ముద్దు పవిత్రం... ప్రచారమే అసభ్యం

25 Nov, 2014 23:13 IST|Sakshi
ముద్దు పవిత్రం... ప్రచారమే అసభ్యం

‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమంపై చర్చలు, వాదోపవాదాలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. కోర్టులు ఇలాంటి చర్యలను సమర్థించినప్పటికీ, నైతిక విలువల పరిరక్షక సేనలు ఏ మాత్రం రాజీ పడడం లేదు. బహిరంగ చుంబనాలను ఇవి ఖండిస్తున్నాయి. వాటిని నివారించే, నిరోధించే ప్రయత్నాలను చేస్తున్నాయి. సేనలతో ఇప్పుడు ఉదారవాదులు, స్త్రీవాదులు సైతం చేతులు కలిపారు. సాధారణంగా మానవ కమిషన్‌ల మీద, ఉమెన్ కమిషన్‌ల మీద మనకో అభిప్రాయం ఉంటుంది. మనుషులు ఎంత చెడ్డా, వారి హక్కులకు భంగం కలిగించే అధికారం వ్యక్తులకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఉండకూడదని ఈ కమిషన్లు వాదిస్తాయని అనుకుంటాం. అయితే ఇప్పుడీ అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. తాజాగా కర్ణాటక మహిళా కమిషన్ ‘కిస్ ఆఫ్ లవ్’ను ‘అనాగరకమైన, ఆటవికమైన’ చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ప్రదర్శనలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విషయమై కర్ణాటక మహిళా కమిషన్ ైచె ర్ పర్సన్ మంజులా మానస ఆ రాష్ట్ర హోమ్ మంత్రి కె.జె.జార్జికి ఒక లేఖ రాశారు. అందులో ఆమె ‘కిస్ ఆఫ్ లవ్’ ప్రదర్శనలను, వాటి నిర్వాహకులను విమర్శించడానికి ఎలాంటి తడబాట్లూ ప్రదర్శించలేదు. నిక్కచ్చిగా, నిస్సంకోచంగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ‘‘కొన్ని ప్రవర్తనలు మనుషులకు, జంతువులకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తాయి. ఆ వ్యత్యాసాలను మనుషులు పాటించాలి. నైతిక విలువల పరిరక్షకులకు వ్యతిరేకంగా వీధులలో బహిరంగంగా వీళ్లు చేస్తున్న ముద్దుల ప్రదర్శన అర్థరహితమైనది. ఎంతో పవిత్రమైన ముద్దును వీళ్లు బజారుకీడుస్తున్నారు. ఇదొక అసభ్యకరమైన ప్రచార ధోరణి’’ అని మంజులా మానస ఆ లేఖలో రాశారు. ‘‘ఈ ధోరణిని కనుక నిరోధించకపోతే సభ్య సమాజపు పునాదులే కదిలిపోతాయి’’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంజుల లేఖను హోమ్‌మంత్రి జార్జి, బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డికి పంపుతూనే, రాజ్యాంగం ప్రకారం సంఘ విద్రోహం కాని సంఘటనలను నిషేధించే హక్కు ప్రభుత్వానికి లేదని అంటున్నారు. మంజులా మానస ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
 
ఏమిటీ ‘కిస్ ఆఫ్ లవ్’?

ఇదొక నిరసన ప్రదర్శన. ‘మోరల్ పోలీసింగ్’కి వ్యతిరేకంగా 2014 నవంబర్ 2న కొచ్చి (కేరళ)లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ప్రారంభమయింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలకు ఒక ఉద్యమంలా వ్యాపించింది. సామాజిక విలువల పరిరక్షకులమని చెప్పుకుంటున్న కొన్ని మత సంస్థలు, రాజకీయ పక్షాలు యువతీయువకుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా తమపై దౌర్జన్యానికీ, దాడులకు పాల్పడడాన్నే ‘మోరల్ పోలీసింగ్’గా ప్రదర్శనకారులు వ్యవహరిస్తున్నారు. మొదట ఫేస్ బుక్ ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమం ఊపిరి పోసుకుంది. మోరల్ పోలీసింగ్‌పై తమ నిరసనను వ్యక్తం చేయడానికి యువతీయువకులు ఒకర్నొకరు బహిరంగంగా ముద్దుపెట్టుకోవాలని ఫేస్‌బుక్‌లో అందిన పిలుపునకు దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే లక్షా 20 వేలకు పైగా ‘లైక్’లు వచ్చాయి! తర్వాతి సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాలలో కిస్ ఆఫ్ లవ్ ప్రదర్శనలు జరిగాయి. వీటిపై ఎప్పటిలాగే భారతీయ జనతా యువమోర్చా, విశ్వహిందూ పరిషత్, శివసేన, ఎస్.డి.పి.ఐ. (సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా), భజరంగ దళ్, హిందూసేన వంటి పార్టీలు విరుచుకు పడ్డాయి. కొసమెరుపు ఏమిటంటే, బహిరంగ ప్రదేశాలలో ముద్దులు పెట్టుకోవడం అసభ్యత కాదని, అందుచేత ఈ చర్యలను నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం!
 

మరిన్ని వార్తలు