26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం

26 Nov, 2018 02:30 IST|Sakshi

‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’. ఉరితీసే ముందు అజ్మల్‌ కసబ్‌ చివరి మాటలివి. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ అని! పాకిస్తానీ టెర్రరిస్ట్‌ కసబ్‌. ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి! 2008 నవంబర్‌ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిపించి, 174 మంది దుర్మరణానికి, మూడొందల మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన లష్కరే తోయిబా టెర్రరిస్ట్‌. అతడి చివరి మాటలివి. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది.

అంతకు నాలుగేళ్ల క్రితమే.. ముంబై పేలుళ్లు జరిగిన మరుసటి రోజు.. మళ్లీ ఇలాంటి ఘోరం జరగనిచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రతిన పూనింది. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా? మారిందని మనకు అనిపించవచ్చు. అయితే టెర్రరిస్టులను సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీస్‌ అధికారుల కుటుంబాల పరిస్థితి మాత్రం ఏం మారలేదని అంటున్నారు. అసలు పరిస్థితిని మార్చుకోవలసినంతగా ఎందుకు మనం నిర్లక్ష్యం వహించామని అడుగుతున్నారు. ఆ ఐదుగురి గురించి ఒక మననం. ఆ కుటుంబాల గురించి ఒక అవలోకనం.

హేమంత్‌ కర్కరే
ముంబై యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) చీఫ్‌. దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్‌ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం! కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్‌బ్లెస్‌ హాస్పిటల్‌కి మూవ్‌ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్‌బ్లెస్‌కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్‌ క్వాలిస్‌ జీప్‌ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్‌లెస్‌లో ఇన్ఫర్మేషన్‌ రావడంతో అక్కడికి Ðð ళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు.
 
హేమంత్‌ కర్కరే, కవిత

కుటుంబం: భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్‌ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్‌ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్‌ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని కవిత ఎప్పుడూ అంటుండేవారు. పోలీస్‌ సిబ్బందికి అధునాతనమైన ఆయుధాలను ఇవ్వాలని, వాళ్లను ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేసే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు.

తుకారామ్‌ ఆంబ్లే
అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. టెర్రరిస్టులు మెరైన్‌ డ్రైవ్‌ వైపు వెళుతున్నారని సమాచారం రావడంతో.. ఆ దారిని బ్లాక్‌ చేసే డ్యూటీని తుకారామ్‌కి అప్పజెప్పింది డిపార్ట్‌మెంట్‌. కారును ఆపాడు. ఒట్టి చేతుల్తో కసబ్‌తో కలియబడి అతడి దగ్గరున్న బుల్లెట్‌లన్నీ లాగేసుకున్నాడు. తుకారామ్‌ ఆ పని చేయకపోయుంటే.. కసబ్‌ తనని తను కాల్చుకుని ఉండేవాడేమో. టెర్రరిస్టులతో  జరిగిన ఆ ఘర్షణలోనే తుకారామ్‌ మరణించాడు.

తుకారామ్‌ ఆంబ్లే, తారాబాయి

కుటుంబం: తుకారామ్‌ ఆంబ్లేకి నలుగురు కూతుళ్లు. పవిత్ర, వందన, వైశాలి, భారతి.  కొడుకులు లేరు. భార్య తారాబాయి. ఉగ్రదాడుల్లో తుకారామ్‌ చనిపోయే నాటికి పవిత్రకు, వందనకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ ఇంట్లో ప్రస్తుతం తారాబాయి, వైశాలి, భారతి ఉంటున్నారు. ‘‘ఇప్పటికీ.. మా నాన్న డ్యూటీ అయిపోయాక, ఇంట్లోకి రాగానే తలపై నుంచి టోపీ తీసి రోజూ పెట్టే చోటే తగిలించి, మా వైపు చూసి నవ్వుతూ ‘ఏంటి విశేషాలు..’ అని అడుగుతున్నట్లే ఉంటుంది. కానీ మాకు తెలుసు మా నాన్న తిరిగి రారని. వస్తే బాగుండని అనిపిస్తుంది’’ అని అంటుంది వైశాలి.

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌
సందీప్‌ ఆర్మీ ఆఫీసర్‌. తాజ్‌ హోటల్‌లోని ఆరో ఫ్లోర్‌లో ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్‌.ఎస్‌.సి. (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) టీమ్‌ని లీడ్‌ చేసింది సందీపే. మొత్తం పదిమంది కమాండోలు. వారికి గైడ్‌లైన్స్‌ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగిన కాల్పుల్లో సందీప్‌ చనిపోయాడు.


మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌, అమ్మ ధనలక్ష్మి

కుటుంబం: అమ్మ ధనలక్ష్మి, నాన్న ఉన్నికృష్ణన్‌.. సందీప్, వీళ్ల ముగ్గురే. సందీప్‌ ఒకడే సంతానం. పెళ్లి కావలసి ఉంది. ఉగ్రవాదులతో తలపడుతున్నప్పుడు.. ‘‘ముందుకు వెళ్లకండి. నేను హ్యాండిల్‌ చేస్తాను’’ అన్నవి అతడి చివరి మాటలు. ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా కమాండోలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ‘‘నా కొడుకు చనిపోలేదు. బతికే ఉన్నాడు’’ అని అంటుంటారు ధనలక్ష్మి.. ఎవరు ఆనాటి సంఘటనను ప్రస్తావించినా.

అశోక్‌ కామ్తే
అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. ఎటాక్‌ జరుగుతున్న ఏరియా అతడి పరిధిలోని కాదు. కానీ టెర్రరిస్టులు అనగానే అక్కడి ఆఫీసర్స్‌కి సహకారం అందించడానికి బయల్దేరాడు. సి.ఎస్‌.ఎం.టి. రైల్వే స్టేషన్‌లో హేమంత్‌ కర్కరేకి, విజయ్‌ సలాస్కర్‌కి జత కలిశాడు. వారితో కలిసి క్వాలిస్‌ జీప్‌ ఎక్కాడు. వీళ్ల జీప్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుంటే.. చివరి వరకు అతడి తుపాకీ గర్జిస్తూనే ఉంది. కర్కరే, సలాస్కర్, తర్వాత అశోక్‌ కామ్తే టెర్రరిస్టుల బులెట్‌లకు బలి అయ్యాడు.

అశోక్‌ కామ్తే, వినీత

కుటుంబం: అశోక్, ఆయన భార్య వినీత, ఇద్దరు కొడుకులు రాహుల్, అర్జున్, అశోక్‌ తల్లిదండ్రులు, చెల్లి షర్మిల అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. అశోక్‌ మరణంతో ఆ కుటుంబం ఆత్మస్థయిర్యం సడలింది కానీ, అశోక్‌ భార్య ధీశాలిగా కుటుంబం కోసం నిలబడ్డారు. భర్త జీవిత చరిత్రను ‘టు ద లాస్ట్‌ బుల్లెట్‌’ అనే పుస్తకంగా తెచ్చారు. వినీత లా చదివారు. కార్మికుల కేసులను వాదిస్తుంటారు. అశోక్‌ చనిపోయాక, ఆయన ఉండే గదికి ఆ కుటుంబం ఒక బోర్డును పెట్టింది. ‘‘మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం. మీరు మా హీరో’ అని అందులో రాసి ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ నిర్లక్ష్యం వల్లే తన భర్త.. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడని వినీత ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు.

విజయ్‌ సలాస్కర్‌
పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. యాంటీ–ఎక్స్‌టార్షన్‌ (బలవంతపు వసూళ్ల నిరోధం) హెడ్డు. కర్కరే, కామ్తేలతో పాటు  ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు.  

విజయ్‌ సలాస్కర్‌ భార్య స్మిత

కుటుంబం: విజయ్‌ సలాస్కర్‌ భార్య స్మిత. కూతురు దివ్య ఏకైక సంతానం. విజయ్‌ చనిపోయేటప్పటికే ఆమె వయసు 21. ‘‘డాడీ ఎప్పుడూ త్వరగా ఇంటికి రారు. కానీ ఆ రోజు రాత్రి (నవంబర్‌ 26) త్వరగా వచ్చారు. ‘‘త్వరగా వచ్చారేంటి డాడీ’’ అన్నాను. ‘‘నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామనీ’’ అని నవ్వుతూ అన్నారు. ‘‘అయితే లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్‌ తినాల్సిందే’’ అన్నాను. మమ్మీ తిట్టింది. ‘‘ముందు ఆయన్ని భోజనం చెయ్యనివ్వు. తర్వాత వెళ్దువు’’ అంది. నేను.. నా బెడ్‌రూమ్‌లోకి వెళ్లాను. అంతే. ఆ తర్వాత డాడీకి ఏదో  కాల్‌ వచ్చింది. వెంటనే వెళ్లిపోయారు. 11.57 కి ‘‘ఎక్కడున్నారు?’’ అని మమ్మీ డాడీకి ఫోన్‌ చేసింది. ‘‘స్పాట్‌’లో అని చెప్పారట డాడీ. చెప్పుడూ చెప్పే జవాబే! ‘‘ఇదేం బాగోలేదు’’ అంటోంది మమ్మీ. కొంతసేపటి తర్వాత టీవీ స్క్రోలింగ్‌లో డాడీ చనిపోయినట్లు వచ్చింది’’.. అని మాత్రం షేర్‌ చేసుకోగలుగుతున్నారు దివ్య. ఆ తర్వాతి ఘటనలు గుర్తు చేసుకోడానికి ఆమె ఇష్టపడడం లేదు.

వీళ్లైదుగురే కాదు. బ్రేవ్‌ హార్ట్స్‌ ఇంకా ఉన్నాయి. హవల్దార్‌ గజేంద్రసింగ్, నాగప్ప మహాలే, కిశోర్, షిండే, సంజయ్‌ గోవిల్కర్‌ వంటి ఎందరో ఉగ్రమూకలతో ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షతగాత్రులయ్యారు.  పాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షత గాత్రులయ్యారు. 

మరిన్ని వార్తలు