కాలచక్రంపపంచానికి శాంతి చక్రం

10 Jul, 2014 22:35 IST|Sakshi
కాలచక్రంపపంచానికి శాంతి చక్రం

సందర్భం
 
దలైలామా నిర్వహించే కాలచక్ర ఉత్సవం ప్రపంచ బౌద్ధ ఉత్సవాలలో ప్రముఖమైనది. టిబెట్ దేశానికి చెందిన ఈ బౌద్ధ సంప్రదాయం ప్రపంచ మానవాళిలో ప్రేమ, దయ, కరుణ, ప్రజ్ఞ, ఉపేక్ష భావాల్ని పెంపొందించి, సర్వ జీవుల్లో సమరస భావాన్ని నింపి, మానవ మనస్సుల్లోని సంకుచితత్వాన్ని పారద్రోలి, శాంతి పరిమళాలు వెదజల్లడం కోసం కృషి చేస్తుంది. ప్రతి మనిషి నిస్వార్థంగా మారడానికి, దుఃఖాన్నుండి విముక్తి కావడానికి కావలసిన మానసిక, శారీరక సాధనల్ని ఈ కాలచక్రం నిర్దేశిస్తుంది. ఈ కాలచక్ర పూజా విధానం మనుషుల మనస్సుల్లో పరిపూర్ణత్వాన్ని  నింపుతుందని బౌద్ధుల నమ్మకం.
 
కాలచక్ర అంటే?

కాలానికి సంబంధించినదే ఈ కాలచక్ర. మనం సాధారణంగా క్యాలెండరు లేదా పంచాంగాన్ని కాలచక్రం అంటాం. అంటే కాలాన్ని కొలిచే విధానంగా కాలచక్రాన్ని భావిస్తాం. కానీ బౌద్ధుల ఈ ‘కాలచక్ర’ కాలానికి సంబంధించినదే అయినా, అది రోజులకు, వారాలకు, పక్షాలకు, మాసాలకు, రుతువులకు ఆయనాలకు సంబంధించినది మాత్రం కాదు. ఈ సృష్టి రచనకు సంబంధించినది
 
కాలచక్ర - విధానాలు
 
ఈ కాలచక్ర ఒక అద్భుతమైన తత్త్వం. ప్రకృతి, మనిషి వేరువేరు కావని చెప్పే ఒక విశ్వ ఐక్యతావాదం. ఆ విషయం కాలచక్రంలో ప్రధానంగా ఉన్న మూడు విధానాలు తెలియజేస్తాయి. ఇందులో మొదటిది బాహ్య కాలచక్ర. దీన్ని ‘కాలచక్ర భూమి’ అని కూడా అంటారు. విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, సౌరవ్యవస్థ, భూమి, మూలకాలు, మూల రాశులు - ఇలా భౌతిక జగత్తంతా ఈ బాహ్యకాలచక్రలో భాగమే. రెండోది అంతర కాలచక్ర. మనిషి, పుట్టుక, జీవనం, అనుభవాలు, మనస్సు, నాడీ చలనాలు, హృదయ స్పందనలు - ఇలా మనిషీ మనస్సు కలిసినదంతా ఈ విభాగంలోకి వస్తుంది. ఇక మూడోది ప్రత్యామ్నాయ కాలచక్ర. పైన చెప్పిన రెండు రకాల అంతర, బాహ్య కాలచక్రాల్ని ఒకటిగా అనుసంధానం చేసే విధానం ఇది. ఈ అనుసంధానం చేసే పద్ధతి ధ్యాన పద్ధతి.
 
- బొర్రా గోవర్ధన్
 
టిబెట్‌లో దలైలామాలు, పంచన్‌లామాలు అక్కడి బౌద్ధ గురువులు. కాలచక్ర పథ మార్గాన్ని నడిపించే గురువులు వాళ్ల్లే. ఒకటవ, రెండవ, ఏడవ, ఎనిమిదవ, పద్నాలుగవ దలైలామాలు ఈ కాలచక్ర కార్యక్రమాల్ని ఎక్కువగా నిర్వహించారు. ప్రస్తుత దలైలామా 14వ దలైలామా. అయన అసలు పేరు ‘టెన్జిన్ గాట్సో’. ఆయన ఇప్పటికి 33 కాలచక్రలు నిర్వహించారు. ప్రస్తుతం జూన్ 3 నుంచి 14వ తేదీవరకు భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో ‘లే’ (లడక్) లో 34వ కాలచక్రను నిర్వహిస్తున్నారు. 2006లో అమరావతిలో నిర్వహించిన కాలచక్ర ముప్పయ్యవది.
 
కాలచక్ర పూజావిధానం


 కాలచక్ర అనేది భిక్షుదీక్షను ఇచ్చే కార్యక్రమం. దీక్ష నిచ్చే గురువును ‘వజ్రగురువు’ అంటారు. ఆయన ఒక ఉన్నత ఆనసం మీద కూర్చుని కార్యక్రమం నిర్వహిస్తారు. కాలచక్రలో ప్రధానంగా మూడు వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో బాహ్యకాలచక్రలో ఉండే నక్షత్రాది గ్రహాలు ఉంటాయి. రెండో వలయంలో అంతర కాలచక్రలో ఉండే శరీర, మనోస్థితులు ఉంటాయి. మూడో వలయంలో బుద్ధి, కాలం ఉంటాయి. అంటే ఆయా వలయాలు ఆయా రాశులకు సంకేతాలుగా ఉంటాయి. ఈ మూడు వలయాల్ని 12 రోజుల్లో దాటుకుంటూ చివరికి చేరాలి. ఈ 12 రోజుల్ని 11 దశలుగా పూర్తి చేయాలి. ఈ దశల్ని అభిషేకాలంటారు.
 
లామా ఈ కాలచక్రను కొన్ని మండలాలుగా విభజిస్తాడు. ఈ మండలాల్ని రంగురంగుల ఇసుకతో నింపుతాడు. కాలచక్ర చిత్రాన్ని గీస్తాడు. ఆ చక్రంలో 720 మంది దేవతల్ని ప్రతిష్ఠిస్తాడు. కోర్కెలకు ప్రతీకగా శ్వేత వర్ణ బొమ్మల్ని కాలచక్ర కాళ్లకింద అణచివేస్తున్నట్లు చిత్రిస్తాడు. ఈ బొమ్మల్లో  చక్రం.. పరిణామానికి (పురుషుడు), కాలం.. ప్రజ్ఞ (స్త్రీ) కి ప్రతీకలుగా భావిస్తారు. అయితే కాలచక్ర తంత్రం స్వభావరీత్యా స్త్రీతంత్రం. స్త్రీలు ఆచరించేది కాదు. ఈ తంత్ర స్వభావం అది. అందుకే ఈ తంత్రాన్ని ‘విశ్వమాత’గా పిలుస్తారు.
 
కాలచక్ర అంటే విశ్వమాత అని. చివరి రోజున గుణాలకు ప్రతీకలైన రంగురంగుల ఇసుకను చెరిపివేసి, సైకత ఆలయాన్ని కూల్చేసి, ఆ ఇసుకను, రంగుల్నీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ నది ప్రవహించే కాలానికి ప్రతీక. ఈ పన్నెండు రోజుల కార్యక్రమంలో బోధి చిత్తాన్ని పొందిన భిక్షువులు దుఃఖరహితులై, శాంతి కాముకులై, సర్వజీవశ్రేయస్సు కోసం పాటుపడతారు. ప్రపంచాన్ని శాంతికమలంలా పూయిస్తారు. కాలచక్ర అంటే ప్రపంచశాంతి చక్రమే.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు