తప్పిపోయిన కాలం

6 Jul, 2020 00:11 IST|Sakshi

కవిత

బాల్యం ఔతలి ఒడ్డున 
ఒకరినుంచి ఒకరం తప్పిపొయ్యి
మళ్ళ యిక్కడ 
ఈ బిగ్‌ బాజారుల కలుసుకున్నం

వాషింగు మిషనులు
ఫ్రిజ్జులు ఎల్‌ఈడీ టీవీలపై పడి
దొరులుతున్న చూపుల నడుమ
ఇద్దరం రోబోలుగ ఎదురుపడ్డం

కొంచెం సేపటికి
ఎప్పటినుంచో వెతుకుతున్న వస్తువు 
కంటిముందర ప్రత్యక్షమైన మాదిరిగ
ఒకింత ఆశ్చర్యంగనే
ఒకరికొకరం దొరికి పోయినం

వస్తుజాలంల చిక్కుకున్న మమ్ములని
అమాంతం పొంగిన సుద్దవాగు ముంచేసింది
సీసీ కెమెరాలు చూస్తున్నయని మరిచి
వాగునీళ్ళల్ల ఏసంగిల పారిచ్చిన దోసకాయలు ఇరుగ తిన్నం

కాళ్ళకింద చలువరాయి ఉన్నా
గుంచీలు తవ్వి గోటీలు, గిల్లి దండలాడినం
దిగుడు కాదు కదా పట్నంల మట్టే కరువన్నది మరిచి
సలాక ఆడుకుంటు కుంటినం
గుట్టలమీద కంపల్ల పడి ఆడినా 
ఏడ యింత దెబ్బ తగులలె గని
ఇంత నొప్పైతె ఎప్పుడు లేదు

రాంరాయని వాగు ఖిల్లగుట్ట బత్తీస్‌ గడి కజాన్‌ చెరూ బంగల్‌ చెరూ బొమ్మల కార్ఖాన
చిన్న తిరిగితిమా
ఇంత తిరిగినా కాళ్ళనొప్పులు లేవు
కండ్ల నీళ్ళు తప్ప

- మడిపల్లి రాజ్‌కుమార్‌ 

మరిన్ని వార్తలు