ఒక యుద్ధ కథ

12 Jul, 2020 23:59 IST|Sakshi

కథాసారం

8–1–39 బొంబాయి

‘‘ఇప్పటికి సరిగా వారం రోజులయింది మిమ్మల్నందరిని వదిలిపెట్టి. ధర్మవరం దాటగానే వెనక్కితిరిగి ఇంటి కొచ్చెయ్యాలనిపించింది. కాని దాసు ప్రోత్సహించాడు మళ్లా. 
నిన్ను చూచిచూచి రావడానికి కాళ్లాడలేదు. కాని లక్ష్మీ, భగవంతుని దయ యుంటే, మనం అనుకున్నట్టూ ఈ యారు నెలలయిన తరువాత సర్కారు ఓ పదెకరాలిస్తే! పిల్లలదృష్టం. తరవాత రోజులన్నీ మన ఇష్టం. దేవుడిచ్చిన ఆయుస్సు తిన్నగా వుంటే మనకేం భయం లేదు. రాముణ్ణి నూతి దగ్గిర ఆడుకోనివ్వద్దు. అమ్మనీ పిల్లల్నీ ఎంత భద్రంగా చూచుకొంటావో. ఓడ ఎక్కగానే వ్రాస్తా మళ్లీ.’’

ఉత్తరం చదివించి విన్నది లక్ష్మి. అత్తగారితో పిల్లలిద్దరూ వాకిట్టో ఆడుకుంటున్నారు. గుమ్మంలోకి వచ్చింది కర్ణంగారింటి నుంచి. కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. 
రాత్రంతా ఏమేమో కలలు. రక్తప్రవాహాలు, గుఱా<లు, రైలుబండ్లు. నారాయణా తానూ చేలో కలుపు తీస్తూ ఎందుకో పకపక నవ్వేశారట. ఇంకా చాలా. అర్థం లేదు. గొడ్ల సావిట్లోకి వెళ్లి పని చేసుకుంటూంది. ఆరు మాసాలే గదూ. ఆరమావాస్యలు, ఆరు పున్నాలు. యెర్రావు ఈనేటప్పటికి తిరిగి రావాలి. ఆనాడు లక్ష్మీ చేలోకి వెళ్లింది. ఈ చేను పండేప్పటికి నారాయణ తిరిగి వస్తాడు. ఈ తలంపుతోనే ఒక ధైర్యం వచ్చింది.

నారాయణ తనంతట తానే అయితే వెళ్లకనే పోనేమో. కాని బాల్యస్నేహితుడు దాసు ప్రోత్సాహం జాస్తి అయింది. సంతకు బస్తీ వెళ్లడం తప్ప మరేమీ బయట పనిలేని నారాయణకు పటాలం కొలువంటే సరదాగానే వుంది. అదికాక పొలా లిస్తారనే ఆశ ఒకటి.

17–2–39
‘‘మేము ఓడలో వున్నాం. మన తెలుగు రానివాళ్లు కూడా చాలామంది వున్నారు. చాలా సరదాగా ఉంది. ఒహ ఆటలూ, ఒక పాటలూ గావు.’’

23–7–39; బస్రా
‘‘మా పటాలం ఇక్కడే దిగి పొమ్మన్నారు. ఏమీ పని లేదు. రోజూ కవాతు చేయిస్తారు. అయిన తరువాత కోరిన తిండి, పేకాట. ఒక్కొక్కప్పుడు ఊళ్లోకి వెళ్లి నాలుగు వీధులు తిరగడం. భలేగా ఉంది.’’

బాధగా ఉన్నా లక్ష్మి ఆ ఉత్తరాలు చూసుకొని ధైర్యం తెచ్చుకొంది. ఆయన సుఖంగా ఉన్నదీ లేనిదీ తెలుస్తోంది. అంతే చాలు. పిల్లలు గోల పెడుతూంటే కుడుములు చేసింది. నారాయణకు చాలా యిష్టం కుడుములంటే. కుడుము నోట్లో పెట్టబుద్ధి వెయ్యలేదు.

10–8–39; బస్రా
‘‘యుద్ధం ఆరంభం అయింది. మా రెజిమెంటు ఈ రాత్రి పన్నెండుకు బయలుదేరాలి. అబ్బ! ఎన్నెన్నో కొత్త మర తుపాకీలు తెచ్చారు. మొహాలకి గంతలు ఎన్నో రకాలు. నిన్నంతా నువ్వే కనపడ్డావు కళ్లకి.’’

లక్ష్మి పనంతా చేసుకుని కర్ణంగారి వాకిట్లోకి పోవడం కద్దు. కరణం గారి భార్య రంగమ్మ గారు, చాలా మంచిది. నలుగురూ కలిసి కాస్త ముచ్చట్లాడుకొని నీళ్ల వేళకి ఇళ్లకు జేరుకుంటాడు. ఈ సంవత్సరం రంగమ్మ గారి పెద్దబ్బాయి రామ్మూర్తి చెన్నపట్నంలో బియ్యే పాసై ఇప్పు డింటోనే వున్నాడు. ఇంగ్లీషు పేపరు తెప్పిస్తుంటాడు. శత్రువులు ధ్వంసం చేసిన కట్టడాలు, మరణిస్తూ ఉన్న సిపాయీలు– అన్నిటి బొమ్మలూ చూపించి అర్థం చెబుతూంటాడు. నారాయణ ఉత్తరాలన్నీ ఆయనే చదివి చెప్పేవాడు. మరో ఉత్తరం వచ్చేవరకూ అదే కాలక్షేపం లక్ష్మికి.

20–8–39; బస్రా
‘‘ఈ అన్నం మన గొడ్లు కూడా తినవు. తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదు. దోమలు, వీపు మీద ఒక గేదె బరువు. ఏదో పాపం చేస్తే తప్ప యుద్ధంలోకి రారు.’’
తానే వెళ్లనిచ్చింది. అంత దూరదేశం. రాత్రంతా నిద్ర పట్టలేదు. నారాయణ సుఖంగా తిరిగి వస్తే ఒక మేకపోతును మొక్కుకుంది అమ్మవారికి.

30–8–39; బస్రా
‘‘గడిచిన రెండు దినములూ ఘోరమైన యుద్ధం. నా హృదయాన్ని చంపుకున్నాను. తిరిగి మీ అందరినీ చూచేవరకూ ప్రాణాలు కుదురుగా ఉండవు. అమ్మ ఏడుస్తోందా?’’

10–9–39; బస్రా
‘‘పది మైళ్లు ముందుకి సాగాం. నిన్నంతా మురికి నీళ్లలో, కందకంలో శవాల మధ్య ఉన్నాము. ప్రాణ స్నేహితు లందరూ చస్తూంటే వాళ్ల కేకలు విని కూడా ముందుకి నడిచిపోయాం.’’
యథారీతిని బ్రతుకుతూంది లక్ష్మి. నారాయణ వచ్చేవరకూ రోజులు లెక్క పెట్టుకుంటూ– పశువులూ, పొలం, పిల్లలు, తన ఇల్లూ– ఈ చిన్ని ప్రపంచం తనది.
ఇప్పటికి రెండు నెలలయింది నారాయణ వద్ద నుంచి ఉత్తరం వచ్చీ.
యుద్ధం జరుగుతూనే ఉందని మాత్రం రోజూ తెలుస్తూనే ఉంది రంగమ్మ గారి ద్వారా. కాని ఉత్తరం రాకపోడానికి కారణం ఏమిటో తెలియలేదు. ఒకవేళ సెలవు తీసుకొని బయలు దేరాడేమో.
ఈ సంవత్సరం ములక వస్తుందన్నారు. ఆ గింజలు కాస్తా రాకపోతే పిల్లలూ, ముసలమ్మా, లక్ష్మీ ఏం గావాలి? లక్ష్మి కృశిస్తోంది కొద్ది కొద్దిగా. ఇంతట్లో దాసు ఉత్తరం వేశాడు.

15–11–39; బస్రా
‘‘దురదృష్టం వల్ల బలమైన గాయాలు తగిలి నారాయణను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే రాయాలంటే చేతు లాడాయి కావు. ఇప్పుడు తప్పదు. రాత్రి మా పై అధికారిని అడిగాను. నిన్ననే ప్రాణం పోయిందని చెప్పాడు. దుఃఖపడి ఏమీ లాభం లేదు. పిల్లల ముఖం చూసి బ్రతకాలి. ముసలమ్మను జాగ్రత్తగా చూడాలి. ఎప్పటికయినా తప్పనిదే ఈ చావు.’’
లక్ష్మి విరిగిపోయింది. చీకటి. చేయని పాపానికి శిక్ష. ఇరుగుపొరుగు వాళ్లు సహాయం చేశారు. రెండు సార్లు పొద్దు పొడిచింది. మూడవనాడు తిరిగీ ఒక ఉత్తరం.

17–11–39; బస్రా
‘‘దాసు ఈ విధంగా నీకు ఉత్తరం రాశానని నాతో చెప్పాడు. నా గుండెలు జారిపోయినై. తప్పు అతనిదీ కాదు. మా యజమాని తాగి నంబరు పొరపాటు చెప్పాడు. నాకు స్పృహ తప్పిపోయాక ఆస్పత్రికి తీసుకొచ్చారు. నాలాంటి పరిస్థితులలోనే ఉన్న మరొకాయన మూడు రోజుల క్రితం పోయాడు. వీలయినంత త్వరలో వచ్చేస్తాను. ఇంకా ఈవారం ఉంటుందేమో యుద్ధం. రాజీ చేసుకునే టట్లు ఉన్నారట ఉభయ పక్షాల వాళ్లూ.’’

మరునాడంతా స్వప్నంలో తిరిగినట్లు తిరిగింది లక్ష్మి. రోజులు గడుస్తూన్నాయి. ములక రాలేదు. చేను పండి ఒరిగింది. నారాయణ లేకుండానే కోత కూడా జరిగింది. కుప్ప లేశారు. నురిపిడి అయింది. నెల అయింది, జాబు లేదు. కోసిన వడ్లు కోసినట్లే ఉన్నాయి. నారాయణ వచ్చి గరిసె కడతాడని నమ్మకంతో అల్లాగే ఉంచింది.

ఆనాడు పెందలాడే పనంతా తెమల్చుకొని కరణంగారి యింటికి వెళ్లింది. రంగమ్మ గారు, అబ్బాయి గారు అరుగుమీద కూచున్నారు. రంగమ్మ గారే పలకరించారు. ‘‘లక్ష్మీ! యుద్ధం అయిపోయిందట. అందరూ సమాధానపడి సంధి జేసుకొన్నారు. పటాలాలన్నీ తిరిగి పంపించేశారు. రెండు వారాలలో నారాయణ కూడా వచ్చేస్తాడన్నమాట.’’

లక్ష్మి కండ్లు చుక్కల్లా మెరిశాయి. ఒక్క పరుగున ఇంటి కొచ్చింది. అత్తగారికి చెప్పింది. కన్నకడుపు. ఆకాశము వైపు చూసింది. దణ్ణం పెట్టింది. పొంగి వచ్చినై కళ్లల్లోకి నీళ్లు. ఎఱావు కోడెదూడ అల్లరి చేస్తో రాముడితో ఆడుకుంటోంది. అత్తగారికీ పిల్లలకీ వడ్డించింది. నాన్న వస్తాడని ఊరించి మరొకముద్ద తినిపించింది రాముడికి. తనూ భోంచేసింది. పట్టెడన్నమే. కడుపు నిండింది.

మరునాడు లక్ష్మి నీళ్ల కెడుతోంది. ఎదురుగా కాకీబట్టలు వేసుకొని ఒక మనిషి వచ్చి ఒక పెద్ద కవరు యిచ్చాడు. ఇంకెవరు ఉత్తరం రాస్తారూ, నారాయణ తప్ప? కవరు కళ్ల కద్దుకుంది. కొంగులో ముడివేసుకొని బిందె నింపుకొని ఇంటికి గాలిలో నడిచి వచ్చింది. ఏ రోజు కారుకి దిగుతారో ధర్మవరం!

ఈ వుత్తరం ఏదో మామూలుకంటే భేదంగా వుంది. కాని ఇల్లాంటి కవర్లు కొన్ని చూచినట్లు జ్ఞాపకం. సర్కారు కాగితాలు. ఉత్తరం వళ్లో పెట్టుకుని కరణం గారి యింటికి పరుగెత్తింది.
రామమూర్తి గారు చదివారు– రెండవ రెజిమెంటు 120 నెం. నారాయణ ఆఖరు నాటి యుద్ధంలో పోయాడు. అతని కుటుంబానికి సర్కారు వారు కృష్ణా జిల్లా పోలవరం తాలూకా నెం. 5/75 అన్‌సర్వీభూమి 5 ఎకరాలు గ్రాంటు చేశారు.


నిడుమోలు కల్యాణ సుందరీ జగన్నాథ్‌ ‘ఒకకథ’కు సంక్షిప్త రూపం ఇది. 1939 నాటి ‘భారతి’లో వచ్చింది. అజ్ఞాత్‌ కలంపేరుతో ప్రచురించబడిన ఈ కథే కల్యాణ సుందరి తొలి కథ అంటున్నారు ‘వేటపాలెం’ సజ్జా వెంకటేశ్వర్లు. అలరాస పుట్టిళ్లు, మాడంత మబ్బు ఆమె ఇతర పేరున్న కథలు. 2002లో మరణించారు. జూలై 19న వర్ధంతి.

మరిన్ని వార్తలు