సినీ నటుడు రంగనాథ్ మృతికి నివాళిగా...

21 Dec, 2015 22:41 IST|Sakshi
సినీ నటుడు రంగనాథ్ మృతికి నివాళిగా...

ఎలిజీ
ఎంత బాగుండు!

 
నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడే  ద్వేషం పది తలల రావణుడిలా భయపెడుతుంది. నీకు నువ్వే బరువనుకున్నప్పుడు ఏ ఓదార్పు ఊయల నిన్ను మోస్తుంది చెప్పు? అన్నీ నువ్వనుకున్నట్టే జరిగితే దాన్నేమంటారో తెలీదు కానీ, ఖచ్చితంగా జీవితం అనైతే అనరు. తప్పదు... అవమానాలుండొచ్చు... అవహేళనలుండొచ్చు నిరాశలుండొచ్చు... సహాయ నిరాకరణలూ ఉండొచ్చు తెగిన తలకాయాలా... నీ గుండె గుమ్మానికి ఒంటరితనం వేలాడుతూ ఉండొచ్చు అంతమాత్రానికే మరణంతో మంతనాలా? బలవంతంగా చచ్చిపోవాలనుకున్నావంటే... ఇంత కాలం బలహీనంగా బతికినట్టా? నూకలు చెల్లిపోయాక ఎలాగూ ఎవరికి వారు యమునా తీరే
 నువ్వు... నీ తరువాత నేను... వరుసలో చాలామందే..! ఎవరు మాత్రం ఉండిపోతాం? ఏం బావుకుంటాం?
 
గోడలమీద రాతల్లా జ్ఞాపకాలు తప్ప. కాలిపోయిన కట్టెలో మనిషి జాడ వెతకలేం బతికున్నోళ్ల కన్నీటి ధారకి ఆనకట్టలూ కట్టలేం నువ్వు పోవడమంటే... నువ్వొక్కడివే పోవడం కాదు నీ చుట్టూ అల్లుకున్న అనుబంధాల దారాల్ని బలవంతంగా తెంపేసుకుపోవడమే! చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి అందులో కాస్తై బతకడానికి వాడుకుని ఉంటే ఎంత బాగుండు!
 
- భాస్కరభట్ల


 

మరిన్ని వార్తలు