అమెరికా జట్టుకి తెలుగుదనం

3 Nov, 2013 23:15 IST|Sakshi

ఫుట్‌సాల్... ఈ పేరు మనకి కొత్తదే...
 ఈ ఆట మాత్రం మన కాలెరిగినదే!!
 పాశ్చాత్యదేశాల్లో ఫుట్‌బాల్‌ని ఇలా కూడా పిలుస్తారు.
 ఎందుకలా పిలవడం..?
 ఆ సందేహాన్ని కొద్దిసేపు పక్కన పెడితే...
 వచ్చే నెల స్పెయిన్‌లో...
 వరల్డ్ ఫుట్‌సాల్ చాంపియన్‌షిప్ ఉంది.
 అయితే ఏంటి?... అంటారా! అక్కడికే వస్తున్నాం!!
 అందులో ఆడుతున్న తెలుగువాడే సాత్విక్...
 సాత్వికత పేరులోనే... బాల్‌ని గోల్ చేయడంలో కాదు!
 ఎడాపెడా గోల్స్ కొట్టేసి యుఎస్ టీమ్‌లో ఒకడయ్యాడు.
 అన్న కార్తీక్‌తో కలిసి ఫుట్‌సాల్ నేర్చుకున్నాడు సాత్విక్.
 అమ్మ మాధురి... నాన్న సుధీర్ వీళ్లకి ఆట నేర్పించారు.
 ఆ వివరాలే ఈ వారం మన లాలిపాఠం!!

  సాత్విక్ రెడ్డి... పన్నెండేళ్ల కుర్రాడు, అమెరికాలో పుట్టి పెరుగుతున్నాడు. అన్న కార్తీక్‌తో కలిసి ఐదారేళ్లుగా ఫుట్‌సాల్ ఆటను ఆడుతున్నాడు. గడచిన సెప్టెంబరులో అమెరికా ఫుట్‌సాల్ ఆటలో నెగ్గాడు. అండర్ 12 కేటగిరీలో యుఎస్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డిసెంబర్‌లో జరిగే వరల్డ్ ఫుట్‌సాల్ చాంపియన్‌షిప్‌కి యుఎస్ తరఫున ఆడనున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సాత్విక్ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు సాక్షితో చెప్పిన విషయాలు...
 
 మనవాడే అమెరికా తరఫున ఆడుతున్నాడు!
 
 ‘‘మా అమ్మాయి మాధురి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. 1994లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. మా అల్లుడు వంగాటి సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు. ఇప్పుడు ఇద్దరూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ కాలిఫోర్నియాలో ఉంటున్నారు. వాళ్లపిల్లలే సాత్విక్, కార్తీక్. ఇద్దరూ సాకర్ ప్లేయర్లే. ఇప్పుడు అమెరికా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నది చిన్నవాడు సాత్విక్. డిసెంబర్‌లో స్పెయిన్ దేశపు రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగే వరల్డ్ ఫుట్‌సాల్ చాంపియన్‌షిప్‌లో అమెరికా తరఫున ఆడుతాడు’’ అన్నారు సాత్విక్ అమ్మమ్మ భారతి.
 
 టీవీ అంటే సాకర్ చానలే!
 
 ఫుట్‌బాల్, సాకర్, ఫుట్‌సాల్... ఈ పదాల్లో అయోమయాన్ని తొలగించారు శిశుపాల్‌రెడ్డి. ‘‘మనం ఫుట్‌బాల్ అంటాం, అమెరికాలో సాకర్ అంటారు. ఈ సాకర్ గేమ్‌నే కొద్దితేడాతో జట్టుకు ఐదుగురు ఆటగాళ్ల చొప్పున ఇండోర్‌లో ఆడితే ఫుట్‌సాల్ అని, హాల్ ఫుట్‌బాల్ అని, మినీ ఫుట్‌బాల్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఫుట్‌సాల్‌తో ఆట మొదలుపెట్టిన చాలామంది క్రీడాకారులు పెద్దయ్యేసరికి సాకర్ ఆటవైపే మొగ్గు చూపి సాకర్ ప్లేయర్లుగా స్థిరపడుతుంటారు. ఇక్కడ మనకు క్రికెట్ మీద ఉన్నంత మోజు అమెరికాలో ఈ ఆట మీద ఉంది. ఈ ఆటకు అక్కడి స్కూళ్లలో మంచి ప్రోత్సాహం ఉంది. కేవలం సాకర్ ఆటను ప్రసారం చేయడానికే అక్కడ ఒక టెలివిజన్ చానెల్ ఉంది. కార్తీక్, సాత్విక్ ఇద్దరికీ టీవీ చూడడం అంటే సాకర్ చానెల్ చూడడమే. మా అల్లుడు సుధీర్‌కీ సాకర్ అంటే ఇష్టం. దాంతో పిల్లలకు స్కూల్లో స్పోర్ట్స్ అవర్‌లో ఆడే ఆటతో సరిపెట్టకుండా స్పెషల్ కోచింగ్ ఇప్పించారు’’ అన్నారాయన.
 
 శ్లోకాలూ నేర్చుకున్నారు!
 
 పిల్లలకు విద్యేతర కార్యక్రమాల్లో శిక్షణనిప్పించాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా... వాళ్ల దినచర్యలో పిల్లలను కోచింగ్‌లకు తీసుకెళ్లడమూ ఒక భాగంగా చేసుకోవాలి. ‘‘మా అమ్మాయి మాధురికి బ్యాంకులో ఉద్యోగం. ఉదయం ఆరుగంటలకే వెళ్తుంది. అల్లుడుగారు ఆఫీసుకు వెళ్తూ పిల్లల్ని స్కూల్లో దించుతారు. మా అమ్మాయి ఇంటికి వస్తూ పిల్లల్ని పికప్ చేసుకుంటుంది. తల్లీపిల్లలు సాయంత్రం నాలుగ్గంటలకు ఇంటికి వస్తారు. ఆ తర్వాత పిల్లల్ని చెస్ క్లాసులకు తీసుకెళ్తుంది. పిల్లలకు తెలుగు రావాలని ఆ క్లాసులకూ తీసుకెళ్తుంది, మా మనవళ్లిద్దరూ శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నారు. శని, ఆదివారాలు స్కూలుకు సెలవు. ఆ రోజుల్లో సాకర్ శిక్షణ తరగతులకు తీసుకెళ్తుంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో ఎంతగా నిమగ్నమైనప్పటికీ చదువుని అశ్రద్ధ చేయనివ్వదు మా అమ్మాయి. పిల్లలిద్దరూ ఏ గ్రేడ్‌లో ఉంటారు’’ అంటారు భారతి.
 
 ఖర్చుతో కూడిన వ్యవహారమైనా..!

 
 సాత్విక్, కార్తీక్ ఇద్దరూ రెండోతరగతి నుంచే ఫుట్‌సాల్ అడుతున్నారు. చాలా టోర్నమెంట్లలో స్కూలుకి ప్రాతినిధ్యం వహించి గెలిచారు. అయితే సాకర్ కోచింగ్ ఖర్చుతోకూడిన వ్యవహారం. యుఎస్‌లాంటి దేశాల్లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేయడానికి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఎవరికైనా తొలిదశలో స్పాన్సర్‌షిప్ లభించడం కష్టమే. ‘‘స్పాన్సర్‌షిప్ రావాలంటే జూనియర్ స్థాయి దాటాలి. అయితే మా మనవళ్లకి రెండు-మూడు కంపెనీలు స్పాన్సర్ చేశాయి, కానీ కోచింగ్‌కి, ప్రాక్టీస్‌కి సరిపోయేంత మొత్తం కాదు. అక్కడ కోచ్‌ల ఫీజు ఎక్కువ. స్టేడియంని గంటల లెక్కన తీసుకుంటారు. స్టేడియానికి చెల్లించాల్సిన డబ్బు కూడా శిక్షణ తీసుకునే ఆటగాళ్ల దగ్గరే వసూలు చేయాలి. ఫీజు ఎక్కువ అనేగానీ, అక్కడ కోచ్‌లు డబ్బుకు పనిచేస్తున్నట్లు కాక ఆటే జీవితం అన్నట్లు ఉంటారు. ఆటగాడు రాణిస్తే కోచ్‌కి కూడా పేరు వస్తుందనే ఒక్క విషయంలోనే కాదు... ఆటగాడిని తయారు చేయడమే తమ లక్ష్యం అన్నట్లు శ్రద్ధ తీసుకుంటారు. గ్రౌండ్‌లో ఆట నేర్పించడంతోపాటు మెటీరియల్ ఇచ్చి థియరీ నేర్పిస్తారు. క్రీడాకారులు పాటించాల్సిన ఆహార నియమాల లోనూ అంతే శ్రద్ధగా ఉంటారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినవద్దని, విటమిన్లతో కూడిన ఆహారం, హెల్త్‌డ్రింకులను సూచిస్తారు’’ అన్నారు శిశుపాల్ రెడ్డి.
 
 నా కల మనవళ్లతో తీరింది!
 
 సాత్విక్ రెడ్డి తాతగారు శిశుపాల్ రెడ్డి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మెయింటెనెన్స్ ఇంజినీర్. ఆయన తన క్రీడాసక్తిని గుర్తు చేసుకుంటూ... ‘‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్దగా ఆడలేకపోయాను కానీ ఇష్టం మాత్రం తగ్గలేదు. నా ఉద్యోగమైనా క్రికెట్‌కు దగ్గరగా ఉండాలని క్రికెట్ స్టేడియంలో చేరాను. మా అబ్బాయి శ్రీకాంత్‌ని క్రికెట్ ప్లేయర్‌ని చేద్దామని ఉండేది. శ్రీకాంత్ స్కూల్ లెవెల్ వరకు ఆడాడు కానీ తనకు ఆట మీద పెద్దగా ఆసక్తి లేదు. పెద్ద చదువులకు లండన్ వెళ్లడంతో ఆటను కొనసాగించలేదు. ఇప్పుడు నా మనవళ్లు క్రీడాకారులవుతుంటే చాలా సంతోషంగా ఉంది’’ అన్నారాయన.
 
 నైపుణ్యానికి ప్రోత్సాహం తోడైతే..!
 
 సాత్విక్, కార్తీక్ అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఉండడంతో ఈ సోదరులిద్దరూ సెలవులకు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోనే గడుపుతారు. సాత్విక్ నానమ్మ విజయకుమారి, తాతయ్య బల్వంత్‌రెడ్డి. వీరి పెద్దబ్బాయి సుధీర్ పిల్లలు సాత్విక్, కార్తీక్. ‘‘సాత్విక్‌కి ఫుట్‌బాల్ ఎంతిష్టం అంటే... చిన్నప్పుడు కూడా ఇంట్లో నా వైపుకి బాల్ వేస్తూ నన్ను కూడా ఆడమనేవాడు. మేము యుఎస్ వెళ్లినప్పుడు పిల్లలతోపాటు సాకర్ కోచింగ్ ఇచ్చే స్టేడియాలకు వెళ్లేవాళ్లం. అక్కడి వాతావరణం క్రీడాకారులు తయారవడానికి అనువుగా ఉంటుంది. స్కూళ్లలో కూడా పెద్ద పెద్ద క్రీడాప్రాంగణాలు ఉంటాయి. ఇండోర్‌ప్రాంగణాలు చాలా విశాలంగా ఉంటాయి. పిల్లల్లో క్రీడాస్ఫూర్తి ఉండి, దానికి తల్లిదండ్రుల సహకారం తోడైతే చాలు. చక్కటి క్రీడాకారులు తయారుకావచ్చు. నేను టీచర్‌గా ఇక్కడ చాలామంది విద్యార్థులను చూశాను. చాలామందిలో నైపుణ్యం ఉంటుంది, కానీ సౌకర్యాలు, అనువైన వాతావరణం లేకపోవడంతో రాణించలేకపోయేవారు. కాలిఫోర్నియాలో మా కోడలు, కొడుకు ఇద్దరూ వీకెండ్స్‌లో ఇంట్లో ఉండడమే తక్కువ. ఒక్కోసారి పిల్లలిద్దరికీ వేర్వేరు స్టేడియాలలో ట్రైనింగ్ పడుతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులిద్దరూ చెరో పిల్లాణ్ని తీసుకువెళ్లి ఏ రాత్రికో తిరిగి వస్తారు. మా అబ్బాయికి ఉద్యోగరీత్యా టూర్లు ఉంటాయి. మా కోడలి మల్టీటాస్కింగ్‌తోనే అంతా సజావుగా సాగుతోంది.’’ అన్నారు విజయకుమారి.
 
 దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు. పిల్లల్లో దాగిన నైపుణ్యం ఏంటో తెలుసుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకిస్తాడు. దానిని సరిగా గుర్తించమని తల్లిదండ్రులకు పరీక్ష కూడా పెడతాడు. సాత్విక్ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల మాటలు వింటే మాధురి, సుధీర్ ఇద్దరూ దేవుని పరీక్షలో పాస్ అయ్యారనే చెప్పాలి. తల్లిదండ్రులు తమ కోసం ఇంతగా శ్రమిస్తుంటే ఏ పిల్లలూ చూస్తూ ఊరుకోరు. అమ్మానాన్నల శ్రమను, శ్రద్ధను గౌరవిస్తారు. తాము గెలిచి, అమ్మానాన్నలను కూడా గెలిపిస్తారు.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 మా కోడలు ‘సాకర్ మామ్’!
 పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో మా కోడలు మాధురి పాత్ర కీలకమైనది. అమెరికాలో పిల్లల్ని కోచింగ్‌లకు తీసుకెళ్లడమే పెద్దపని. అక్కడ కోచ్‌లు రోజూ ఒకే స్టేడియంలో శిక్షణనివ్వరు. ఏరోజు ఏ స్టేడియం బుక్ చేసుకుంటే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లాలి. తల్లిదండ్రులే తీసుకెళ్లి, క్లాసు పూర్తయ్యే వరకు ఉండి పిల్లల్ని తీసుకురావాలి. ఇంత శ్రద్ధ తీసుకునే తల్లులను అక్కడ ‘సాకర్ మామ్స్’ అంటారు. మా కోడలు కూడా మంచి సాకర్ మామ్ అనే చెప్పాలి.
 - బల్వంత్‌రెడ్డి, సాత్విక్ తాతగారు
 

మరిన్ని వార్తలు