తెలుగింటి పద్మావతి

6 Mar, 2019 01:16 IST|Sakshi

సీరియల్‌

తెలుగువారింట గోరంత దీపమై, పున్నాగగా పరిమళించి బంగారు గాజులు ధరించిన పద్మావతి అసలు పేరు అంజనా శ్రీనివాస్‌. సీరియల్‌ నటిగా తెలుగువారి మనసులను ఆకట్టుకుంటున్న పద్మావతి ఉరఫ్‌ అంజన సాక్షితో పంచుకున్న ముచ్చట్లు.

అమ్మనాన్నలకు ముగ్గురు ఆడపిల్లలం. ఇంట్లో నేనే పెద్ద కూతురిని. మా అమ్మవాళ్ల నాన్నగారు నాటకాలు వేసేవారట. అలాగే నాకు సాంస్కృతిక వ్యవహారాలపై ఇష్టం ఏర్పడి ఉంటుందని అమ్మానాన్నా అంటుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఒక తెలిసిన మేకప్‌మేన్‌ సీరియల్‌కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయంటే వెళ్లాను. అక్కడ నూట ఇరవైమందిలో నేను సెలక్ట్‌ అయ్యాను. అలా కన్నడలో ‘కృష్ణా రుక్మిణి’ సీరియల్‌లో నటించాను. తమిళంలో కూడా ఓ సీరియల్‌ చేస్తున్నాను. తెలుగులో గోరంతదీపం, పున్నాగ తర్వాత ఇప్పుడు బంగారు గాజులు సీరియల్‌లో నటిస్తున్నాను. 

చెల్లెళ్లకు అన్నలా! 
నాన్న శ్రీనివాస్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌. అమ్మ రాధ హౌజ్‌వైఫ్‌. మేం ముగ్గురు ఆడపిల్లలమే అని అమ్మనాన్న ఎప్పుడూ భయపడలేదు. అలాగే మా ఇష్టాలకు ఆంక్షలు ఎప్పుడూ పెట్టలేదు. ఏది నచ్చితే అది చేయమన్నారు. అయితే, ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు పడకూడదని, ఫ్యామిలీకీ ఇబ్బంది రాకూడదని చెబుతారు. నన్నయితే చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిలాగే పెంచారు. అందుకే మా చెల్లెళ్లకు అన్నలా ఉంటాను. కాని, మా సిస్టర్సే నాకన్నా మెచ్యూర్డ్‌. నేనే వాళ్లతో బాగా అల్లరి చేస్తాను. ఒక్కోసారి వాళ్లకే చెల్లెలిగా మారిపోతాను. నాకేదైనా అడ్వైజ్‌ అవసరమైతే వాళ్లే చెబుతారు. 

ఇంటికి పెద్ద కొడుకులా! 
నేనీ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు అమ్మ నాతోపాటు షూటింగ్స్‌కి వచ్చేవారు. ఇప్పుడు వద్దని చెప్పాను. నా పనులు నేను చూసుకోగల ధైర్యం వచ్చింది, నువ్వు చెల్లెళ్లను చూసుకో’ అని చెప్పాను. ఇంకా మంచి మంచి సీరియల్స్‌ చేస్తూ నా ప్రొఫెషన్‌లో ఎదగాలని ఉంది. ఫ్యూచర్‌లో కూడా అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. పెళ్లయినా వాళ్లని వదిలి ఉండలేను. ‘అమ్మనాన్నలతో నేను ఉంటాను, నేను ఉంటాను’ అంటూ ముగ్గురం అక్కచెల్లెళ్లం గొడవ పడుతుంటాం. 

డ్యాన్స్‌ అంటే పిచ్చి
నే చేసిన సీరియల్స్‌ అన్నీ చాలా నేచురల్‌గా, భిన్నమైన పాత్రలు రావడం బాగా నచ్చింది. ఈ ఫీల్డ్‌కి రాకముందు మొదట్లో మా అమ్మతో అనేదాన్ని‘ ఇలాంటి సీరియల్స్‌ ఎలా చూస్తున్నావ్‌?’ అని. కానీ, అలా అనే నేను కూడా సీరియల్స్‌ చూసేదాన్ని. సీరియల్‌లో తర్వాత కథ ఏమవుతుందనే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లే ఇలా ఈ ఇండస్ట్రీకి వచ్చాననిపిస్తుంది. డ్యాన్స్‌ అంటే విపరీతమైన పిచ్చి. ఏ కాస్త ఖాళీ దొరికినా స్ప్రింగ్‌లా ఊగిపోతుంటాను. 

వరించిన పాత్రలు
నేను ఈ ఇండస్ట్రీకి రాకముందు ఏమేం అనుకున్నానో అలాంటి పాత్రలన్నీ ఇప్పుడు సీరియల్స్‌లో చేస్తున్నాను. తమిళ్‌ ‘శివగామి’ సీరియల్‌లో ఐపిఎస్‌ ఆఫీసర్‌గా చేస్తున్నాను. ఈ సీరియల్‌ ఒప్పుకోవడానికి ముందు కొంచెం భయపడ్డాను. హీరోయిన్‌ అనగానే ఏడ్వాలి.. అనే కాన్సెప్ట్‌ ఉంటుంది. కానీ, ఇందులో ధైర్యవంతురాలిగా ఉంటుంది నా పాత్ర. తండ్రిని చంపిన వారిని శిక్షించాలని అనుకుంటుంది. అలాగని పగ పెంచుకోదు. న్యాయపరంగా ఉంటుంది. నిజంగా పోలీస్‌ జాబ్‌లో ఉన్న అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారు అని ఆ పాత్ర చేస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది.

బంగారు గాజులు సీరియల్‌ పాత్ర సింగింగ్‌ బేస్డ్‌గా ఉంటుంది. చదువుకునే రోజుల్లో మంచి సింగర్‌ని కావాలని సింగింగ్‌ క్లాసులకు కూడా వెళ్లాను. ఇప్పుడు ఈ సీరియల్‌ ద్వారా ఆ ముచ్చట తీరుతోంది. ఈ సీరియల్‌లో పద్మావతిగా నా పాత్ర చాలా సంప్రదాయ బద్ధంగా, తల్లీ–కూతురు మధ్య ఉండే బంధం గొప్పగా ఉంటుంది. అల్లరిపిల్లగా కూడా కనిపిస్తుంది. గోరంత దీపంలోనూ నా పాత్ర పేరు పద్మావతే. ఈ పేరు సెంట్‌మెంట్‌గా వర్కవుట్‌ అయిందన్నారు యూనిట్‌. ఇప్పుడు నా అసలు పేరు మర్చిపోయి యూనిట్‌లో అంతా పద్దు అని, బాపు బొమ్మ అని పిలుస్తుంటారు.
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు