పట్టరాని కోపం

30 May, 2019 05:08 IST|Sakshi

చెట్టు నీడ / రంజాన్‌ కాంతులు

చాలా రోజుల తర్వాత కొత్త బట్టలు ధరించే అవకాశం ఇచ్చిన అల్లాహ్‌ కు కృతజ్ఞతలు చెప్పుకొని నమాజ్‌ కోసం మసీదుకు వెళుతున్నాడు ఒక వ్యక్తి. అసలే తెల్లని బట్టలు. ఎక్కడ మట్టి అంటుకుంటుందోనని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు.దారిలో ఆడుకుంటున్న పిల్లాడు రాయి విసిరాడు. అది కాస్తా పక్కనే ఉన్న బురదలో పడి దాని చిందులు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి తెల్లని దుస్తులపై పడ్డాయి. ఆ వ్యక్తికి కోపం నషాళానికి ఎక్కింది. పట్టరాని ఆగ్రహంతో  ఆ కుర్రాడి మీదకు పరిగెత్తాడు.అంతలో ‘‘కోపం సైతాన్‌ ప్రేరణతో వస్తుంది. నిలబడి ఉండగా కోపం వస్తే వెంటనే కూర్చోండి. కూర్చోని ఉండగా కోపం వస్తే వెంటనే పడుకోండి’’ అన్న  ప్రవక్త ముహమ్మద్‌ గారి ప్రవచనం గుర్తుకు వచ్చింది.

ఆ వ్యక్తి వెంటనే ఆ బురదలో కూర్చున్నాడు. కోపం తగ్గలేదు. వెంటనే బురదలో పడుకున్నాడు.బట్టలు పాడైతే మళ్లీ కొనుక్కోవచ్చు. కాని సైతాన్‌ కోపంలో ఏదైనా చెయ్యరాని పని చెయిస్తే. శాశ్వతమైన స్వర్గానికి దూరం కావాల్సి ఉంటుంది.కుస్తీ పట్టి ఇతరుల్ని చిత్తు చేసేవాడు అసలైన శూరుడు కాడు. తనకు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపే వాడే వాస్తవానికి ధీరుడు. అన్నారు ప్రవక్త (స).ఉపవాసాల అసలు ఉద్దేశం దైవభీతి జనింపజేయడం. సహన గుణం అలవర్చకోవడం.ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు మనలో కోపాన్ని అదుపు చేసే గుణం అలవర్చకోగలిగే వారు నిజంగా అదృష్టవంతులు.
– షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌

మరిన్ని వార్తలు