అమెరికా...సౌదీ..హైదరాబాద్..

27 Jul, 2016 10:37 IST|Sakshi
అమెరికా...సౌదీ..హైదరాబాద్..

రచ్చబండ విన్నాం.  ఊరి పెద్దలు ఊరి విషయాల్లో అక్కడే న్యాయం చెబుతారు.  పట్టణాల్లో, నగరాల్లో ఉండేవాళ్లకి... కోర్టుల్లో న్యాయం దక్కుతుంది.  కానీ విదేశాల్లో...  న్యాయం మన పక్షం ఉండకపోవచ్చు! మన అక్కచెల్లెళ్లు  విదేశాల్లో న్యాయం కోసం  పడుతున్న అగచాట్లే..  ఈ ‘చట్ట’బండలు.  మూడు కథలు. మూడు దేశాలు. మూడు అడ్డుబండలు.

అక్కడ... అమెరికాలో!

‘అమ్మాయి బాగుంటుంది. ఫోటో చూశావుగా..! బాగా చదువుకుంది కూడా. అక్కడ ఉద్యోగం చేయగలదు. మంచి కుటుంబం! ఇంతకన్నా ఏం కావాలిరా? ఓకే చెప్పేయ్..’ అన్న అమ్మ మాటకు  ‘ఊ.. ఆ..’ అంటూ రెండు రోజులు సాగదీసి మూడో రోజు ఓకే అనేశాడు అమెరికాలో ఉన్న అబ్బాయి. పెళ్లయింది. పదిరోజుల్లో తను వెళ్లిపోయి నెలకు భార్యనూ రప్పించుకున్నాడు. అక్కడ అమ్మాయికీ ఉద్యోగం దొరికింది. సంపాదిస్తున్నారు. చక్కగా కాపురం చేసుకుంటున్నారు. కాలం గడుస్తోంది. అమ్మాయి అమ్మ అయింది.  కూతురు పుట్టింది. బిడ్డను చూసి మురిసిపోయారు. పాపకు ఆర్నెల్లు వచ్చాయి. సెలవు పెట్టిన అమ్మ మళ్లీ ఉద్యోగానికి వెళ్లడం మొదలుపెట్టింది. అమ్మానాన్న వంతుల వారీగా బిడ్డ ఆలనాపాలన చూస్తున్నారు. ఇంతలో బిడ్డలో ఏదో మార్పు! ఏంటో తెలియట్లేదు అమ్మకు. ఇండియాలో ఉన్న తల్లికి ఫోన్ చేసి అడిగేది. ‘ఏం కాదులే’ అని భరోసా ఇచ్చింది తల్లి. నిజమే కాబోలు అనుకుంది అమెరికాలో అమ్మ. పాపకు యేడాది వయసు వచ్చింది. ఒకరోజు.. తను ఆఫీస్ నుంచి రావడం.. భర్త ఆఫీస్‌కి వెళ్లిపోవడం ఒక్కసారే జరిగాయి. ఇంట్లోకి వెళ్లీవెళ్లగానే బిడ్డను చూసుకుంది. గుక్కపెట్టి ఏడుస్తోంది.

బిడ్డ రెండు కాళ్ల మధ్య రక్తం! ఏమీ అర్థం కాలేదు ఆ తల్లికి. శుభ్రం చేసి ఎత్తుకొని పాలుపట్టింది. బిడ్డ నిద్ర పోయింది. భర్తకు ఫోన్ చేసింది. బిడ్డ విషయం చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దామని అడిగింది. ‘అర్జెంట్ మీటింగ్‌లో ఉన్నా. వచ్చాక తీసుకెళదాములే’ అన్నాడు. ఆమె మళ్లీ పనిలో పడిపోయింది. తెల్లారి మామూలుగానే ఉంది బిడ్డ. ఆ తర్వాత కూడా అనారోగ్యం కనిపించకపోవడంతో డాక్టర్ దగ్గరకి వెళ్లాలన్న విషయాన్ని వాయిదా వేసేసుకుంది. తర్వాత పని ఒత్తిడిలో పడి మర్చేపోయింది. ఆర్నెల్లు గడిచాయి. పాపకు మాటలు రావడమూ మొదలైంది. శారీరకంగా పాపలో ఎలాంటి తేడా కనిపించకపోయినా మానసికంగా చాలా తేడా కనిపిస్తోంది ఆ తల్లికి. తండ్రిని చూస్తే భయపడిపోయేది. తండ్రి ముద్దు చేస్తుంటే వణికిపోయేది. అర్థమయ్యేది కాదు అమ్మకు. ఓరోజు ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అమ్మకు మళ్లీ రక్తంతో కనిపించింది పాప. అంతేకాదు. సొమ్మసిల్లి పడిపోయి ఉంది. భయంతో కంపించింది తల్లి.  కూతురు లేచాక బుజ్జగించి అడిగింది ఏమైందని. ‘డాడీ.. నన్ను ఎక్కడెక్కడో ముద్దు పెట్టుకుంటున్నాడు..’ అంటూ తండ్రి చేష్టలన్నిటినీ వచ్చీరాని మాటలతో చెప్పింది. అది విన్న తల్లి చేష్టలుడిగిపోయింది. రాత్రికిరాత్రే భర్త ఆఫీస్ నుంచి వచ్చేకంటే ముందే ఇల్లు వదిలి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. బిడ్డను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపారు తప్ప ఏం జరిగిందో పరీక్ష చేయలేదు.

ఇంట్లో భార్య లేకపోయే సరికి ఫోన్ చేశాడు. భార్య రియాక్షన్‌తో విషయం అర్థమైంది ఆయనకు. వెంటనే లాయర్ నుంచి విడాకుల నోటీస్ పంపాడు భార్యకు. దానికి జవాబుగా కోర్టుకు అటెండ్ అయింది భార్య. భర్త తన కూతురు మీద చేస్తున్న అఘాయిత్యాన్ని మొరపెట్టుకుంటుంది. వైద్య పరీక్షల కోసం పాపను  డాక్టర్ దగ్గరకు పంపింది. భౌతిక పరీక్షల్లో ఏమీ లేదనే రిపోర్ట్ వచ్చింది. మానసిక వైద్యుల దగ్గరకూ పంపింది. పాప మీద అఘాయిత్యం జరుగుతోంది అందుకే పాప ప్రవర్తనలో తేడా ఉందని తేల్చారు వైద్యులు. అయితే అమెరికా కోర్టు భౌతిక పరీక్షా ఫలితానికే విలువనిచ్చి మానసిక వైద్య పరీక్షల ఫలితాలను కొట్టిపారేసింది. విడాకులు మంజూరు చేసింది. బిడ్డ అమెరికాలోనే పుట్టింది కాబట్టి అమెరికా పౌరురాలని ఆ పిల్ల సంరక్షణాబాధ్యతను అప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్న తండ్రికి అప్పజెప్పింది కోర్టు. ఆ తీర్పుకి భయపడ్డ తల్లి ఆ రాత్రికి రాత్రే బిడ్డను తీసుకొని ఇండియా వచ్చేసింది.

ఇక్కడ... విజయవాడలో!

వచ్చాక కష్టాలు కడతేర లేదు. నా బిడ్డను కిడ్నాప్ చేసిందని అక్కడ కేస్ పెట్టాడు. అక్కడి కోర్టు ఇక్కడున్న భార్యకు ఉత్తర్వులు పంపింది బిడ్డను తండ్రికి అప్పజెప్పాలని. అప్పజెప్పకుండా ఉండడానికి ఇక్కడి నుంచి ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడింది ఆ తల్లి. కానీ లాభం లేకపోయింది. అక్కడి నుంచి కాన్స్‌లేటర్స్‌ని పంపింది అమెరికన్ కోర్టు... బిడ్డను తండ్రికి అప్పజెప్పాలంటూ. ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. ప్రస్తుతం పాపకు నాలుగన్నరేళ్లు. ఆ రాక్షసుడు తన బిడ్డను ఎత్తుకుపోకుండా ఉండడానికి ఇక్కడి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. మహిళా సంఘాలను కలసింది. కానీ లాభం లేకపోయింది. పాప అమెరికన్ సిటిజన్.. అందుకని పాప విషయంలో అమెరికన్ కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించే వీలు లేదు. మన కోర్టు తీర్పులకు అక్కడ విలువ లేదు అని చెప్పారు. హతాశురాలైంది అమ్మ. అయినా పోరాటం ఆపలేదు.

అక్కడ.. సౌదీలో!

‘పిల్లగాడు  సౌదీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. బాగా సంపాదిస్తున్నాడు. ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది?’ చెప్పాడు మధ్యవర్తి. ఆ తండ్రికి నిజమనిపించింది. అందుకే కూతురి అభిప్రాయం కూడా అడగకుండా ఆ సంబంధాన్ని ఖాయం చేశాడు. షాదీ తర్వాత వెంటనే భార్యను సౌదీకి తీసుకెళ్లాడు. నెల రోజులు ప్రశాంతం. నెమ్మది నెమ్మదిగా అసలు స్వభావం చూపించసాగాడు పెళ్లి కొడుకు. అది రోజురోజుకీ ఎక్కువైంది కానీ తక్కువవలేదు. నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. కాబట్టి ఎంత సహనంతో ఉండాలో తల్లి చెప్పి మరీ సౌదీకి సాగనంపింది. కాబట్టి తల్లితండ్రి ఎప్పుడూ ఫోన్ చేసినా అంతా బాగున్నట్టే చెప్పేది. ఈలోపు గర్భం దాల్చింది. బిడ్డ కూడా పుట్టింది. పాప పుట్టాక భర్త హింస మరింత ఎక్కువైంది. నరకం చూపించసాగాడు. రోజు ఒక గండంగా గడవసాగింది. భరించలేక తల్లికి చెప్పింది. సర్దుకుపొమ్మనే జవాబు వచ్చింది. సర్దుకుపోయింది ఆత్మహత్య చేసుకొని. అక్కడ ఆత్మహత్య నేరం. దానికి దారితీసిన పరిస్థితుల మీద విచారణ జరపరు.  అది ఆత్మహత్యా, హత్యా అన్న విషయం మీదే విచారణ. ఆత్మహత్య అని తేలింది. భర్త నిర్దోషిగా మిగిలాడు. మూణ్ణెల్లలో హాయిగా మళ్లీ పెళ్లి.

ఇక్కడ హైదరాబాద్‌లో!

బిడ్డను పోగొట్టున్న తల్లిదండ్రులు బాధతో కేసు పెట్టారు. కూతురు అత్తామామలను అరెస్ట్ చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేవని వదిలిపెట్టారు. అక్కడి కోర్టు తీర్పు సవాలు చేసే వీలు ఇక్కడ లేదు. ఇక్కడి న్యాయ పోరాటం అక్కడ చెల్లుబాటు కాదు అని చెప్పారు న్యాయ నిపుణులు. నిస్సహాయులుగా మిగిలిపోయారు ఆ తల్లిదండ్రులు.

అక్కడ... యూకేలో!

మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరింది ఆ జంటకు. ఇద్దరూ ఇంజనీర్లే. అబ్బాయికి యూకేలో ఉద్యోగం. అక్కడ పర్మెనెంట్ రెసిడెంట్ కూడా. అమ్మాయికి నచ్చాడు. అంగరంగ వైభవంగా పెళ్లయింది. మూడు నెలల్లోనే యూకేలో కాపురం పెట్టారు. ఆర్నెల్లకే అమ్మాయి పిచ్చిదని నిరూపించి అక్కడి కోర్టు ద్వారా భార్యకు విడాకులిచ్చి బలవంతంగా ఇండియాకు పంపించాడు.

ఇక్కడ... అనంతపురంలో!

ఇక్కడ పెళ్లికి అక్కడి కోర్టు ఎలా విడాకులిస్తుందని అమ్మాయి ప్రశ్న. దీనికి సమాధానం మన న్యాయస్థానాలు, ప్రభుత్వాల దగ్గర లేవు.

వందలు... వేల కేసులు!!

ఈ మూడు కేసులే కాదు ఇండియాలో ఇలాంటి ఎన్‌ఆర్‌ఐ మ్యారేజ్ కేసులు కొన్ని వందల్లో.. వేలల్లో ఉన్నాయి. అన్యాయమై పోయిన ఆడపిల్లలు న్యాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అయితే మరీ ఘోరంగా ఉంది. పెళ్లయి అక్కడికి వెళ్లాక గర్భం దాల్చిన భార్యకు అక్కడ లింగ నిర్థారణ పరీక్ష చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇండియాకు వచ్చి అబార్షన్ చేయించి తీసుకెళ్తున్నారు. వ్యతిరేకించిన భార్యను ఇక్కడే వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా ఇంకో పెళ్లి చేసుకొని ఫ్లయిట్ ఎక్కేస్తున్నారు.  ఇందులో మన తెలుగు రాష్ట్రాలూ ఏం తక్కువ తినలేదు. పంజాబ్, హర్యానా తర్వాత మూడో స్థానంలో మనమే ఉన్నాం.

ఈ సంగతి అలా ఉంచితే..

ముందు చెప్పుకున్న కేస్‌స్టడీస్‌కి వస్తే  విడాకులు, సెక్సువల్ అబ్యూజ్, భ్రూణ హత్యలు.. విషయం ఏదైనా.. నేరం ఏదైనా ఇక్కడి చట్టాలకు, విదేశీ చట్టాలకు చాలా తేడా ఉంది. అందుకే మన అమ్మాయిలు అలా అన్యాయమైపోయారు. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. రోజురోజుకీ ఈ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇందుకు పరిష్కారంఆ మన చట్టాల తీర్పునీ పరిగణనలోకి తీసుకొని విదేశీ కోర్టులు తమ తీర్పును ఇవ్వాలని, అందుకు మన దేశం విదేశాలతో ఓ ఒప్పందానికి రావాలని తెలుగు రాష్ట్రాల మహిళా కమిషన్, మహిళా సంఘాలు, లాయర్లు, మహిళా సమస్యల మీద పనిచేసే స్వచ్చంద సంస్థలూ... సదస్సులు నిర్వహిస్తున్నాయి.  ఈ విషయంలో ముందుగా అమ్మాయిలకు, వాళ్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పెళ్లికి ముందు మ్యారిటల్ కౌన్సిలింగ్‌ని తప్పనిసరి చేయాలని సామాజిక కార్యకర్త దేవి,  మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు