ఆ భయం ఉండాలి... ఆ బెత్తం కావాలి!

4 Sep, 2016 23:38 IST|Sakshi
ఆ భయం ఉండాలి... ఆ బెత్తం కావాలి!

ఆచార్య దేవోభవ
మా వీధిలో ఒక మాస్టారు ఉండేవారు. పేరు శ్యామ్ సుందర్. అప్పటికి ఆయనకు ఓ నలభయ్యేళ్లుంటాయి. రోజూ సాయంత్రాలు ప్రైవేటు(ట్యూషన్) చెప్పేవారు. ఆయనకు కాస్త కాలు అవుకు (ఫిజికల్లీ ఛాలెంజ్డ్). గొడుగు కర్రను పోలి ఉండే ఒక చేతికర్ర సాయంతో నడిచేవారు. చెప్పిన పాఠం సరిగా అప్పజెప్పలేని పిల్లలు భయంతో వెనక్కి వెనక్కి వెళిపోతుంటే... ఆ కర్రనే తిరగేసి మెడకో, కాలికో వేసి తన దగ్గరగా లాక్కునేవారు. దగ్గరగా వెళ్లేసరికే సగం పాఠం గుర్తొచ్చేసేది. లేకపోతే ఒక్క తొడపాశం, మరుసటిరోజు పాఠం అప్పజెప్పేవరకు గుర్తుండేది. బడినుంచి ఇంటికొచ్చాక పుస్తకం ముట్టుకోని పిల్లల్ని ఆయన దగ్గర ప్రైవేటుకు పంపేవాళ్లు. స్కూల్లో మాట వినని అల్లరోళ్లని అక్కడికే పంపించమని తల్లిదండ్రులకు టీచర్లే రికమండ్ చేసేవాళ్లు. పిల్లల్ని చదివించడంలో... చదువును దారిలో పెట్టడంలో ఆయనకు అంత పేరు.

హైస్కూల్లో సుబ్బారావుగారు కూడా అంతే. హెడ్ మాస్టర్. టేబుల్ మీద ఎప్పుడూ రూళ్ల కర్ర, చెక్క స్కేలు మెరుస్తూ ఉండేవి. దెబ్బ బాగా తగలడానికి రోజూ మాస్టారు వాటికి ఏదో కొత్తరకం నూనె రాస్తున్నారని మేమంతా చెప్పుకునేవాళ్లం. మాస్టారు కంటే ముందు మేము వాటినే చూసేవాళ్లం. ఆయన చేతికి అవి ఎంత దగ్గరగా ఉంటే మేము ఆయనకు అంత దూరంగా నిలబడేవాళ్లం. సుబ్బారావు మాస్టారు ఉన్నారన్న ఉనికే స్కూల్ మొత్తాన్ని అటెన్షన్ లో ఉంచేది. దెబ్బ తినేంత తప్పు చేసినవాళ్లు, మెచ్చుకునేంత ఒప్పు చేసినవాళ్లు తప్ప ఆయనకు చేతికందే దూరంలో నిలబడిన విద్యార్థులు ఎవరూ లేరు. అలాగని బాగా కొట్టి భయపెట్టేవారా అంటే కాదు. ఆయన పిల్లల చేతిమీద కొట్టిన దానికంటే బల్లమీద కొట్టిందే ఎక్కువ. ఆ శబ్దం చాలు క్లాసురూము లైబ్రరీగా మారడానికి, చేతులు కట్టుకుని దూరంగా నిలబడిన విద్యార్థి కాళ్లు వణకడానికి.  ఇప్పుడు స్కూల్లోనే టీచరు. అప్పుడు ఊళ్లోనూ టీచరే. వాళ్లు తిరిగే వీధిలో ఆటల్లేవు.. వాళ్లు ఎక్కిన బస్సుల్లో అల్లరిలేదు.
       
కాలం మారింది. ఇప్పుడంతా ఫ్రెండ్లీ కల్చర్.  ఈ ఫ్రెండ్లీ కల్చర్ గురుశిష్యులు కలిసి సరదాలు పంచుకోడానికి ఎంత పనికొస్తుందో, విద్యార్థులకు విలువల్ని నేర్పడానికి ఉపాధ్యాయులకు అంతగా అడ్డొస్తోంది.  భయం, బెత్తం లేక ఫ్రెండ్లీ కల్చర్ కారణంగా ఏర్పడిన దగ్గరతనం వల్ల కొన్నిసార్లు వినకూడని విషయాల్లో ఉపాధ్యాయుల పేర్లు వినాల్సి వస్తోంది. మంచి చెడు తేడా తెలియని పసివాళ్లను, ఆడపిల్లల్ని తమ ఒడినుంచి బడికి పంపిస్తున్న కన్నవాళ్ల గుండెల్ని కుదిపేసే దారుణాలు చూడాల్సివస్తుంది. ఒక ఘోరం జరిగింది అనే బాధకంటే, అందుకు ఒక టీచర్ కారణం అనే వేదన సమాజాన్ని తొలిచేస్తుంది. ఆచార్యదేవోభవః అనడానికి నాలుక తడబడుతుంది.
  ఊళ్లో పిల్లలు ఎవరైనా తప్పుచేస్తే నువ్వు ఎవరి తాలూకు అని అడగడంకంటే ముందు ‘నీకు చదువు చెప్పింది ఎవర్రా?’ అనేవారు. అదీ సమాజంలో టీచర్ స్థానం. ఇప్పుడు అదే ప్రశ్న చెవుల్లో తిరుగుతోంది. టీచరంటే కాస్త భయం.. ఆ టేబుల్ మీద ఒక బెత్తం రేపటి సమాజానికి అవసరమనిపిస్తోంది.

బెత్తంతో ఒక్క దెబ్బ కొడితే మారిపోయే జీవితాలు... చట్టంతో, సంకెళ్లతో భయపెట్టినా పట్టనంత ఘోరంగా మారిపోయాయి. దేశ భవిష్యత్తే కాదు... మనిషిలో సరైన ఆలోచనా నిర్మాణం కూడా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. అదే సరైన సమాజాన్ని నిర్మిస్తుంది.
 అందుకోసం... ఉపాధ్యాయుల ముందు చేతులు కట్టుకునేంత భయం, ఆ భయాన్ని గుర్తుచేసే బెత్తం కావాల్సిందే! ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాక, సామాజిక బాధ్యతగా, కొన్ని తరాలను నడిపించే దిక్సూచిగా భావించి ప్రేమిస్తున్న ప్రతి గురువుకు వందనం.
 
- పూడి శ్రీనివాసరావు
 
 

మరిన్ని వార్తలు