పఠనం వల్ల ప్రయోజనాలు ఎన్నో!

30 Jul, 2014 23:25 IST|Sakshi
పఠనం వల్ల ప్రయోజనాలు ఎన్నో!

అధ్యయనం
 
ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించడం లేదు. పుస్తకం స్థానంలో సెల్‌ఫోన్ హస్తభూషణమైంది. ‘క్లాసు పుస్తకాలు చదవడానికి టైమ్ సరిపోవడం లేదు. ఇక సాహిత్య పుస్తకాలు కూడానా’ అనేది ఒక సాకు మాత్రమే. మనసుంటే మార్గం ఉంటుంది. చదవాలని కోరిక ఉండాలే గానీ సమయం తప్పకుండా దొరుకుతుంది.
 
పుస్తకాలు చదవడం అనేది సాహిత్యపరిచయానికో, కాలక్షేపానికో కాదు...పఠన ప్రభావం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నిజానికి బాల్యంలోనే చదవడం మొదలుపెట్టాలి. వీలుకానప్పుడు టీనేజ్‌లో తప్పనిసరిగా పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి. బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్(ఎన్‌ఎల్‌టి) తాజా అధ్యయనం మరోసారి పుస్తక పఠన విలువను ప్రపంచానికి చాటింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న టీనేజర్లకు, లేని టీనేజర్లకు మధ్య వ్యత్యాసాలను అధ్యయనం చేశారు. పుస్తకాలు చదవని వారితే పోల్చితే, చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు, రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని ఎన్‌ఎల్‌టి అధ్యయనం చెబుతుంది.
 
 పుస్తక పఠనం  వల్ల ఉపయోగం ఏమిటి?

టీనేజ్‌లో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది...లక్ష్యాన్ని నిర్దారించుకునే స్పృహ ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకొనే పట్టుదల వస్తుంది.
 
 సామాజిక సమస్యలపై అవగాహన, సామాజిక స్పృహ ఏర్పడతాయి.
 
 పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాను కనుక్కోగలరు.
 
 పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది.
 
 స్వీయవిశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల తప్పులను, లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు.
   
 చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది.
 
అమ్మాయిలే ఫస్ట్...
పాశ్చాత్యదేశాలలో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు. దీనివల్ల అబ్బాయి కంటే అమ్మాయిలలోనే సానుకూల దృక్పథం ఎక్కువగా  కనిపిస్తుంది.
 

మరిన్ని వార్తలు