చ తెలుగు ఆడపిల్ల’’ అని ప్రశంసించారు ప్రొఫెసర్ మోహనరావు.

తెలుగంటే ఎందుకింత మక్కువని ఊర్మిళను ప్రశ్నిస్తే... ‘‘అమ్మంటే ఎందుకిష్టం అంటే ఏం చెబుతాం? తెలుగులో పీహెచ్‌డీ చేస్తాను. మారిషస్‌లో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాను. తెలుగు అధ్యాపకురాలిగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాను’’ అంటారు ఊర్మిళ. ఆమె.. తెలుగమ్మాయి... మన వెలుగమ్మాయి.
 - ఎ. సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు), సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

మరిన్ని వార్తలు