మరణానికి జీవితమే లేదు!

18 Sep, 2014 23:39 IST|Sakshi
మరణానికి జీవితమే లేదు!

తత్వ చింతన
 
ఓ వ్యవసాయ భూమి సమీపంలో నిల్చున్న ఖలీల్ జిబ్రాన్ దృష్టి అక్కడ ఉన్న ఓ గడ్డిబొమ్మపై పడింది. ఆ బొమ్మ వంకే  ఆయన చూస్తూ నిల్చున్నారు.
 దానిని చూసి జిబ్రాన్ ‘‘నువ్వు ఇలా రోజుల తరబడి ఇక్కడ నిల్చున్నావు. నీకు విసుగేయడం లేదా?’’ అని అడిగాడు.
 దానికి ఆ బొమ్మ ఇలా చెప్పింది -
 ‘‘నాకే విసుగూ లేదు. ఇటుగా వచ్చే పక్షుల్ని భయపెట్టడంలో పొందుతున్న ఆనందం ముందు మరెందులోనూ దొరకడం లేదనుకో. పక్షులు నన్ను చూసి భయపడి ఎగిరిపోయే తీరుని మాటల్లో చెప్పలేను. కనుక కాలం ఎలా గడిచిపోతోందో తెలియనే తెలీదు’’ అని.
 ఆ మాటలతో జిబ్రాన్ ఆలోచించాడు.
 కాస్సేపు తర్వాత ఆయన ‘‘నిజమే. ఈ ఆనందాన్ని నేనూ అనుభవించాను. మనల్ని చూసి ఇతరులు భయపడేటప్పుడు కలిగే ఆనందాన్ని మరి దేనితోనూ పోల్చలేను’’ అని అనగా బొమ్మ ‘‘నిజం. నాలోపల గడ్డి, ఒకింత మట్టి తప్ప మరేమీ లేదు. నాలాగే లోపల గడ్డి, మట్టి నింపిన వాళ్ళు తప్పకుండా ఆనందం అనుభవిస్తారు’’ అని చాలా మామూలుగా చెప్పింది.
 జిబ్రాన్ ఓ చోట రాసుకున్న ఈ మాటలు మన జీవితాన్ని ఫొటో తీసి చూపుతోంది. దాన్ని చూసి జాలి పడి ఒకడు అనుకుంటాడు... లోపల గడ్డి, మట్టి మినహా మరేదీ లేని వికృతరూపం ఈ గడ్డిబొమ్మ. ఎటూ కదల్లేదు. అయినా అది పక్షులన్నీ తనను చూసి భయపడి దరిదాపుల్లోకి రావడం మానేశాయని చెప్పుకుంటోంది. ఎలా సాధ్యం?’’ అని.
 మనుషుల్లోనూ  చాలా మందికి లోపల ఏమీ లేదు. జ్ఞానం లేని వొట్టి రూపాలు. ఆ గడ్డిబొమ్మ లోపల గడ్డి, మట్టి ఉన్నట్టు మనలో ఎముకలు, రక్తం ఉన్నాయి. కనుక జ్ఞానమున్న వారెవరైనా అజ్ఞానులైన వారిని చూసి పాపం వారిలో ఏమీ లేదు కదా అని జాలిపడతారు.
 కానీ అజ్ఞానులు ఆ మాటకు ఒప్పుకోరు. ‘‘ఎవరన్నారు?  వాడికన్నా  నేను గొప్పోడిని...వీడి కన్నా పెద్దవాడిని. ఫలానా వాడిని ఓమారు ఫలానా విషయంలో ఓడించాను అని చంకలు గుద్దుకుని తెగ ఆనంద పడతారు. కానీ ఆ గడ్డి బొమ్మ ఒకే చోట ఎటూ కదలక ఉంది. మనం ప్రాణమున్నా కదిలే శక్తి ఉన్నా జీవితంలో చలనం లేకుండా ఉన్నాం.
 నిజానికి మనల్ని మనం ఆ బొమ్మతో కాకుండా పక్షులతో పోల్చుకోవాలి. గడ్డిబొమ్మ కనీసం పక్షుల్ని బెదరగొట్టి పంటపొలాలను కాపాడుతోంది. మనిషి తన లోపల ఏమీ లేదనే వాస్తవాన్ని తెలుసుకుని కూడా ఎదుటి వారి వద్ద అన్నీ ఉన్నట్టు తెలిసినట్టు డాంబికాలు పోతాడు. విర్రవీగుతాడు. ఆ మాయలోనే బతుకుతాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అలాగే ఒక రోజు అదృశ్యమైపోతాడు.
 జీవితానికి ఎప్పుడూ మరణం లేదు. మరణానికి ఎప్పుడూ జీవితం లేదు. జీవితాన్ని తెలుసుకున్న వారే మరణమే జీవితానికి ముగింపు అని అనుకుంటున్నారు.
 
- యామిజాల జగదీశ్
 

మరిన్ని వార్తలు