కార్యసాధన అంటే అది..!

25 Oct, 2017 00:38 IST|Sakshi

ఆత్మీయం

కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికీ వచ్చాయి. అవి చూసి మనం విచలితులమయినట్టుగానే రాముడు కూడా ఓ క్షణంపాటు విచలితుడయ్యేవాడు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయిన సందర్భంలో మహర్షి అంటారు–’’ శోకోనాశయతే ౖధైర్యం, శోకో నాశయతేతం, శోకోనాశయతే సర్వం, నాస్తిశోక సమోరిపు’’... అంటే శత్రువులందరిలోకి పెద్ద శత్రువు శోకమే. ఎప్పుౖడనా సరే, నేనిది సాధించలేకపోయానని దుఃఖానికి వపోయాడా ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే– ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు. నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఏ పని చేయాలన్నా, దానిలో సఫలతపొందాలన్నా, నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించ కూడదు.

అందుకే మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు. అదేవిధంగా కార్యసాధకులు ఎలా ఉండాలంటే, అనుక్షణం తమ కార్యసాధన మీదనే దృష్టి పెట్టాలి. నిద్రాహారమైథునాలు మరచిపోవాలి. ఈ పని పూర్తి చేసి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే, అసలు విషయం కాస్తా కుంటుపడుతుంది. సీతాన్వేషణకోసం సముద్రాన్ని లంఘిస్తున్న హనుమకు సేద తీర్చడం కోసం మైనాకుడు సాగర గర్భం నుంచి తల బయట పెట్టాడు. తన మీద కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని కోరాడు. అప్పుడు హనుమ, అవకాశం వచ్చింది కదా అని, అదే పనిగా విశ్రాంతి తీసుకోలేదు. తన పాదాన్ని కాసేపు మైనాకుడి మీద మోపాడు. చేతితో భుజాన్ని తట్టాడు. ప్రయాణాన్ని కొనసాగించాడు. కార్యసాధన అంటే అది. కార్యసాధకులు హనుమను చూసి నేర్చుకోవాలి.

మరిన్ని వార్తలు