అనుమానం పెనుభూతం

4 Jan, 2016 23:41 IST|Sakshi
అనుమానం పెనుభూతం

చేతనబడి
 
అన్నదమ్ముల మధ్యలో అనుమానపు మంత్రం వేశారు.
ధూపం వేసి పెనుభూతం చేశారు.
మూఢనమ్మకాలతో మైండ్ గేమ్ ఆడుకున్నారు.
చేతివాటంతో ఆస్తులు హరించారు.

 
అది సికింద్రాబాద్‌లో ఓ గల్లీ. ఓ ఇంటి ముందు జనం బారులు తీరి ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన, ఆశాభావం, మరికొంత అస్థిమితం కనిపిస్తున్నాయి. వారిలో యాదగిరి, అతడి భార్య సావిత్రి దంపతులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. విపరీతంగా భయపడుతున్న యాదగిరికి ధైర్యం చెబుతోంది సావిత్రి. ఇంతలో వారి వంతు రానే వచ్చింది. లోపలికి వెళ్లారు. చిన్న పిల్లలు భయపడేటట్లు ఉంది అక్కడి వాతావరణం. పసుపు కుంకుమల రాశులు, నిమ్మకాయల గంప, తాయెత్తుల పళ్లెం, ఓ త్రిశూలం, వాటి ఎదురుగా ఓ మంత్రగత్తె. జుట్టు విరబోసుకుని, కళ్లు విప్పార్చి భయానకంగా ఉంది.

యాదగిరి దంపతులు వెళ్లి కూర్చోగానే అతడిని నఖశిఖ పర్యంతం చూసి, వేళ్లను లెక్కించింది మంత్రగత్తె.. అతడి ముఖంలోకి పరీక్షగా చూసింది. గాల్లోకి చూస్తూ అతీంద్రియ శక్తితోనో మంతనాలు జరిపినట్లు హావభావాలు పలికించి... నింపాదిగా... ‘నీకెవరో చేతబడి చేశారు, అందుకే ఈ అనారోగ్యం’ అన్నది. అంతే... భార్యాభర్తలిద్దరూ ‘మనం అనుకున్నది నిజమే’ అన్నట్లు ముఖముఖాలు చూసుకున్నారు. సనైన చోటకే వచ్చాం, ఇక కష్టం తీరినట్లే అనుకుని సమాధానపడ్డారు. వారి కష్టం తీరాలంటే చేతబడికి విరుగుడు పూజ చేయాలి. అందుకు పది నుంచి ఇరవై వేలవుతుంది- మంత్రగత్తె మాటల్ని మంత్రముగ్ధులై విన్నారా దంపతులు. మంత్రగత్తె మాటల్ని అంతగా నమ్మిన యాదగిరి నేపథ్యం ఏమిటంటే...

అన్నదమ్ముల అనుబంధం
అతడిది నల్గొండ జిల్లా, రామన్నపేట మండలంలో నెర్నెమల గ్రామం. అత్యంత సామాన్యమైన ఊరు. ఎవరైనా ఏ క్లర్కుగానో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే వారికి కలెక్టర్‌కి లభించినత గౌరవాలు. ఊళ్లో ఎవరికి సర్కారాఫీసుకెళ్లాల్సిన అవసరం వచ్చినా అందరికీ కనిపించేది ఆ ఉద్యోగి మాత్రమే. అలాంటి నెర్నెమలలో నలుగురు అన్నదమ్ముల్లో రెండవ వాడు యాదగిరి. పెద్దన్న వ్యవసాయం చేస్తాడు. యాదగిరికి వ్యవసాయంతోపాటు గొర్రెల పెంపకం కూడా ఉంది. మూడవ సోదరుడు నర్సింహ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. ఇక చిన్న తమ్ముడు సేద్యం, పాల వ్యాపారంలో బాగానే రాణిస్తున్నాడు. ఎవరి ఉపాధి వారిది, ఎవరి కుటుంబం వారిది. విడివిడిగా జీవిస్తూ కలివిడిగా ఆత్మీయతలు పంచుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐకమత్యానికి మారుపేరు వారే అన్నట్లుండేవి నాలుగు కుటుంబాలు ఒకప్పుడు.

మరి ఇప్పుడేమైంది?
యాదగిరికి స్వల్ప అనారోగ్యం. కాళ్లునొప్పులు, నీరసం తప్ప మరే సూచనలూ లేవు. ఈ లక్షణాలకు డాక్టరు దగ్గరకు వెళ్లాలనిపించలేదు వారెవ్వరికీ. తెలిసిన మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లాడు నర్సింహ. ఎన్ని వారాలు గడిచినా నీరసం తగ్గడం లేదు. ఆ తమ్ముడే ఏదో కీడు చేయించి తనకు తెలిసిన మంత్రగాడి దగ్గరకే తీసుకెళ్తున్నాడని సావిత్రి బంధువుల అనుమానం. మరో మంత్రగాని దగ్గరకు వెళ్తే తప్ప జబ్బు నయం కాదన్నారు. పుట్టింటి బంధువుల సూచన శిరోధార్యం అయింది సావిత్రికి. యాదగిరికి కూడా తమ్ముడి మీద అనుమానం వచ్చింది. అనుమానపుబీటలు ఆత్మీయతను దూరం చేశాయి. నర్మింహకు తెలియని చోట వైద్యం చేయించుకోవాలని సికింద్రాబాద్ చేరారా దంపతులు.

పూజలు, తవ్వకాలు!
ఇద్దరు అనుచరులతో టాటా సుమో ఎక్కి నెర్నెమల దారి పట్టింది సికింద్రాబాద్ మంత్రగత్తె. యాదగిరి ఇంటి పెరడే పూజకు వేదిక. మంత్రగత్తె ఒక చోటును చూపించి నలుచదరంగా ముగ్గుపోసింది. అనుచరులు తవ్వడం మొదలుపెట్టారు. మంత్రగత్తె పసుపు - కుంకుమలు చల్లుతూ మంత్రాలు చదువుతోంది. గజం లోతు తవ్వాక ఆగారు. ‘ఇంకా తవ్వండి’ పూనకంతో ఊగిపోతూ అన్నదామె. అనుచరులు పని కొనసాగించారు. పలుగుకేదో తగిలింది. పని ఆపి ఆమెకేసి చూశారు. ‘దొరికావా’ అంటూ నాటకీయంగా గుంటలో చేయిపెట్టి ఓ మూటను తీసింది. పాత గుడ్డతో కట్టిన ఆ మూటలో పసుపు, కుంకుమ, చచ్చి ఎండి పోయిన కప్ప, చిన్న ఎముక, నల్లదారాలు, ఎండిన నిమ్మకాయలు, తాయెత్తులు ఉన్నాయి. వాటిని చూడగానే యాడగిరి, సావిత్రి నిలువెల్లా వణికి పోయారు. మంత్రగత్తె విజయం సాధించినట్లు ముఖం పెట్టింది. ‘మీ మీద చేయించిన చేతబడి ఇదే’నంది. నమ్మడానికి సిద్ధంగా ఉన్న వారికి అంతకంటే గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు.

తిరుగు పూజ చేయాలి!
అవును. చేతబడికి విరుగు పూజ చేయకపోతే మీ అందరి ప్రాణాలు పోతాయి. పీడ ఊరందరి మీద చెలరేగి పోతుంది. బయటకు తీసిన నన్ను కూడా బతకనివ్వదు... కాబట్టి విరుగుడు పూజ చేయాలి. అందుకు మూడు లక్షలవుతుంది- అన్నదా మంత్రగత్తె. అంత డబ్బు మావల్ల కాదనడంతో లక్షన్నరకు బేరం కుదిరింది. డబ్బు తీసుకుని యాదగిరి ఇంటినుంచి బయటపడుతుంటే పొట్టేళ్లు కంటపడ్డాయి. దేవతకు బలిస్తానంటూ ఓ పొట్టేలును కూడా తీసుకెళ్లిందామె. పిటీ ఏంటంటే... ఆ లక్షన్నరతో రోగం కుదరలేదు. చేతబడి మూట వెలికి తీసి రెండు వారాలైనా అనారోగ్యం ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో మరో పూజకు రంగం సిద్ధమైంది. మీకింకా ఎక్కడెక్కడ స్థలాలు, ఇళ్లు ఉన్నాయంటూ ఆరా తీసిందామె. యాదగిరికి భువనగిరిలో ఉన్న ప్లాట్‌లో కూడా ఇదే తంతు. నేల తవ్వడం, పాతగుడ్డ మూట తీయడం, తిరుగు పూజకు మరో లక్షన్నర పట్టుకెళ్లడం జరిగిపోయాయి. అయినా  నయం కాలేదు. ఇంకేం చేయాలి? బంధువుల ఇళ్ల మీదకు మళ్లిందామె చూపు. అల్లుడింటి ఆవరణలో తవ్వి మరో లక్షన్నర వసూలు చేసింది. ఈ క్రమం ఎంతవరకు వెళ్లేదో, ఏ అనర్థానికి దారి తీసేదో. ఇంతలో...

అన్న సం‘గతి’ ఏంటో?
నర్సింహ చైతన్యవంతమయ్యాడు. మిగిలిన సోదరులంతా ఏకమయ్యారు. ముఖ్యంగా ఈ అనర్థాలు ఇలాగే కొనసాగితే అన్న అప్పుల పాలవుతాడు. అసలే ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోంది. జనవిజ్ఞానవేదిక కార్యకర్తల దగ్గరకు వచ్చి ‘నిజానికి చేతబడికి విరుగుడు ఉంటుందా. విరుగుడు పూజ చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదిలా కొనసాగితే అన్న మరణిస్తాడేమో, ఒకవేళ అదే జరిగితే ఊరు ఊరంతా మేము చేతబడి చేసి అన్నయ్యను చంపేశామని నిందిస్తుంది. నిజానికి మాకే పాపమూ తెలియదు. దీనికి పరిష్కారమెలా’ అని గోడు వెళ్లబోసుకున్నారు.

నీరసం ఎందుకంటే...
అతడు బాధపడుతున్నది నరాల బలహీనతతోనే. దానికి వైద్యం అందకపోవడంతో సమస్య తీవ్రమైంది. పొలం పనులు చేసుకోలేకపోవడంతో మొదలైన అనారోగ్యం కాస్తా ఇంట్లో తన పనులకు కూడా మరొకరి మీద ఆధారపడాల్సినంత దీనమైన స్థితికి చేరుకుంది. న్యూరో స్పెషలిస్టుకు చూపించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వైద్యం మొదలైంది. ఇది జరిగి నాలుగేళ్లవుతోంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య అపోహలు తొలగి పోయి, ఆత్మీయతలు వెల్లివిరిశాయి. ఒక మూఢనమ్మకమే ఆ కుటుంబాల మధ్య సంబంధాలను అతలాకుతలం చేసింది. ఆరోగ్యం క్షీణించే వరకు ఉపేక్షించేలా చేసి మనిషిని పిప్పి చేసింది. జనవిజ్ఞాన వేదిక కౌన్సెలింగ్‌తో వారికి చేతబడి అపోహ తొలగింది. వైద్యం మొదలైంది.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
ఎవరి మాట నమ్ముతాడో వారి చేతనే...
అతడిని వైద్యం కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం. ఆ ఊళ్లో ఆయన ఎవరితో స్నేహంగా ఉంటాడో, ఎవరి మాట మీద ఆయనకు గురి ఉందో కనుక్కుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి ద్వారా ఇతడిని డాక్టరు దగ్గరకు వెళ్లేలా ఒప్పించగలిగాం.
 - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి,
 ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్
 
మరి..  ఆ మూట ఎలా వచ్చింది?
భూమిని తవ్వినప్పుడు బయటపడే మూటలోనే కనికట్టు ఉంటుంది. గుంట తవ్వే మనుషులు ధోవతి కట్టుకుంటారు. ధోవతితో ఈ మూటను దాచుకుంటారు. తవ్వేది రాత్రిపూట, మంత్రగత్తె పసుపుకుంకాలు చల్లుతూ, ఊగిపోతూ ఏం జరుగుతుందో గ్రహించలేని అయోమయాన్ని సృష్టిస్తుంది. ఇంటి వాళ్లు బిక్కుబిక్కు మంటూ ఉంటారు. మధ్యమధ్యలో నిమ్మకాయలు తెండి, ఎర్రదారం, ఎండుమిరపకాయలు... అంటూ ఇంటి వాళ్లు దూరంగా వెళ్లేలా చేస్తుంది. ఆ సమయంలో ధోవతిలోని మూట గుంటలో పడేట్టు చేస్తారొకరు. మరొకరు దాని మీద మట్టి తోస్తారు. మరికొంతసేపటి తర్వాత దానిని వెలికి తీసి
 ‘మీ మీద చేసిన చేతబడి ఇదే’
 అని నమ్మిస్తారు.
 

మరిన్ని వార్తలు