కోతే కదా అని వదిలేస్తే, కొరికి చంపేస్తోంది...

14 Oct, 2013 00:23 IST|Sakshi
కోతే కదా అని వదిలేస్తే, కొరికి చంపేస్తోంది...

జపాన్‌లో కోతుల బెడద రోజురోజుకీ పెరిగిపోతోందట. దానితో చాలా నష్టపోతున్నారట కూడా. అందుకే జపాన్ ప్రభుత్వం కోతుల వలన నష్టపోయిన కుటుంబాలకు పెద్దఎత్తున నష్టపరిహారం కూడా ఇస్తోందట. పశ్చిమ జపాన్‌లోని హ్యూగా నగరంలో ఇప్పటికి ఈ విధంగా 18 కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందట.


 సుమారు పదిరోజుల పాటు హ్యూగా నగరాన్ని గడగడలాడించిన మర్కటాన్ని ఈమధ్యనే నానా తిప్పలూ పడి వలపన్ని పట్టుకున్నారట. కోతి బారిన పడిన వారిలో ఒక వ్యక్తికి  కుడి కాలి మీద, కుడి చేతి మీద 20 కుట్లు పడ్డాయట.

సదరు వ్యక్తి సైకిల్ మీద ప్రయాణిస్తుండగా కోతి వెనుక నుంచి వచ్చి దాడి చేసిందట. 2500 మంది ఫైర్ సిబ్బంది, పోలీసులు, లెసైన్స్ ఉన్న వేటగాళ్లు... మొత్తం ఇంత మంది కలిసి ఆ కోతిని పట్టుకున్నారట. కోతిని వెంటాడటంలో ఒక ఇంటి యజమానికి 300,000 యన్నుల ఆస్తి నష్టం జరిగిందట. ఇంటి గోడలు, పై కప్పు బాగా దెబ్బ తిన్నాయట. ఇలా శారీరకంగా, ఆర్థికంగా కోతి వలన నష్టపోయిన వారికి జపాన్ ప్రభుత్వం పరిహారం చెల్లించింది. పరిహారం చెల్లించాలనే నిర్ణయాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అంగీకరించిందట.

ప్రస్తుతం నగరంలో శాంతి నెలకొని ఉన్నప్పటికీ, కోతులు వచ్చి, నష్టం కలిగించకుండా ఉండటం కోసం పోలీసులు నిరంతరం నగరాన్ని క ంటికి రెప్పలా కాపాడుతున్నారట.

మరిన్ని వార్తలు