తెలుగువారి పెన్నిధి

14 Nov, 2014 23:34 IST|Sakshi
తెలుగువారి పెన్నిధి

వర్ణన రత్నాకరము- ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనం (నాలుగు భాగాలు)
సంకలన కర్త: దాసరి లక్ష్మణస్వామి
ఒక్కొక్క సంకలం వెల: రూ.200 ఎమెస్కో ప్రచురణ ప్రతులకు: 040-23264028
వ్యాఖ్యాతలు:   బేతవోలు రామబ్రహ్మం (98481 69769)
అద్దంకి శ్రీనివాస్ (98488 81838 )

 
ఇటీవల కొన్ని మంచి పనులు ఒక దాని వెంట ఒకటి జరుగుతున్నాయి- తెలుగు భాషకు సంబంధించి. తెలుగు భాషకు విశిష్ట ప్రతిపత్తిని కేంద్రం ప్రకటించిన దరిమిలా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ప్రాచీన తెలుగు- అధ్యయనం’ కేంద్రం ఈ మంచి పనులను తలకెత్తుకుంది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్తగా ఏర్పడిన ఈ అధ్యయన కేంద్రం స్వీకరించిన కీలకమైన పనులలో మొదటిది- ‘వర్ణన రత్నాకరము’ను వెలుగులోకి తేవడం. ఏమిటి ఈ ‘వర్ణన రత్నాకరము’? ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే మనకు దాసరి లక్ష్మణస్వామిగారు (పిఠాపురం) తెలియాలి. మహానుభావులు, కవి పండితులు అయిన లక్ష్మణస్వామిగారు నేటికి 90 ఏళ్ల క్రితం అంటే 1930లో ఒక గొప్ప పని చేశారు. భావితరాలలో తెలుగుభాష ధారణ శక్తినీ, జ్ఞాపకశక్తినీ, పద స్వరూప శక్తినీ, ఉచ్చారణపుష్టినీ, శబ్ద సౌందర్యతుష్టినీ పునర్నవం కలిగించడానికి 15వ శతాబ్దం నుంచి 20 శతాబ్దం వరకూ ఉన్న అసంఖ్యాక కవి పండితుల ఆణిముత్యాల వంటి పద్యాలను సేకరించి వాటిని ‘వర్ణన రత్నాకరము’గా ఏర్చి కూర్చారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 8000  అపురూపమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఆ రోజులలో ఒక ముద్రణకు నోచుకొని ఆ తర్వాత మరుగున పడిపోయిన ఈ  అమూల్య రత్నాకరమును ఇప్పుడు పదుల సంఖ్యలో భాషావేత్తలు, పరిశోధకులు కలిసి- పరిష్కరించి- ఆ పద్యాలకు అన్వయం, వ్యాఖ్య వివరించి పండితుల కోసం కాకుండా పాఠకుల కోసం సరళ సులభశైలిలో విభజన చేసి 250 పద్యాలు ఒక సంపుటం వంతున మొత్తం 26 సంపుటాలను క్రమానుగతంగా వెలువరించే బృహత్‌కృషిలో ఉన్నారు. ఇప్పటికి నాలుగు సంపుటాలు పూర్తయ్యాయి. వీటిని ఎమెస్కో సంస్థ ప్రచురించడానికి ముందుకు రావడమే కాదు తక్కువ వెలకు ఇవ్వడానికి కూడా కట్టుబడటం మంచి విషయం.
 ఈ సంపుటాలలో నన్నెచోడుని మాటల్లో వివరించాలంటే ‘రస రసాయన సుధారసం’ ప్రతి పద్యంలోనూ చిప్పిల్లుతూ ఉంటుంది. ఒక వర్గమా? ప్రకృతిలోని సకల విషయాలు, మానవ ప్రకృతిలోని రకరకాల ఎగుడుదిగుళ్లు, ఉచ్ఛనీచాలు, యావత్తు ప్రాణికోటికి చెందిన నిత్యవ్యాపకాలు, జీవన సమరంలో శృంగారం, సౌందర్యం, అనురాగబంధాలు, సామాజిక బాధ్యతలు, వాటి ఉల్లంఘనలు, వాటి పర్యవసానంగా ఉప్పటిల్లే పరిణామాలు, స్త్రీ-పురుష సంబంధాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికీ తెలుసుకుని మెళకువలతో మెలగడానకీ ఈ రత్నాకరం తోడ్పడుతుంది. స్త్రీలు విద్యావంతులు కాకపోతే వారికే కాదు యావత్తు సమాజానికే ఎన్ని నష్టాలు వాటిల్లుతాయో బోధించే ‘భాస్కర రామాయణం’ పద్యాలు, 19వ శతాబ్ది నాటి ‘నయనోల్లాస’ కావ్య పద్యాలు కనిపిస్తాయి. స్త్రీలు విద్య ద్వారా ‘జ్యోతిష్మతు’లు కావాలని కాళిదాసులా కోరుకునే కవులూ కనిపిస్తారు. మనది ‘మూర్త’ (విగ్రహం లేదా బొమ్మ) సంప్రదాయం కాదు, ‘అమూర్త’ సంప్రదాయమని తెలివిడి చేసి, జ్ఞాన రూపమే జగత్తు అనీ, జ్ఞానం నిజం,భౌతిక ప్రపంచం వాస్తవం అనీ హేతవాదాన్ని చాటిన పద్య శకలాలూ మిమ్మల్ని పలకరిస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు రకాల శత్రువులూ స్త్రీ పురుషులిద్దరినీ వేధించే అంతఃశత్రువులేనని అభేద భావాన్ని ప్రకటించిన సూక్తులనూ వర్ణన రత్నాకరం అందిస్తోంది.

పద్య సంకలనాలు ఇంతకు ముందు చాలానే ఉండవచ్చు. వేటూరి ప్రభాకర శాస్త్రి ‘చాటుపద్య మణిమంజరి’ (రెండు భాగాలు); మానవల్లివారు తొలి పరిష్కర్తగా. నిడదవోలు వారు మలి పరిష్కర్తగా వెలువరించిన పూర్వకవి సంచితం ‘ప్రబంధ మణిభూషణం’ ఉన్నాయి. వీటన్నింటి కన్నా ప్రయోగ వైచిత్రితో విస్తృతిలో సకల కావ్యాలలోని ప్రయోజనకర వస్తు నిర్దేశంతో వెలువడింది- దాసరి వారి ‘వర్ణన రత్నాకరము’. ఆట్టే చూస్తే మనం దక్కించుకున్న సారస్వత సంపద కన్నా అసూయల కారణంగానో అహంకారాల వల్లనో కోల్పోయిన సంపదే ఎక్కవేమో. పదకవితా పితామహుడు అన్నమాచార్యుడి కీర్తనలు ఇంకా ఇరవై వేలు పండితుల వెతుకులాటలోనూ శోధనా నాళికల్లోనూ ఉండిపోయాయి. ప్రభాకరశాస్త్రి గురజాడను చూసి పెట్టమన్న ప్రాచీన ‘పట్టుభట్టు’ కవి రచన ‘ప్రసంత రత్నావళి’ ఉనికే మసకబారిపోయింది. అలాగే తంజావూరు నాయకరాజుల కాలంలో విదుషీమణీ, కవయిత్రీ అయిన కళావతి రచన ‘ప్రబంధ శిరోమణి’ గతీ అంతే అయిందని పండితుల ఫిర్యాదు. వీటిలో దేనికీ, ఒక్క అన్నమయ్య పద సాహిత్యానికి తప్ప సంపుటాల పరంపర భాగ్యం దక్కలేదు. ఆ భాగ్యం యిప్పుడు పద్యకావ్యాల ఉపయుక్త భాగాల రచనగా దాసరివారి ‘వర్ణన రత్నాకరం’ 26 సంపుటాలుగా వెలువడే గౌరవం దక్కుతోంది. చిలకమర్తివారన్నట్టు ‘వర్ణన రత్నాకరం ఎవరి దగ్గర ఉంటుందో తెలుగు సాహిత్యం మొత్తం వారి దగ్గర ఉన్నట్టే’.
 
- ఎ.బి.కె.ప్రసాద్ 9848318414
 

మరిన్ని వార్తలు