ఈజీ మనీ డీల్ క్యాన్సిల్

22 Aug, 2013 00:24 IST|Sakshi
ఈజీ మనీ డీల్ క్యాన్సిల్

మనీ... మనీమనీ... మోర్ మనీ... ఈజీ మనీ...
 ఒక్కరోజు పనిచేసి ఏడాదికి సరిపడా సంపాదించడం ఎలా?
 ఒక్కరోజులోనే లక్షాధికారులు కావాలనే కోరిక...
 అందుకోసం తప్పుడు పనులు చేయడం...
 కొన్నిరోజులు దర్జాగా బతకడం...
 దొరికిపోతే జైలుపాలవ్వడం...
 ఇదీ నేటి సంపాదనా మార్గం...
 ‘కష్టపడకుండా ఏదీ రాదు...
 కష్టపడకుండా వచ్చిందేదీ ఉండదు...’
 అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన సదాశివ...

 
 డెరైక్టర్స్ వాయిస్:
నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బి.కామ్ చదువుతున్నాను. ఇంతకుముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. ఒక సంవత్సరం పాటు మానేశాను. మళ్లీ చేరబోతున్నాను. ఇంతకుముందు ‘సూసైడ్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను. ఈ సినిమాకి నేనేమీ ఖర్చు చేయలేదు. ఇది ఒక హాబీగా తీసుకుని తీస్తున్నాను. చాలామంది తక్కువ టైమ్‌లో ఎక్కువ సంపాదించాలనుకుంటారు. అలా సంపాదించినవారు ఆ తరవాత ఎన్నో ఇబ్బందుల పాలవుతారు. అటువంటివారిని ప్రేరణగా తీసుకుని తీసిన చిత్రమే ఇది. ఈ చిత్రం తీయడానికి మూడురోజుల సమయం పట్టింది. చార్మినార్ దగ్గర, మా ఇంటి దగ్గర తీశాను. చార్మినార్ దగ్గర తీసిన దృశ్యాలు ఉదయం ఆరు గంటలకే చిత్రీకరించాం. ప్రస్తుతం ‘అన్‌నోన్’ అనే లఘుచిత్రం తియ్యబోతున్నాను.
 
 షార్ట్‌స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఉంటారు. అందులో ఒక సే్నిహ తుడికి... కష్టపడకుండా లక్షాధికారి కావాలనే కోరిక ఉంటుంది. గంట కష్టపడితే రెండు లక్షలు ఇస్తామని ఒక వ్యక్తి ప్రలోభపెట్టడంతో, డ్రగ్స్ సప్లై చేసేవారితో చేయి కలుపుతాడు. వారు చెప్పినచోట డ్రగ్స్ అందచేసి, డబ్బు తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి కొడతారు. అంతలో తేరుకుంటాడు. ఇంతకీ అది కల. ‘‘కలలోనే తప్పు ఇంత భయంకరంగా ఉంటే నిజంగా చేస్తే... ’’ అనుకుంటాడు. ‘డీల్ క్యాన్సిల్’ అనడంతో కథ ముగుస్తుంది.
 
 కామెంట్: మంచి అంశాన్ని ఎంచుకున్నందుకు సదాశివను ముందుగా అభినందించాలి. ఇందులోని కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్, కెమెరా, బ్యాక్ స్కోర్ మ్యూజిక్... అన్నీ బావున్నాయి. ముఖ్యంగా డైలాగులు చాలా బావున్నాయి. ‘‘హైదరాబాద్... కోట్ల రూపాయలు సంపాదించాలనుకున్నవారికి ఎన్నో రూట్లు చూపించే సిటీ’’ ‘‘బస్ రూట్ల కన్నా డబ్బు సంపాదించడానికే రూట్లు ఎక్కువ’’ ‘‘చేతులు కాల్చుకున్నంత ఈజీ కాదు డబ్బు సంపాదించడం’’ వంటి సంభాషణలు చాలా బావున్నాయి. ఒక మంచి థ్రిల్లర్‌లాగ తీశాడు. యూట్యూబ్‌లో సినిమాలు పెట్టేటప్పుడు సిగరెట్ కాలుస్తున్న బిట్స్ చూపిస్తూ, స్మోకింగ్ ఈజ్ ఇన్‌జ్యూరియస్ టు హెల్త్ అనే అవసరం లేకుండా, అసలు బ్యాడ్ హ్యాబిట్స్‌ని చూపించకుండా అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా చూపించాల్సి వస్తే సింబాలిక్‌గా చూపే అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది. మంచి లఘుచిత్రాన్ని, మరింత అందంగా చిట్టితెరకెక్కించినందుకు సదాశివను అభినందించాల్సిందే.
 
 - డా.వైజయంతి
 

మరిన్ని వార్తలు