కదిలే కోవెల... రథం

17 Nov, 2019 05:49 IST|Sakshi

ఆలయం ఆగమం

రథం అనే పదం.. రథం ఉపయోగం చాలా ప్రాచీనమైనది. తొలివేదమైన ఋగ్వేదంలోనే రథం గురించి.. వాటి నిర్మాతలైన రథకారుల గురించి వివరాలున్నాయి. ఆలయవ్యవస్థ కంటే ముందే రథం రూపుదిద్దుకుంది అని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. దేవతలు ఉపయోగించే వాటిని దేవతారథాలనీ.. ఆలయంలో ఉత్సవాలప్పుడు వాడేవాటిని ఆలయరథాలనీ.. యుద్ధాలలో పోరాటాలకు వినియోగించేవి యుద్ధ/సాంగ్రామిక రథాలనీ అంటారు. నాలుగు చక్రాలు ఉంటే శకటం అనీ.. ఆరు చక్రాలుంటే స్యందనం అనీ.. ఎనిమిది చక్రాలుంటే సభద్రం అనీ.. పదిచక్రాలుంటే మేరువు అనాలని ఆగమసారం చెప్తోంది. వీటిలో ఆలయరథం నిర్మాణం విలక్షణమైనది. ప్రతి రథాన్ని నడపడానికి ఏదోక అనువుంటే ఇక్కడ మాత్రం భక్తులే రథచాలకులు. ఈ రథం నిర్మాణానికి అనాదిగా కొయ్యనే వాడుతున్నారు.

ఆలయరథం అనగానే.. పెద్ద పెద్ద చక్రాలు..వాటికి జోడించిన ఇరుసులు...వాటిపై  ఆలయానికి వలెనే అధిష్ఠానం.. దానిపైన మండపం.. మండపం మధ్యలో దేవతా విగ్రహాన్ని ఉంచే దివ్యపీఠం.. పీఠానికి వెనుక ప్రభావళి.. మండపంపైన విమానం.. విమానం తుదిభాగంలో శిఖరకలశం.. దానికి అమర్చిన ఛత్రం (గొడుగు).. ఇంకా దానికి సింహాలు.. ద్వారపాలక విగ్రహాలు.. అశ్వాలు.. సారధి విగ్రహం మొదలైన దారు (కొయ్య) విగ్రహాలను తగిలించి జెండాలతో.. రంగురంగుల వస్త్రాలతో.. పూలమాలలతో అలంకరించబడి.. రథోత్సవం రోజున ఆలయమే కదిలి వస్తుందా అనిపిస్తుంది. ఆలయానికి మరోరూపు అనుకునే రథోత్సవంతోనే ఉత్సవాలు సమాప్తమౌతాయి. రథం స్వయందేవాలయమే కనుక కొన్ని ఆలయాల్లో రథోత్సవం ప్రారంభం కాగానే గుడి తలుపులు మూసివేయడం సంప్రదాయం. అంటే దేవుడు అప్పుడు రథంలో ఉన్నాడని అర్థం.

అలాగే ‘రథస్థం కేశవం దష్ట్వా పునర్జన్మ న విద్యతే ‘రథంపై ఉన్న కేశవుడిని చూస్తే మరుజన్మ ఉండదని పురాణవచనం. సంవత్సరానికోసారి జరిగే ఉత్సవాల్లో చివరిరోజు రథోత్సవం నాడు వేలాదిమంది భక్తులు ఒక్కటై అతిపెద్ద తాడును రథానికి పూన్చి రథాన్ని లాగే సన్నివేశం మాటలకందని దివ్యభావనను అందిస్తుంది. రథంపై కదిలొస్తున్న దేవుని జయజయధ్వానాలతో కీర్తించే భక్తుల గొంతులు ఏకమై స్మరించేవారంతా తరించాలని దేవుడు దీవెనలనందిస్తాడు. భక్తులు కోరుకున్నవన్నీ నిజం చేస్తాడు. ఆలయానికి.. రథానికి ఉన్న అవినాభావ సంబంధం అంత గొప్పది. కనుకనే ఎన్నో ఆలయాలు రథాకారంలో ఉన్నాయి. కోణార్క్‌ సూర్య దేవాలయం, చెన్నై పార్థసారథి ఆలయం, హంపి విఠ్ఠల ఆలయం రాతితేరు, మహాబలిపురం పంచరథాలు, తాడిపత్రి చింతలవెంకట రమణస్వామి దేవస్థానం గరుడాలయం ఇవన్నీ రథాకారంలో రూపుదిద్దుకున్నవే.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

మరిన్ని వార్తలు