విండో ఫొటోగ్రాఫర్!

19 Nov, 2014 00:16 IST|Sakshi
విండో ఫొటోగ్రాఫర్!

మహానగరాల్లో నివసించే గృహిణులకు, ఇరుగూ పొరుగూ పలకరించే అవకాశం కూడా తక్కువే. అలాంటి సమయాల్లో అపార్ట్‌మెంట్ కిటికీలకు ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే కిటికీ ద్వారానే కదా విశ్వాన్ని వీక్షించగలిగేది. అలా ఈమె కూడా తమ బాల్కనీ నుంచి సరికొత్త ప్రపంచాన్ని వీక్షించగలిగింది. కెమెరా ద్వారా వినీలాకాశంలో ఎగిరే విహంగాలను అద్భుతంగా చిత్రీకరించింది. సరికొత్త గుర్తింపును సంపాదించుకొంది. ఆమె పేరు - సీమా రాజెషిర్కే. థానే లోని బ్రహ్మండ్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. నాలుగు గోడలూ దాటకుండానే నలుగురి నోటా పెద్ద ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొన్న సీమ కథ ఇది...
 
పచ్చని చెట్ల మధ్య ఉంటుంది సీమ కుటుంబం నివసించే అపార్ట్‌మెంట్. బాల్కనీ నుంచి బయటకు చూస్తే... పచ్చని చెట్లు, ఆ చెట్లనే ఆవాసంగా మార్చుకొన్న పక్షులు కనిపిస్తాయి. చూసి ఆనందించడానికి చక్కటి వాతావరణమది. ఆస్వాదించదగ్గ ఆ వాతావరణం సీమలో కొత్త ప్రతిభను మేల్కొలిపింది. ఇంట్లో పిల్లల కోసమని ఒక కొత్త కెమెరాను తీసుకొచ్చాడట భర్త. అదెలా పనిచేస్తుందనే విషయం గురించి వివరిస్తూ ఆయన వారిలో అవగాహన నింపడానికి చెబుతున్న పాఠాలను సీమ కూడా చెవిన వేసుకుంది.
 
ఒక రోజున భర్త ఆఫీసుకు... పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోయాక.. సరదాగా కెమెరాను చేతబట్టి బాల ్కనీలోంచి బయటి దృశ్యాలను క్లిక్ మనిపించడం ప్రారంభించింది.అన్నింటిలోకీ బర్డ్ ఫోటోగ్రఫీ అత్యంత క్లిష్టమైనదనే పేరుంది. వివిధ రకాల పక్షులను ఒకచోట పట్టుకోవడమే కొంచెం కష్టమైన పని. ఆ తర్వాత వాటిని ఫోటోలు తీయడం మరింత కష్టంతో కూడుకున్న పని. అలాంటి కష్టాన్నే సీమ ఇష్టంగా మార్చుకుంది. తమ అపార్ట్‌మెంట్ చుట్టూ ఉన్న చెట్లపై అనేక రకాల పక్షులు కనిపిస్తున్న విషయాన్ని గ్రహించిందామె. వివిధ రకాల వాతావరణాల్లో.. ఎగురుతున్నా, ఒదిగి ఉన్న, గుంపుగా ఉన్న పక్షుల ఫోటోలను తీయడం మొదలు పెట్టింది. సరదాగా మొదలైన ఆ పని... హాబీగా మారింది.
 
అలా తను తీసిన ఫోటోలను భర్తకు చూపింది. ఆయన ప్రోత్సాహంతో  ఏడాది నుంచి తాను తీసిన పక్షుల ఫోటోలన్నింటితో ఒక ప్రదర్శన నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఆమెకు ఇప్పుడు మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆమె తీసిన ఛాయాచిత్రాలన్నీ కిటికీ దగ్గర నుంచి తీసినవే అన్న విషయం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.
 
ఆమె తీసిన ఫోటోలు అద్భుతంగా ఉండటమే కాదు.. కొన్ని అరుదైన జాతుల ఫోటోలు కూడా ఉన్నాయంటున్నారు వాటిని వీక్షించిన వారు. ఇంటికే పరిమితమై.. ఇలాంటి ఫీట్‌ను సాధించిన ఈ గృహిణి ఎన్నో రకాలుగా స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ప్రతిభ ఉండాలే కానీ.. ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల మధ్యనైనా దాన్ని బయటపెట్టుకొనే అవకాశం ఉంటుందనడానికి సీమ ఒక ఉదాహరణ.

మరిన్ని వార్తలు