వృద్ధుడి యవ్వనం

6 Jul, 2020 00:04 IST|Sakshi

కథాసారం

సూరయ్య: అంతే. ఈ నిర్ణయానికి తిరుగులేదు. నా బాధలన్నీ యీ పూటతో ఆఖరయిపోతాయి. తండ్రిలేని పిల్లలని, యే దయామయుడైనా ఆదరించవచ్చు. ఇప్పుడందరూ నిద్రపోతున్నారు. ఈ చిటికెడు విషం నోటిలో వేసికొన్నానంటే... అంతా సమాప్తమవుతుంది. తండ్రీ, దేవదేవా! నన్నీ సంసార బాధల నుండి తప్పించు స్వామీ!
ధ్వని: (వికటమైన నవ్వు)
సూర: యెవరది? ఎవరక్కడ? యెవ్వరూ పలకరేం? (మెల్లగా) అందరూ నిద్రపోయారనుకొన్నాను.
ధ్వని: నిజంగానే అందరూ నిద్ర పోతున్నారు. 
సూర: నిజంగానే నిద్ర పోతుంటే, ఈ మేల్కొనివున్న నువ్వెవరు? ‘అందరూ’ అన్నప్పుడు, ఆ అందరిలో నువ్వూ ఒకడివి కావా?
ధ్వని: కాను.
సూర: అయినా మీరు వెళ్లిపొండి. అవతల నాకు చాలా పనివుంది.
ధ్వని: చావబోతుగూడా అబద్ధమాడతారేం? అవతల మీకు నిజంగా పని వున్నదా?
సూర: ఏమిటీ? ఎవరు చెప్పారు నీకీ విషయం? చావవలసిన అవసరం నాకేమీ లేదు. నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. 
ధ్వని: మిమ్ములను గురించి విన్నానుగాని, ఎప్పుడు చూడలేదు; కాని నన్ను మీరు బాగా యెరుగుదురు.
సూర: నేనా? మిమ్మల్నా? భలేవారండీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు, నా యౌవనపు రోజులు జ్ఞాపక మొస్తున్నాయి. ఆ కాలంలో నేను గూడా– అచ్చం మీలాగానే మాట్లాడేవాణ్ణి.
ధ్వని: అట్లాగా?
సూర: మెల్లిగా అంటారేమిటి? మీకు మల్లేనే ఒక మాటను అనేక సార్లు...
ధ్వని: అయితే, నన్ను మీరు గుర్తుపట్టేశారు. ఐనా మీ దగ్గర దాపరికమేమిటి? మీ అనుమానం నిజమే. నేను మీ యౌవనాన్నే. అప్పట్లో నన్ను...
సూర: సూర్యం అని పిలిచేవాళ్లు నిన్ను. అవునా?
సూర్యం: అవును. అందరూ ‘సూర్యం’ ‘సూర్యం’ అంటుంటే ఆ పేరుమీద నాకు అసహ్యమేసేది. కానీ, కమల– తన తీయని గొంతుతో ‘సూర్యం’ అని పిలిచిందాకా, ఆ పేరులోవున్న అందం స్ఫురించనేలేదు.
సూర: ఛస్‌! ఆ పేరు నా దగ్గర యెత్తకు. దాని ఊసు అంటే, నాకు అసహ్యమేస్తుంది. 
సూర్యం: నీకూ నాకూ మధ్య యెంత వ్యత్యాసమున్నది. కాలం ఎంత విరుద్ధ మనస్తత్వాలు గల వ్యక్తులనుగా మనలను మార్చివేసింది. కమల! కమల!! నా జీవిత నందనోద్యానం సుగంధ భరితం చేసి, నన్ను, అనూహ్యానంద డోలికలలో ఉయ్యాల లూచింది.
సూర: అదంతా భ్రమ. అందమైన కల. నిద్ర మేలుకొన్నాను. కల కరిగిపోయింది. కఠినమైన జీవతం నన్నెదుర్కొన్నది. సూర్యం! అప్పుడే గనుక, నువ్వా కమలను ప్రేమించకుండా ఉన్నట్లయితే, నా బ్రతుకింత బ్రద్దలయ్యేది కాదు. నేనీవిధంగా ఆత్మహత్యకు సిద్ధపడేవాణ్ణి కాదు.
సూర్యం: ఆ విషయం కనుక్కొందామనే వచ్చాను. నేననుకొనేవాణ్ణి గదా ఈ ఆత్మహత్యలు ప్రపంచంలో యెందుకు జరుగుతున్నాయి? జీవితం పట్ల, దాని తాలూకు అనుభవాల పట్ల యీ మానవులెందుకింత పిరికివాళ్లయ్యారు? యేదో బాధలున్నాయని ఊహించుకొని–
సూర: ఊహించుకొనటం కాదు. ఏవో బాధలు అనుభవించి–
సూర్యం: యెంత తప్పు?
సూర: యెంతమాత్రం కాదు.
సూర్యం: ఆత్మహత్య దోషం కాదా?
సూర: ఒక వేళ దోషమే అయితే, అది నాది కాదు. అంతకంటే మరొక దోవ లేకుండా చేసిన నా పరిస్థితులదే ఆ దోషమంతా. నాకూ జీవించాలనే వుంది. జీవితాన్ని అనుభవించాలనీ వుంది.
సూర్యం: అబద్ధం. ఆ ఉద్దేశమున్నవాడెవడూ చావును కోరడు. 
సూర: నేను చావటానికి సిద్ధపడుతున్నానంటే, నేనెంత దారుణంగా కాలం వెళ్లదీస్తున్నానో ఆలోచించవే?
సూర్యం: ఈ వాదన కమల వింటే, నీ పిరికితనాన్ని అసహ్యించుకొనేది.
సూర: ఆ పేరెత్తవద్దని యిందాక చెప్పాను. ఇంకొకసారి యెత్తావంటే? అదేమిటి అలా వెళ్లిపోతావేం.
సూర్యం: నేనెక్కడా అట్టేసేపుండలేను.
సూర: ఇదిగో రా! రా!
సూర్యం: కమల మీద నీకంత కోపమెందుకు సూరయ్యా! ఆమె చేసిన తప్పేమిటి? ప్రేమించటమా? ప్రేమించటమే మహానేరమయితే, తక్కిన నేరాలను దూషించటానికి భాష లేదే!
సూర: యవనోన్మాదం, కాముకత్వం, శరీర వాంఛ ప్రేమ కాదు. అది పశుత్వం.
సూర్యం: ఇవన్నీ కాని ఆ ప్రేమ కంటే వీటన్నిటితో కూడిన ఆ పశుత్వమే నేను కోరుతాను.
సూర: ఈ భ్రమలోనేపడి, బంగారం వంటి మేనరికాన్ని కాదన్నావు. పెద్ద చదువు లేదు. డబ్బు లేదు. ‘ప్రేమ, ప్రేమ’ అంటూ బైరాగిలా తిరిగావు. నీ పని హాయిగానే గడిచిపోయింది. దాని ఫలితం నేనిప్పుడు అనుభవిస్తున్నాను.
సూర్యం: అదృష్టవంతుడివి. ఆ జ్ఞాపకాలతో కలకాలం మధురంగా జీవించవచ్చు.
సూర: ఛీఛీ యిప్పటికీ నీకు జ్ఞానం రాలేదు.
సూర్యం: ఏమాత్రం అవకాశం లభించినా, ఇప్పుడైనాసరే, కమలతో నేనావిధంగానే ప్రవర్తిస్తాను. ఎందుకో నీ ముసలి హృదయానికి తెలీదు. దానికి రసికతను గ్రహించే శక్తి నశించిపోయింది. త్యాగంలోని ఆనందమేమిటో నీ వగ్గు హృదయానికి యెంత బోధించినా అర్థం కాదు. ఒకనాడు
∙∙ 
కమల: సూర్యం! యెందుకలా దిగులుగా వున్నావ్‌?
సూర్యం: ఏమీలేదు.
కమల: నిష్కారణంగా యెవరైనా దిగులుగా ఉంటారేమో నాకు తెలియదు.
సూర్యం: ఉన్నా అది నువ్వు పరిష్కరించేది కాదు.
కమల: అయితే, అది కారణం కాదు, సమస్యయి ఉంటుంది.
సూర్యం: చెప్పటానికి సిగ్గుగా వుంది. మా నాన్న నాకు సంబంధం కుదిర్చాడుట. పెళ్లివారు గురువారం వస్తారుట. రమ్మని ఉత్తరం రాశాడు.
కమల: నిక్షేపంగా వెళ్లి చూసిరండి.
సూర్యం: వెళ్లిన తరువాత నేను కాదనటం, వారు ఔననటం... గొడవలు జరుగుతాయేమోనని భయపడుతున్నాను.
కమల: అందుకని వెళ్లటం మానేస్తారా?
సూర్యం: నీకోసమనే వెళ్లటం మానేస్తున్నాను. నేను వాళ్లకు నచ్చి, ఆ పిల్ల నాకు నచ్చి, పుటుక్కున లగ్నం స్థిరపడితే?
కమల: నిశ్చయమే అయితే, నేను సంతోషిస్తాను సూర్యం.
సూర్యం: అసూయ పడతావనుకొన్నాను, పెళ్లి చూపులకు వెళ్లవద్దంటా వనుకొన్నాను.
కమల: నేను నిన్ను ప్రేమించినట్లే, మరొకరు గూడా నిన్ను ప్రేమించగూడదా? నువ్వా సంబంధం చేసుకొంటేనేగానీ సుఖపడని పక్షాన నిరభ్యంతరంగా చేసుకో.
సూర్యం: యింత మంచి దాన్ని నిన్ను కాదని, మరొకరిని చేసుకోలేను. భగవంతుడు గూడా మెచ్చడు.
కమల: మరి యిలానే వుండిపోతారా?
సూర్యం: కమలను చేసుకొంటాను.
కమల: కానీ కమల ఓ కులం లేనిదని మీకు తెలియదనుకొంటాను.
సూర్యం: ఇంతకాలం పరిచయంలో ఈ విషయమన్నా తెలుసుకోలేని మందమతిని కాను. నా కోసం నువ్వంతటి త్యాగం–
కమల: ఇందులో త్యాగమేముంది? అధవా వున్నా, అది మనకోసమే గానీ, మరొకడి కోసం గాదు.
సూర్యం: నా విషయం మీ నాన్నగారికి తెలుసా?
కమల: ఇది నా స్వవిషయం.
సూర్యం: నీలాంటి అమూల్యవరాన్ని నేను పోగొట్టుకోలేను. ఈ ప్రపంచమంతా యేకమై కాదన్నా, నేను విడిచిపెట్టను కమలా. లోకంలో చాలామంది సూర్యములున్నారు. కానీ కమల మట్టుకు ఒక్కతే. నిన్ను నా హృదయంలో భద్రంగా దాచుకొంటాను.
∙∙ 
సూర్యం: చాలామంది నన్ను గురించి దుష్ప్రచారం చేశారు. నాన్నగారికి ఉత్తరాలు రాశారు. కమల యీ సంగతులేమీ పట్టించుకొనేది కాదు. ఎందుకైనా మంచిదని, నేనే బలవంతాన ఆ ఊరు వదిలేశాను. కొంతకాలం జీవితాన్ని మహోజ్వలంగా అనుభవించాను. నా జీవితంలో యెక్కడైనా ఉత్తమాధ్యాయం ఉంటే ఆ కొంత కాలమే. మిగతాది వట్టి పర్ర.
సూర: అని నువ్వనుకొంటున్నావు. కానీ ఆ కొంతకాలమే నా బ్రతుకును తునాతునకలు చేసింది. ఆ చరిత్ర అందరికీ తెలిసింది. మేనమామ పిల్లనివ్వనని తెగేసి చెప్పాడు. యాభై వేల రూపాయల ఆస్తి చేజారిపోయింది.
సూర్యం: నీ మాటలు బట్టి చూస్తుంటే– పెళ్లి చేసుకోవటమనేది, పిల్లను కాక, ఆ డబ్బునేమో ననిపిస్తుంది.
సూర: అంత డబ్బే వుంటే, నాకీ బాధ లుండేవే కావు. తెలుసా?
సూర్యం: ఈ బాధలు పడటానికైనా నేను వొప్పుకొంటాను గాని, ఆ పిల్లను మట్టుకు పెళ్లాడేందుకు ఒప్పుకోను. ఇష్టం లేని సంసారం వెలగబెట్టటం యెంతదోషమో నీకు తెలిసినట్టు లేదు.
సూర: లక్షమంది దాన్ని అంగీకరిస్తారు.
సూర్యం: పది లక్షలమంది అంగీకరించినా దోషం దోషమేకాని మరొకటి కాదు.
సూర: ఈ తలబిరుసుతనమే నన్ను నిలువునా ఆర్పింది. ఇప్పటికైనా వదిలిపోవేం?
సూర్యం: పిచ్చివాడా, నే నేనాడో పోయాను. నీ బాధంతా నేను నీ దగ్గర లేననే. అలా మూలమూలకు వొదిగినంత మాత్రాన, నాకు దూరం కాలేవు. నన్ను స్మరించుకుంటూ బ్రతకడం నేర్చుకుంటేగాని నీకు శాంతి లేదు. నేను వెడితే తిరిగి రాను.
సూర: అయ్యో వెళ్లిపోయాడు. ఇదిగో నిన్నే ఉండు.
సూర్యం: నేనెక్కడా అట్టేసేపుండనని చెప్పలా?
సూర: ఇదేమిటి చల్లగా వుంది. చలేస్తుంది. హాయిగా కప్పుకుని పరుంటాను.
సూర్యం: అదా అది నా నీడ. చల్లగా స్మరించుకుంటూ వెచ్చగా పడుకో.
 


రావూరి భరద్వాజ కథ ఉభయ సంధ్యలు ఇది. ప్రచురణ: 1954. సౌజన్యం: కథానిలయం. భరద్వాజ (5 జూలై 1927 – 18అక్టోబర్‌ 2013) తెలుగులో జ్ఞానపీఠ్‌ పురస్కారం పొందిన మూడో రచయిత. పెద్దగా చదువుకోకపోయినా స్వయంకృషితో ఎదిగినవారు. ఎన్నో రకాల అనుభవాలతో లోకాన్ని చదువుకున్నవారు. కథలు, నవలలు, నాటకాలు, రేడియో నాటకాలు, కవిత్వం, వ్యాసాలు, బాల సాహిత్యం, స్మృతి సాహిత్యం, శృంగార సాహిత్యం, అపరాధ పరిశోధన, ఇలా ఎన్నో ప్రక్రియల్లో విస్తారంగా రాశారు. జీవన సమరం, తెలుసుకుంటూ తెలుసుకుంటూ, పాకుడురాళ్లు ఆయన రచనల్లో విశిష్టమైనవి.

మరిన్ని వార్తలు