భాష బతుకమ్మయి..

20 Dec, 2017 01:18 IST|Sakshi

తెలుగుకు తొలి తొవ్వలు తెలంగాణలోనే.. 

ప్రవాస తెలుగువారి సభలో ఎంపీ కవిత 
తెలుగు భాష, సాహిత్యంపై పట్టుతో రవీంద్రభారతిలో ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం చేసిన ప్రసంగం ఆహూతులను  ఆకట్టుకుంది. అద్భుతమైన పదబంధాలు, ఉదాహరణలు,  కవితలతో చేసిన ఆమె ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు రవీంద్రభారతిలో ‘ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు’ అంశంపై విదేశీ తెలుగువారితో నిర్వహించిన గోష్టిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ్రMీ స్తుపూర్వం మూడో శకం నాటి కోటి లింగాల శాసనంలోనే తెలుగుకు గొప్ప ఆధారాలున్నాయని చెప్పారు. ‘గోబద’, ‘నారన’, ‘సమవాస’ వంటి తెలుగు పదాల ఆధారంగానే మన భాషకు ప్రాచీన హోదా దక్కిందన్నారు.  తెలుగుకు తొలి తొవ్వలు పరిచింది తెలంగాణ కవులే నని చెప్పారు. కరీంనగర్‌లో లభించిన కురిక్యాల శాసనంలో మూడు కందపద్యాలున్నాయని పేర్కొన్నారు. పాల్కురికి సోమనా«థుడు తొలి తెలుగు ఆది కవిగా ఆమె అభివర్ణించారు. ‘తెలుగు’ అనే పదాన్ని ఆయనే మొదటిసారి తన కావ్యరచనలో వాడినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోందన్నారు. బసవపురాణం స్వతంత్ర తెలుగు రచన అనీ, అది సంస్కృతం, ఇతర ఏ భాషలకు అనువాదం కాదని  పేర్కొన్నారు. నన్నయ కంటే వందేండ్ల ముందే తెలుగులో కావ్య రచన జరిగిందన్నారు. పండితారాధ్యచరితము సోమన రాసిన మొదటి విజ్ఞాన సర్వస్వగ్రం«థమని పేర్కొన్నారు. కాకతీయుల నుంచి పద్మనాయకరాజులు, కుతుబ్‌షాహీ వరకు తెలుగు భాషా, సాహిత్యం వైభవోపేతమైన దశను పొందిందన్నారు. అసఫ్‌జాహీల పాలనలోనే ఆంధ్రుల చరిత్రను సురవరం ప్రతాప్‌రెడ్డి రాసినట్లు గుర్తు చేశారు. ఆధునిక సాహిత్యంలోనూ వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి వంటి కవులు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సినారె విరచిత  ‘విశ్వంభర’ నుంచి కొన్ని కవితలను  ఆమె ఉదహరించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలంగాణ తెలుగు సాహిత్య వైభవాన్ని వివరించారు. ‘42  దేశాల నుంచి 450 మందికిపైగా విదేశాల్లో స్థిరపడిన మనవాళ్లు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆమె అన్నారు.  

మహాసభలు  ఈ దశాబ్దపు అద్భుతం ....: ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి అభివర్ణించారు. వేదికలు జనంతో కిటకిటలాడుతున్నాయని, భారీ స్పందన లభించిందని పేర్కొన్నారు. తెలుగు భాషా, సాహిత్యాల విస్తరణకు ఈ సభలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. తాను సినిమా షూటింగ్‌లకు వెళ్లినా మనస్సు మాత్రం మహాసభలపైనే ఉందని, షూటింగులు ముగించుకొనే సభలకు హాజరవుతున్నానని చెప్పారు. నారాయణస్వామి వెంకటయోగి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్‌  స్వామిగౌడ్, డాక్టర్‌ వంగూరి చిట్టెన్‌రాజు, ఆచార్య టి.గౌరీశంకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా, బ్రిటన్, మారిషస్, మలేసియా, ఫిజీ, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చిన పలువురు పెద్దలను ఘనంగా సత్కరించారు.
– పగిడిపాల ఆంజనేయులు

తాతయ్య ఉంటే ఎంత సంతోషించేవారో!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభల సమయంలో తమ తాతయ్య ఉంటే ఎంతో సంతోషించేవారని జ్ఞానపీuŠ‡ డాక్టర్‌ సి.నారాయణరెడ్డి మనవరాలు వరేణ్య అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న ఆమె మంగళవారం ‘సాక్షి’తో తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. పాట రాసి మాతో కూడా పాడించేవారు: 1974లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తాతగారు కామెంట్రీ చేసినట్లు చెప్పేవారు. తెలుగుపై ప్రేమతో ‘ కడలి అంచులు దాటి కదిలింది తెలుగు’  అనే పాట రాసి, తాను ఆనందంగా పాడుతూ, తమతో కూడా పాడించేవారు. ఆయన హృదయ కమలంలో తెలుగుకు అగ్రతాంబులం వేసేవారు.  ప్రభుత్వం ప్రతి డిసెంబర్‌లో రెండ్రోజులపాటు తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సమయంలో సినారె మన మధ్య ఉండి ఉంటే ఆయన ఆనందానికి అవధులు ఉండేవి కాదు. తెలంగాణ ధన్యభూమి అని తాతయ్య ఎప్పుడూ చెబుతుండేవారు. తెలంగాణ యాసలో తీయటి మాధుర్యం ఉందనేవారు. కవులు, కళాకారులు, భాషా పండితులకు ఎక్కడ గౌరవం ఉంటుందో.. ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేవారు. తెలుగు విశ్వవ్యాప్తమవుతుంది: తెలంగాణ నుడికారాలు అద్భుతమైన జీవభాషకు ప్రతీకలు. తెలంగాణలో ఉన్న ఎంతోమంది తేజోమూర్తులను ఈ సభలు నేటి తరానికి పరిచయం చేశాయి. తేజోమూర్తుల పేర్లలో సినారె పేరును చెబుతూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం విని మా కుటుంబ సభ్యులందరం ముగ్ధులమయ్యాం. భవిష్యత్తులో తెలుగు విశ్వవ్యాప్తం అవుతుంది. మా కుటుంబ సభ్యుల తరఫున, యావత్‌ తెలుగు ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు. 
- సినారె మనవరాలు వరేణ్య

ఇలా చేద్దాం...

పండుగొస్తుందంటే పనులన్నీ పక్కన పడేసి, పండుగ సంబురాల్లో మునిగి తేలడం ఆనవాయితీ! పండుగ ముగిశాక తిరిగి పనుల బాట పట్టడం తెలుగునాట సంప్రదాయం. పండుగ ఇచ్చిన కొత్త హుషారు, స్ఫూర్తితో... ఎప్పుడూ చేసే పనే అయినా, పనిచేసే తీరులో ఉత్సాహం రెట్టింపుగా ఉంటుంది. అయిదొద్దులు జోరుగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగియడంతో... ఇక పనిబాట పట్టాల్సిన సమయం వచ్చింది. తెలుగు భాష వైభవం, ఔన్నత్యాన్ని చాటేలా సభల్ని పక్కా ప్రణాళికతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణను వాయిదా వేసింది. చివరి రోజున కీలక ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావే స్వయంగా చెప్పడంతో భాషాభిమానులు నిరీక్షించారు. కొంత సమయం తీసుకుని, జనవరిలో ఓ సాహితీ సదస్సు నిర్వహణ సందర్భంగా విధాన నిర్ణయాలు ప్రకటిస్తామని ముగింపు వేడుక వేదిక నుంచి ఆయనే వెల్లడించారు. బహుశా! ప్రస్తుత సభల్లో  వెల్లడెన నిపుణుల అభిప్రాయాల్ని క్రోడీకరించి, వాటిని పొందుపరుస్తూ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారేమో! అది మరీ మంచిది. ఏమైతేనేం, తెలుగును జీవద్భాషగా వృద్ధి చేస్తామని, అవరోధంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఐదు రోజులపాటు ఆరు వేదికల నుంచి ముప్పైకి పైగా జరిగిన సభలు, భేటీల్లో తెలుగు భాష విభిన్న కోణాలూ మరోమారు చర్చకొచ్చాయి. సభలకు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రజాస్పందన లభించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీంతో ప్రజలకు తల్లి భాషపైన అపారమైన ప్రేమాభిమానాలున్నాయని సందేహాలకతీతంగా రుజువైంది. ఆచరణాత్మక చర్యల ద్వారా తెలుగును అంతరించిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని అది నొక్కి చెప్పింది. 
సభల్లో వ్యక్తమైన దాన్ని బట్టి...

►ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే విద్యాబోధన జరగాలి. 
►12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి అంశంగా ఉండాలి.
►తెలుగులో నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించాలి. ఇతర ప్రోత్సాహకాలివ్వాలి. 
►మాండలికాలు, ప్రాంతీయాలపై ఓ పరిశోధన జరిపి ప్రామాణిక భాషను రూపొందించాలి. 
► తెలుగులో సమగ్ర నిఘంటువు నిర్మించాలి. 
►పారిభాషిక పదకోశాలు తయారవాలి.
► శాస్త్ర–సాంకేతిక కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాల సృష్టి జరగాలి. 
►ప్రసారమాధ్యమాలు వాడుక భాషనే ఉపయోగించాలి. 
► పరిపాలన, న్యాయపాలనలో విధిగా తెలుగునే వాడాలి.
►తప్పనిసరిగా తమ పిల్లలు తెలుగునేర్చుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. 
►నిర్బంధం, అనివార్యం కాని ప్రతీచోట తెలుగులోనే మాట్లాడాలి. 
► ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పెద్ద ఎత్తున పునః ప్రచురించి చవకగా అందుబాటులోకి తేవాలి. 
ఇటువంటి అన్ని కార్యాల ద్వారా అందరం తెలుగును కాపాడుకోవాలి.                                      
 – దిలీప్‌రెడ్డి 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు