లేదు క్షమాపణ

17 Feb, 2020 01:08 IST|Sakshi

కథాసారం

మేమిద్దరమూ ఎప్పుడూ పెద్ద కలుపుగోలుగా మాట్లాడుకున్నది లేదు, మాట్లాడుకున్నవి ఏమైనా ఉన్నాయీ అంటే అవి జరుగుతున్న సంగతుల గురించే, నిన్న ఉనికిలోకి వచ్చి ఇవ్వాళ ప్రాధాన్యత కోల్పోయి శూన్యంలోకి క్షయించిపోయేవి.

ఆయన్ని స్ట్రెచర్‌ మీద కిందికి మెట్లగుండా ఆంబులెన్స్‌ కారు దాకా మోసుకెళ్లిన ఇద్దరు మగ నర్సులకు ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చాను. క్లినిక్‌ దగ్గర కూడా వార్డుల్లో పగలు, రాత్రి షిఫ్టుల్లో ఉన్న నర్సులిద్దరికీ చెరో ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చి, ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాను. పేషెంట్‌ను అరగంటకోసారి వచ్చి చూసుకుంటామని వాళ్లు నాకు భరోసా ఇచ్చారు, అదృష్టవశాత్తూ ఆయన ఇంకా స్పృహలోనే ఉన్నప్పటికీ. తరువాయి రోజు ఆదివారం, నేను ఆయన్ని వెళ్లి చూసే వీలుండే రోజు. ఆయన స్పృహలోనే ఉన్నారు, కానీ తక్కువ మాట్లాడారు. ఆయన పక్క మంచం మీద ఉన్న ఇంకో పేషెంటు వల్ల తెలిసిందేమంటే– ఆ ఇద్దరు నర్సులు ఒక్కసారైనా వచ్చి చూసిన పాపాన పోలేదు; అదేమంత ఆశ్చర్యం కలిగించలేదు, వాళ్లు కనీసం నూటాడెబ్బై మందిని చూసుకోవాలి; కనీసం డాక్టర్లన్నా వచ్చి ఆయన్ని పరీక్షేమీ చేయలేదు, అన్నిరకాలుగా సోమవారం చెకప్‌ చేస్తామని చెప్పి. శనివారం పొద్దున తెచ్చినవాళ్ల పరిస్థితి ఎప్పుడూ ఇంతేనని చెప్పాడు ఆ పక్క బెడ్డాయన.

నర్సు కోసం నేను నడవలోకి వెళ్లాను, అంతకుముందు రోజు వాళ్లెవరూ కనబడలేదు. చాలాసేపు గాలించాక ఆదివారం డ్యూటీలో ఉన్న నర్సును కనిపెట్టగలిగాను; ఆమెకు కూడా ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చి కొంచెం మా నాన్నను కనిపెట్టుకుని ఉండమన్నాను. నాకు డాక్టర్‌తో కూడా మాట్లాడాలనుంది, దానికోసం ఇంటి దగ్గర ఎన్వెలప్‌లో ఓ వంద ఫోరింట్‌ నోటు పెట్టుకునొచ్చాను, కానీ డాక్టర్‌ మహిళల వార్డుకు వెళ్లాల్సివచ్చిందనీ, అక్కడ ఒకరికి రక్తం ఎక్కిస్తున్నారనీ, మీకేం టెన్షన్‌ లేదు, నేను ఆయనతో మాట్లాడుతాననీ చెప్పిందామె. నేను మళ్లీ పేషెంట్ల రూమ్‌కు వెళ్లాను, అక్కడ మా నాన్న పక్కబెడ్డాయన పేషెంట్లను చూడ్డానికి డాక్టరుకు ఎటూ టైముండదని కచ్చితంగా చెప్పడంతో ఆయనకు ఇక డబ్బులు ఇచ్చే వీలు లేనట్టయింది. రేపు వార్డు డాక్టర్లు వచ్చినప్పుడే మా నాన్నను చూడటానికి టైముంటుంది.

‘‘నీకేమైనా కావాలా?’’ మా నాన్నను అడిగాను.
‘‘ఏంవొద్దు, థాంక్స్‌.’’
‘‘కొన్ని ఆపిల్స్‌ తెచ్చాను.’’
‘‘థాంక్యూ, నాకేం ఆకలిగా లేదు.’’
మంచం పక్కనే ఇంకో గంటసేపు కూర్చున్నాను. నాకు ఇంకా ఏమైనా మాట్లాడాలని వుందిగానీ మాట్లాడుకునే అంశాలేమీ దొరకలేదు. కొద్దిసేపయ్యాక, ఏమైనా నొప్పిగా ఉందా అని అడిగాను, లేదని చెప్పాడు, ఇంక దాని గురించి మరిన్ని ప్రశ్నలు వేసే వీలులేకపోయింది. నిశ్శబ్దంగా ఉండిపోయాం. మేమిద్దరమూ ఎప్పుడూ పెద్ద కలుపుగోలుగా మాట్లాడుకున్నది లేదు, మాట్లాడుకున్నవి ఏమైనా ఉన్నాయీ అంటే అవి జరుగుతున్న సంగతుల గురించే, నిన్న ఉనికిలోకి వచ్చి ఇవ్వాళ ప్రాధాన్యత కోల్పోయి శూన్యంలోకి క్షయించిపోయేవి. ఉద్వేగాల గురించి మేము ఎప్పుడూ సంభాషించుకోలేదు.

‘‘అయితే మరి నేను బయల్దేరుతా’’ కాసేపయ్యాక అన్నాను.
‘‘సరే.’’
‘‘రేపొచ్చి డాక్టరును కలుస్తాను.’’
‘‘అలాగే.’’
‘‘వార్డు డాక్టరు రేప్పొద్దటికంటే ముందేమీ రాడు.’’
‘‘అంత అర్జెంటేం లేదు’’ అన్నాడాయన, తన చూపుతో నన్ను తలుపుదాకా అనుసరిస్తూ.
తెల్లారి ఉదయం ఏడింటికి వాళ్లు ఫోన్‌ చేశారు, రాత్రి ఆయన చనిపోయారని. నేను మళ్లీ 217 నంబరు గదికి వెళ్లేసరికి ఆ బెడ్డులో అప్పటికే ఇంకో పేషెంటును ఉంచారు. మా నాన్న పోయేముందు పెద్ద ఇబ్బందేమీ పడలేదనీ, కొంచెం ఎగశ్వాస మాత్రం తీసుకున్నాడనీ పక్కబెడ్డాయన నిశ్చయంగా చెప్పాడు. కానీ ఎందుకో ఈ మనిషి నిజం చెప్పట్లేదని నాకు అనుమానం కలిగింది, కానీ ఆయన స్థానంలో నేనున్నా అవే మాటల్ని అదేలాగా చెప్పేవాడిని అనిపించింది. ఇంక నేను ఈయన నన్నేమీ మోసం చేయట్లేదనీ, మా నాన్న నిజంగానే ఏ నొప్పీ లేకుండా ప్రశాంతంగా చనిపోయాడనీ నన్ను నేను నమ్మించుకున్నాను.

ఎన్నో లాంఛనాలు పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. హాస్పిటల్‌ రిసెప్షన్‌లో నన్నో నర్సు కలిసి (శనివారం డ్యూటీలోగానీ, ఆదివారం డ్యూటీలోగానీ లేని నేను అంతకుముందు చూడని కొత్తావిడ) ఆయన బంగారు వాచీ, ఆయన కళ్లద్దాలు, ఆయన పర్సు, ఆయన సిగరెట్‌ లైటరు, ఆపిల్‌ పళ్ల కాగితపు సంచీ ఇచ్చింది. ఆమెకు ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చాను, తరువాయి చేయవలసిన కార్యక్రమం గురించి ఆమె వివరించింది. దాని తర్వాత తోలు టోపీ పెట్టుకున్న ఒకతను వచ్చి బాడీని శుభ్రం చేసి, షేవ్‌ చేసి, బట్టలు వేస్తానన్నాడు. అయితే బాడీ అన్నప్పుడు తన ఉద్దేశం ఏమనిపించిందంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ల గురించీ అని; ఆయన ఇంకా బతికి లేకపోయినప్పటికీ, శుభ్రం చేయలేదూ బట్టలు వేయలేదూ కాబట్టి, అది శవం కూడా పూర్తిగా అప్పటికి అవ్వలేదని.

వంద ఫోరింట్‌ నోట్‌ పెట్టి అతికించిన ఎన్వెలప్‌ ఇంకా నా దగ్గర అలాగే ఉంది, దాన్ని అతనికిచ్చేశాను. దాన్ని అతడు చించి, లోపలికి చూసి, కొట్టినట్టుగా నెత్తిమీదున్న టోపీ తీశాడు, మళ్లీ నా సమక్షంలో ఆ టోపీని పెట్టుకోలేదు. అన్నింటినీ సరిగ్గా చూసుకుంటాననీ, నేను ఒక శుభ్రమైన బట్ట మాత్రం పంపగలిగితే చాలనీ అన్నాడు, నేను కచ్చితంగా తృప్తిపడతానని నమ్మకంగా ఉన్నాడు. నేను మధ్యాహ్నం ఆ బట్ట తెస్తాననీ, దానితోపాటు ఒక ముదురు రంగు సూట్‌ కూడా తెస్తాననీ, కానీ ఇప్పుడు ఆయన్నోసారి చూడాలనుందనీ చెప్పాను.
‘‘ఏంటీ, మీకు బాడీని చూడాలనుందా?’’ నమ్మలేనట్టుగా అడిగాడు.
‘‘అవును’’ అని చెప్పాను.
‘‘కాని తరువాత చూస్తే మంచిదేమో’’ అని సూచించాడు.
‘‘నాకు ఇప్పుడే చూడాలనుంది, ఆయన పోయినప్పుడు నేను పక్కన లేకపోయాను’’ అన్నాను.

అయిష్టంగానే నన్ను మార్చురీకి తీసుకెళ్లాడు, క్లినిక్‌ గార్డెన్‌ మధ్యలో ఉన్న విడి భవనం అది. సెల్లార్‌లో దట్టమైన బల్బు వెలుగుతూ ఉంది. కొన్ని కాంక్రీట్‌ మెట్లు దిగాం, ఆ మెట్లు దిగీ దిగంగానే ఆ కాంక్రీట్‌ ఫ్లోర్‌ మీద వెల్లకిలా పడుకుని ఉన్న మా నాన్న కనిపించాడు. ఆయన మోకాళ్లు పైకెత్తి, కాళ్లు వెడల్పుగా చేసుకుని ఉన్నాడు– సైనికులు యుద్ధంలో చనిపోయినట్టు, పెయింటింగ్స్‌లో వాళ్లను చిత్రించినట్టు. కాకపోతే ఆయనకు బట్టలేవీ లేవు; ఏదో చిన్న దూది ఉండ ఒకటి ఒక ముక్కురంధ్రంలోంచి బయటికి వేలాడుతూ ఉంది. ఇంకొంచెం దూది ఆయన ఎడమ తొడకు అతికించివుంది, కచ్చితంగా చివరి పోటు పొడిచిన స్థానం అయివుండాలి.

‘‘మీరప్పుడే ఏమీ చూళ్లేరు’’ తోలు టోపీ అతను క్షమించమన్నట్టుగా అన్నాడు. అంత చలిగా ఉన్న సెల్లార్‌లో కూడా అతను ఏమీ వేసుకోకుండా నిలుచున్నాడు. ‘‘కానీ ఆయనకు డ్రెస్‌ చేశాక ఎలా కనబడుతాడో మీరే చూద్దురు.’’
నేను ఏమీ మాట్లాడలేదు.
‘‘ఆయనకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదా?’’ కాసేపయ్యాక అడిగాడు అతను.
‘‘అవును, చాలా రోజులుగా’’ అని బదులిచ్చాను.
‘‘నాకు ఏం చేయాలో తెలుసు’’ అన్నాడతను, ‘‘కొద్దిగా జుట్టు క్షవరం చేస్తాను. అది చాలా తేడా చూపెడుతుంది.’’
‘‘నీకు ఎలా అనిపిస్తే అలా’’ అన్నాను.
‘‘అతడు జుట్టును పక్కకు దువ్వుకునేవాడా?’’
‘‘అవును, అదే.’’
అతడు మాట్లాడటం ఆపేశాడు. నేనూ ఏమీ చెప్పలేదు. మా నాన్న గురించి నేను చెప్పవలసిందిగానీ, చేయవలసిందిగానీ ఇంకేమీ లేకపోయింది. అలాగే నేను డబ్బులు ఇవ్వాల్సినవాళ్లు కూడా ఇంకెవరూ లేరు. ఇక నన్ను నేను దిద్దుకోవడానికి ఏ దారీ లేదు, ఆయనతో పాటు నన్ను కూడా పూడ్చిపెట్టినా.


ఓర్కెనీ ఇస్త్వాన్‌

(ఓర్కెనీ ఇస్త్వాన్‌ కథ ‘నో పాడన్‌’ ఇది. పొడి స్వరంలో చెప్పబడిన, మన హాస్పిటళ్లలో జరిగినట్టు   అనిపించే హంగరీ కథ. అనువాదం: సాహిత్యం డెస్క్‌. ఓర్కెనీ(1912–1979) ఇరవయ్యో శతాబ్దపు ప్రసిద్ధ హంగరీ కథా, నాటక రచయిత. ఒక చిన్న సందర్భంలోంచే గొప్ప సత్యాలను వెలికితీసే రచయితగా పేరొందారు. ‘వన్‌ మినట్‌ స్టోరీస్‌’ పేరుతో తన కథలు ప్రచురించారు. తొలినాళ్లలో వీర కమ్యూనిస్టుగా ఉండి, అటుపై తప్పుదోవ పట్టానని బహిరంగంగా ఒప్పుకున్నారు. ద తోథ్‌ ఫ్యామిలీ, ద క్యాట్స్‌ ప్లే ఆయన పేరొందిన నాటకాలు.)

మరిన్ని వార్తలు