బైబిలులో దేవుడు గీసిందే తిన్నని గీత!

25 Jun, 2017 00:02 IST|Sakshi
బైబిలులో దేవుడు గీసిందే తిన్నని గీత!

గొప్ప విశ్వాసిగా, మహా రచయితగా మారకముందు పి.ఎస్‌. లూయిస్‌ పరమ నాస్తికుడు. లోకంలో జరిగే అన్యాయాలు, దౌర్జన్యాలను చూసి దేవుడనేవాడుంటే లోకంలో ఇంత అధ్వానంగా, ‘వంకర’గా ఎందుకుంటుందనుకొని తిరుగుబాటు చేశాడు. కాని వేలెత్తి చూపేవన్నీ వంకరగీతలంటున్నానంటే ఎక్కడో ‘తిన్నని గీత’ కూడా ఉండాలి కదా! అనిపించి అన్వేషిస్తే బైబిలులో దేవుడు గీసిందే ‘తిన్నని గీత’ అని తెలుసుకున్నానని ఆయనొకసారి వివరించాడు.

పాత నిబంధన, కొత్త నిబంధనగా రెండు భాగాలున్న బైబిలును లోకజ్ఞానంతో అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఈ రెండు భాగాల్లోని ‘దైవప్రత్యక్షత’ను వివరించ పదాలు మనిషి కనిపెట్టినవైనా, ఆ తత్వం, భావం మాత్రం పూర్తిగా పారలౌకికం, దైవికం. అందుకే పీహెచ్‌డీలున్న మేధావులనుకునేవారు వారికి అర్థం కాని అత్యంత సూక్ష్మమైన, సునిశితమైన బైబిలులోని దైవికాంశాలను పామరులు, అర్థపామరులైనవారు బోధించడం చూస్తాం. యేసుక్రీస్తు ఆరోహణం, పునరాగమనం మధ్యకాలాన్ని, కృపాయుగం లేక క్షమాయుగంగా దేవుడు ప్రకటించి తన క్షమ, ప్రేమతత్వాన్ని రుజువు చేసుకున్నాడు. క్రమశిక్షణను నూరిపోయాలనుకున్న తండ్రి ప్రేమ కుమారుణ్ణి దండిస్తుంది. ప్రేమతో క్షమించి ముద్దాడుతుంది కూడా! ఈ తత్వాలన్నింటినీ సమగ్రంగా వివరించే ‘బైబిలు గ్రంథాన్ని మేధస్సుతో కాదు, మోకాళ్ల మీదుండి చదవాలి.

ఈ అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపయు, సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అని వివరించాడు (యోహాను 1:17). గది ఎంత అపరిశుభ్రంగా ఉందో చూపించే  కరెంటు బల్బులాంటిదే ధర్మశాస్త్రం. కాని అది పాపాన్ని, అపరిశుద్ధతను ప్రక్షాళనం చేయలేదు. అందుకు వ్యాక్యూమ్‌ క్లీనర్‌లాంటి దైవ క్షమాగుణం, ప్రేమతత్వం కావాలి. అవి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాయి. లోకాన్ని ప్రక్షాళనం చేస్తున్నాయి.

దండించే శక్తి గల వానికే, క్షమించడానికి అధికారం ఉంటుంది. దేవుని నుండి నానాటికీ దూరమవుతున్న మానవాళి తిరిగి దేవునితో యేసుక్రీస్తు ద్వారా అనుసంధానం కావడానికి దేవుడే ప్రసాదించిన ఒక సువర్ణావకాశం ఈ ‘కృపాయుగం’. గాడి తప్పిన లోకంలో సాగుతున్న అరాచకాలు, అమానవీయత ఈ అంతటికీ పరిష్కారం దేవుని క్షమాగుణం, ప్రేమతత్వంలోనే ఉందనడానికి వేరే రుజువులు కావాలా? – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు