రూమరమరాలు

17 May, 2019 00:36 IST|Sakshi

ఇంగ్లిష్‌లో ‘రూమర్‌ మిల్‌’ అనే మాట ఉంది. అంటే.. పిడి మరలాగే రూమర్‌లకూ ఒక మర ఉంటుందని!ఆ పిండితో ఏ రొట్టే చెయ్యలేం. కానీ ఆకలి తీరుతుంది!రూమరో రామచంద్రా..అన్నంతగా ఉన్న..ఆకలి తీరుతుంది. కానీ.. రూమర్‌లు లైట్‌గా ఉండాలి. లైట్‌గా ఉంటే..మరమరాల్లా ఎంజాయ్‌ చెయ్యొచ్చు.మోతాదు మించితేనే ముంచినంత పని చేస్తాయి! 

ప్రాణి పుట్టుకకు ఎక్స్‌వై క్రోమోజోములు అవసరం. ప్రాణం లేని రూమర్‌ పుట్టుకకు ‘డెవిల్స్‌ వర్క్‌షాప్‌’ ఒకటి చాలు! పనిలేని బుర్ర! అది పుట్టిస్తుంది అందమైన రూమర్లు. బాధించే రూమర్లు. కంపెనీలను లాస్‌ చేయించే రూమర్లు. కెరీర్‌ను దెబ్బదీసే రూమర్లు. మంచి రూమర్‌లు ఎక్కువ కాలం బతకవు. బతికినా వెంటనే చనిపోతాయి. చెడ్డ రూమర్లే.. ‘పాపి చిరాయువు’లా బతికేస్తుంటాయి! రూమర్‌లంటే ఎవరైనా భయపడి చచ్చేది అందుకే. సెలబ్రిటీలకైతే రూమర్‌లంటే మహా వణుకు. నోరు మెదపరు. వాళ్ల నోట్లో వేలుపెట్టి కోపం తెప్పించి, వేలు కొరికించుకుని రూమర్‌లు క్రియేట్‌ చేసేవాళ్లు కూడా ఉంటారు. అసలు నోరు, వేలు, కోపం, కొరకడం.. ఇవేవీ లేకుండానే పుట్టే రూమర్‌లూ ఉంటాయి! నానీ ‘జెర్సీ’ బాగుందని జూ‘‘ ఎన్టీఆర్‌ ఎక్కడో ఒక ట్వీటో, చిన్న మాటో వేశాడు. అక్కడో రూమర్‌ పుట్టేసింది.

‘కథానాయకుడు’ బాగుందని అనలేదు. ‘మహానాయకుడు’ బాగుందని అనలేదు. ‘జెర్సీ’ బాగుందని అన్నాడు. తాతగారి మీద తీసిన ఆ రెండు బయోపిక్కుల్లో తనకు పాత్రే లేకుండా చేసినందుకు జూ‘‘ ఎన్టీఆర్‌ అలా రివెంజ్‌ తీర్చుకున్నాడని రూమర్‌. అర్థం లేని రూమర్‌లపై ఎవరైనా ఎందుకు మాట్లాడతారు. ఎన్టీఆర్‌ కూడా మాట్లాడలేదు. లోకంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా రూమర్‌లకు అనువుగా ఉండేది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. హాలీవుడ్‌లో రోజుకు లక్ష రూమర్‌లు పుట్టుకొస్తుంటాయి. బాలీవుడ్‌లో వెయ్యి రూమర్‌లు ఉసురు పోసుకుంటాయి. మన తెలుగువుడ్‌ ఇంకా అంత ‘డెవలప్‌’ కాలేదు. నయం అనుకోవాలి అంతగా డెవలప్‌ కాకపోవడం.

షూటింగ్‌ స్పాట్‌ వరకైతే ఓకే. మరీ ఇళ్లలోకి వెళ్లిపోకూడదు కదా. కానీ పబ్లిక్‌ పర్సన్స్‌ ప్రైవేట్‌ లైఫ్‌ ఈజ్‌ మోర్‌ ఇంట్రెస్టింగ్‌ దేన్‌ ప్రైవేట్‌ పర్సన్స్‌ పబ్లిక్‌ లైఫ్‌. మానవ నైజం. ‘సైరా’ సెట్‌లో చిరంజీవి గెటప్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంటికెళ్లాక పెరట్లో మొక్కలకు ట్యూబ్‌ పట్టుకుని నీళ్లు పడుతున్నప్పుడు చిరంజీవి గెటప్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ‘‘సరే రావయ్యా.. మొక్కలకు  నీళ్లు పడుతున్నప్పుడు ఒక ఫొటో తీసుకో’’ అని చిరంజీవి అంటారేమో. అయితే ఇండస్ట్రీలో అంత ఈజీగా ఏదీ ఉండదు. ఈజీగా లేని పరిస్థితుల్లో ఈజీగా పుట్టేవే రూమర్‌లే. 

దసరాకి కాదా సైరా 
‘సైరా నరసింహారెడ్డి’ ఈ దసరాకు విడుదల కానట్లేనా! అనే రూమర్‌ ఇప్పుడు రౌండ్లు కొడుతోంది. మెగాస్టార్‌ అభిమానుల డీలా పడిపోయారు. ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ తర్వాత పదేళ్లకు ‘ఖైదీ నెం.150’గా సాక్షాత్కరించారు చిరు. మళ్లీ రెండేళ్ల గ్యాప్‌! సైరా కోసం అవురావురుమని చూస్తున్నారు. సినిమా రిలీజ్‌ అవుతుందని చూస్తుంటే రూమర్‌ రిలీజ్‌ అయింది.. దసరాకు విడుదల కావడం లేదని!! దర్శకుడు సురేందర్‌రెడ్డి. నిర్మాత రామ్‌ చరణ్‌. భారీగా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్‌ అవుతోందనీ, క్లయిమాక్స్‌కి వచ్చేశామని కూడా చెప్పారు. ఇప్పుడేమిటి దసరాకు కాదంటున్నారు? సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది కదా, అందుకే లేట్‌ అవుతోందని ఒక రూమర్‌.

లేట్‌ చేయించడానికే అగ్నిప్రమాదం సృష్టించారని ఇంకో రూమర్‌. రామ్‌ చరణ్‌కి ప్రకటన ఇవ్వక తప్పలేదు. ‘‘అవును.. సైరా దసరాకు విడుదల కావడం లేదు’’ అన్నాడు. ఆ వెంటనే.. ‘‘అక్టోబర్‌ 2కి విడుదల చేస్తున్నాం’’ అన్నాడు. చిరు అభిమానులు ఆనందంతో షాక్‌లోకి వెళ్లిపోయారు. అక్టోబర్‌ 2.. ఈ ఏడాది దసరాకంటే ముందొచ్చేస్తోంది మరి! దసరా అక్టోబర్‌ 8న. ఆశించినదానికి ఆరు రోజులే ముందే అయినా ఫ్యాన్స్‌కి అదో పెద్ద పండుగ. అయితే రామ్‌ చరణ్‌ నిజంగానే అలా అన్నారా లేక అన్నారని ఒక రూమరా?! ఏమైనా ఉల్లాసం కలిగించే సంగతే. గుడ్‌ రూమర్‌.

ఏమి సేస్తిరి.. ఏమి సేస్తిరి?! 
చిరు ఇంట్లోనే సగానికి పైగా సినిమా ఇండస్ట్రీ ఉంది. హీరోలు, హీరోయిన్‌లు, నిర్మాతలు, పొలిటికల్‌ లీడర్స్‌ అంతా కలిపి పదిమందికి పైగా ఉన్నారు. అంత పెద్ద ఇల్లు కాబట్టి వాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ సహజీవనం చేస్తుంటుంది. పవన్‌ కల్యాణ్‌ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాడని ఆ మధ్య ఒక రూమర్‌ వచ్చింది. ఇప్పుడు అల్లు అరవింద్‌కి, ఆయన కొడుకు అల్లు అర్జున్‌కి సినిమాలు తీసే విషయంలో మాటామాట వచ్చింది మరో రూమర్‌! రాజకీయంగా కూడా చిరంజీవి మీద, పవన్‌ కల్యాణ్‌ మీద అనేక రూమర్‌లు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు అవుట్‌ డేటెడ్‌. అప్‌డేట్‌ ఏంటంటే.. పవన్‌ కల్యాణ్‌కు హీరో రాజశేఖర్‌ కౌంటర్‌ ఇచ్చాడని! ఇవ్వడం అంటే డైరెక్ట్‌గా కాదు.

ఇన్‌డైరెక్ట్‌గా. ‘కల్కి’లో రాజశేఖర్‌ హీరో. గత గురువారం విడుదలైన ‘కల్కి’ టీజర్‌లో రాజశేఖర్‌ ‘ఏం సెప్తిరి, ఏం సెప్తిరి.. ఎప్పుడూ ఇలాగే సెప్తారా?’ అంటూ ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌ని ఇమిటేట్‌ చేస్తాడు. గబ్బర్‌సింగ్‌లోని రౌడీల అంత్యాక్షరి సీన్‌లో.. రౌడీలను కమెడియన్‌లా పాడిస్తూ పవన్‌ ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఒక కమెడియన్‌ లేచి, హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘రోజ్‌ రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ అనే సాంగ్‌ని ఎత్తుకుంటాడు. రాజశేఖర్‌ని ఇమిటేట్‌ చేస్తూ సేమ్‌ అలాగే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తాడు. ప్రేక్షకులు నవ్వలేక చచ్చిన సీన్‌ అది. ఆ రౌడీ కమెడియన్‌.. సాంగ్‌ని పూర్తి చెయ్యగానే ‘ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి. ఎప్పుడూ ఇలాగే సేస్తురా.. ఈ మధ్యనే ఇలాగే సేస్తున్నారా?’ అంటాడు.

అప్పట్లో రాజశేఖర్‌కి, చిరంజీవికి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది. అది దృష్టిలో పెట్టుకుని పవన్‌ కావాలనే ఆ డైలాగులతో రాజశేఖర్‌కి కౌంటర్‌ ఇచ్చారని ఒక రూమర్‌ వచ్చింది. ఆ సీన్‌ని దృష్టిలో పెట్టుకుని ‘కల్కి’లో ఇప్పుడు రాజశేఖర్‌ పవన్‌కి కౌంటర్‌ ఇచ్చాడని రూమర్‌. ఈ రూమర్‌కి బొత్తిగా బేస్‌ లేకుండా ఏమీ లేదు. కల్కి టీజర్‌ ఎండింగ్‌లో.. సేమ్‌ అదే కమెడియన్‌ని... పోలీస్‌ గెటప్‌లో ఉన్న రాజశేఖర్‌ (గబ్బర్‌సింగ్‌లోని రౌడీ అంత్యాక్షరిలో పవన్‌దీ పోలీస్‌ గెటప్పే) కాలితో తంతాడు.. ‘ఏంట్రా ఆ ఊపుడు’ అంటూ.. నన్నే ఇమిటేట్‌ చేస్తావా అన్నట్లు. దీంతో రూమర్‌ క్రియేట్‌ అయి చక్కర్లు కొడుతోంది.. గబ్బర్‌సింగ్‌తో రాజశేఖర్‌ని పవన్‌ దెబ్బకొడితే, కల్కితో పవన్‌ని రాజశేఖర్‌ దెబ్బకు దెబ్బ కొట్టాడని.   

కనిపించవేం ప్రభాస్‌ 
‘సైరా’లా, అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంకో సినిమా ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో. 2017 జూన్‌లో షూటింగ్‌ మొదలైంది. ఇప్పటికింకా షూటింగ్‌ నడుస్తూనే ఉంది. సినిమా మాట తర్వాత సంగతి విడిగానైనా ప్రభాస్‌ని చూద్దామంటే ఆయనెక్కడా కనిపించడం లేదు. ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో అని బెంగ పెట్టేసుకున్నారు ఫాన్స్‌. సాహో డైరక్టర్‌ సుజీత్‌ని తిట్టుకుంటున్నారు కూడా. అంత లావున ఏం తీస్తున్నాడో అని. అప్పుడప్పుడు ప్రభాస్‌ని కూడా! డార్లింగ్‌ అనీ, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనీ హాయిగా ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించక ఎందుకీ భారీ ప్రాజెక్టులు అని వారి ఆవేదన. ప్రభాస్‌ కెరీర్‌ గురించి కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాహుబలి, సాహో.. ఇలా ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తీసుకుంటూ పోతుంటే ప్రభాస్‌ బాడీ ఏమౌతుంది? ఆ తర్వాత కెరీర్‌ ఏమవుతుంది? కెరీర్‌ని పనిగట్టుకునేం నిర్మించుకోనవసరం లేదు.

ప్రభాస్‌కి క్రేజ్‌ ఉంది. నిర్మాతలు వచ్చేస్తారు. పాత్రల కోసం బాడీని ఫ్లక్చువేట్‌ చేసుకుంటూ పోతుంటే.. ఫిట్‌నెస్‌ దెబ్బతిన్నాక ఏ నిర్మాత దగ్గరికొస్తాడు? ఇవన్నీ రూమర్‌లు కాదు. చింతాక్రాంతులైన అభిమానుల సందేహాలు. మరి రూమర్‌ ఏమిటి? సాహూలో ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై ప్రభాస్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట! చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆ లెవల్‌లో అంటే.. ప్రేక్షకుల అంచనాలు అంతకుమించిన లెవల్‌లోనే ఉంటాయి. అయితే దర్శకుడు సుజి  తెరకెక్కించిన కొన్ని కీలకమైన సీన్స్‌ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేనంత వీక్‌గా ఉన్నాయని, వాటిని మళ్లీ రీషూట్‌ చేయాలని దర్శకుడిని అడిగితే అతడి ఇగో హర్ట్‌ అయిందని రూమర్స్‌ వస్తున్నాయి. రీషూట్‌ కోసం ప్రభాస్‌ అడగడం నిజమైతే ఉండొచ్చు కానీ, దర్శకుడి ఇగో హర్ట్‌ అవడం మనవాళ్లు కల్పించిన రూమర్‌ అయి ఉండడానికి ఎక్కువ చాన్సెస్‌ ఉన్నాయి.

సుజీత్‌ నిన్నమొన్నటి కుర్రాడు. ఇరవై మూడేళ్ల వయసులో ‘రన్‌ రాజా రన్‌’ తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హిట్‌ కొట్టాడు. తర్వాత మూడేళ్లకు సాహో మొదలు పెట్టాడు. రెండు సినిమాలకే మనిషి ఎదగవచ్చేమో కానీ, మనిషిలోని ఇగో సాధారణంగా ఎదగదు. ముందనుకున్న డేట్‌ ప్రకారం ఆగస్టు 15న సాహో విడుదల కావాలి. అయితే రీషూట్‌ల కారణంగా ఆ తేదీకి విడుదల కాకపోవచ్చని ఒక రూమర్‌. నిప్పు లేకుండా పొగ రాదని అంటారు. కానీ నిప్పు లేకుండానే పొగ తెప్పించేస్తుంది రూమర్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్త్రీలో రూమర్‌లు సాధారణమే. అయితే అవి వ్యక్తిగతాల్లోకి వెళ్లి మనసుల్ని పాడు చేసేంతగా ఉండకూడదు. ఇమేజ్‌ని దెబ్బతీయకూడదు. భవిష్యత్తును నాశనం చేయకూడదు. సినిమా రిలీజ్‌ అయ్యేలోపు రూమర్‌ ఒక టీజర్‌లా ఉండాలి తప్ప, ఎవర్నీ టీజ్‌ చేసేలా ఉండకూడదు.  

ఎప్పుడు పిలిస్తే అప్పుడు...
ఈ మధ్య డైరెక్టర్‌ తేజ మీద కూడా కొన్ని రూమర్‌లు వచ్చాయి. ఈ మధ్యే అనేం ఉంది. తేజ నిక్కచ్చిగా మాట్లాడతాడు. దానిని అర్థం చేసుకోలేనివాళ్లు రూమర్స్‌ క్రియేట్‌ చేస్తారు. కావాలని చెయ్యరు. వాళ్లన్నవి, అనుకున్నవి రూమర్స్‌ అయిపోతాయి. చెప్పినట్లు చెయ్యకపోతే తేజ హీరోయిన్‌లపై చెయ్యి చేసుకుంటాడని ఎప్పటి నుంచో ఉన్న రూమర్‌. ఈ మధ్య ఒక న్యూస్‌ చానెల్‌కు తేజ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. ఇలాంటి రూమర్‌లను నవ్వుతూ కొట్టిపడేశారు. ఆ ఇంటర్వ్యూలోనే తేజ.. ‘నేనెప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్‌ వచ్చేస్తుంది.. వెంటపడి మరీ’ అన్నాడు. ఇక రూమర్‌లు మొదలయ్యాయి. ఆయన అన్న సందర్భం వేరు. తేజ ‘సీత’ అనే సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాడు.

మే 24న విడుదల అవుతోంది. ఆ సినిమా కథ చెప్పడం కోసం కాజల్‌తో కూర్చుంటే.. ఆ పాత్రకు తను బాగా కనెక్టయి.. ఎప్పుడు డిస్కషన్స్‌కి కూర్చుందాం అన్నా వెంట పడి వచ్చేస్తుంది అనే అర్థంలో తేజ ఆ మాట అన్నారు. ముందు వెనకల్ని వదిలేసి ‘ఎప్పుడు పిలిస్తే అప్పుడు’ అనే ముక్కను పట్టుకోవడంతో అది రూమర్‌ అయింది. మహిళలకు తేజ రెస్పెక్ట్‌ ఇస్తారు. అతడి సినిమాల్లోని మహిళల పాత్రలూ ఇండివిడ్యువాలిటీతో ఉంటాయి. సీతనే తీసుకుందాం. అందులో కాజల్‌ డామినేటెడ్‌ రోల్‌లో డిఫరెంట్‌గా కనిపించబోతోంది. సీత అంటే మనకో సంప్రదాయ భావన ఉంటుంది కదా. దానికి భిన్నంగా ఉంటుంది కాజల్‌.

అలాగని సంప్రదాయ విరుద్ధంగా ఏమీ ఉండదు. టీవీ ఇంటర్వ్యూలో కాజల్‌ గురించి తేజ మరో మాట కూడా చెప్పారు. ఇండస్ట్రీలో.. ఎవరు సక్సెస్‌లో ఉంటే వారి వెనుక పడి వస్తారు. కాజల్‌ అలాక్కాదు. తనకు సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌తో నిమిత్తం లేదు. కథ నచ్చితే వెంటపడి చేస్తుంది అని అన్నారు. తేజ స్ట్రయిట్‌ ఫార్వార్డ్‌. అనవసరంగా ఒకర్ని పొగడరు. తిట్టాల్సి వస్తే తిట్టకుండా వదలరు. ఈ ముక్కుసూటి ధోరణి కారణంగా రూమర్స్‌కి ఆయనో నాణ్యమైన ముడిసరుకు అవుతున్నారు ఎప్పటికప్పుడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కథ.. ఇల్లే సురక్షితం

మీరు వర్క్‌ చేసే ఫీల్డ్‌ అలాంటిది..

బ్రేక్‌ 'కరోనా'

మాస్కులు.. శానిటైజర్ల తయారీ

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం

సినిమా

ఎస్పీ బాలు నోటా కరోనా పాట!

కరోనా లాక్‌డౌన్‌: అల్లు అర్జున్‌ ఫోటో వైరల్‌

కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ

‘నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’

‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం

కరోనా.. మూడు రాష్ట్రాలకు బన్నీ విరాళం