అరసవెల్లి తొలి కిరణం తాకే క్షేత్రం

2 Feb, 2016 23:30 IST|Sakshi
అరసవెల్లి తొలి కిరణం తాకే క్షేత్రం

ప్రత్యక్ష దైవం, గ్రహరాజు అయిన శ్రీ సూర్యనారాయణుడు కొలువైన అరుదైన క్షేత్రం అరసవల్లి. దర్శన మాత్రానే భక్తులకు హర్షాతిరేకాలు కలిగించే ఈ దివ్యక్షేత్రం హర్షవల్లిగా ఖ్యాతి పొందింది. కాలక్రమేణా ఇది అరసవల్లిగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంపట్టణంలో అంతర్భాగంగా ఉంది. ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా శ్రీ సూర్యనారాయణమూర్తిని  ఇక్కడ సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.
 
 క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కళింగ ప్రాంతాన్ని ఏలిన గంగ వంశపు రాజు దేవేంద్ర వర్మ అరసవల్లిలో సూర్యనారాయణుడి ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుశకం 676 నుంచి 688 వరకు రాజ్యం చేసిన దేవేంద్ర వర్మ తన రాజ్యాన్ని చిలికా సరస్సు నుంచి గోదావరి తీర ప్రాంతం వరకు విస్తరించాడు. క్రీస్తుశకం 747లో ఆయన మనవడు అధికారానికి వచ్చాడు. ఆయన పేరు కూడా దేవేంద్ర వర్మే. తాత బాటలోనే పలు ఆలయ నిర్మాణాలు చేశాడు. ఆలయాల పరిరక్షణ కోసం శాసనాలు రాయించాడు. ఆయన రాయించిన మూడు శిలా శాసనాలు నేటికీ అరసవల్లి ఆలయ ప్రాంగణంలో పదిలంగా ఉన్నాయి.

ఆలయ ప్రత్యేకత
అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి ఐదు ద్వారాలు ఉన్నాయి. ఆలయం వద్ద పురాతనమైన పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని దేవేంద్రుడే తన వజ్రాయుధంతో తవ్వినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇందులోనే శ్రీ సూర్యనారాయణస్వామి మూలవిరాట్టు విగ్రహం లభించిందని, దానినే దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని స్కంద పురాణం చెబుతోంది. ఇక్కడి పుష్కరిణీ జలాలలో ఔషధగుణాలు గల అరుదైన ఖనిజ లవణాలు ఉన్నాయని, ఈ పుష్కరిణి జలాల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ పుష్కరిణి జలాలకు పలు రోగాలను హరించే శక్తి కూడా ఉందని చెబుతారు. ఏటా రథసప్తమి రోజున ఇక్కడ జరిగే వేడుకలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారు.

పాదాలను తాకే కిరణాలు
అరసవల్లి ఆలయానికి అరుదైన ప్రత్యేకత ఉంది. ఏటా రెండు ఆయనాలలో మూడేసి రోజులు ఆలయానికి గల ఐదు ద్వారాల నుంచి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఉత్తరాయనంలో మార్చి 9, 10, 11 తేదీలలోను; దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2, 3 తేదీలలో ప్రాతఃకాలంలో సంభవించే ఈ అరుదైన నయనానందకర విశేషాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
 
శిల్ప వైవిధ్యానికి నెలవు

 అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కళింగ శిల్ప వైవిధ్యానికి నెలవుగా సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాకారానికి ముందే ప్రాచీన శిల్పకళా సౌందర్యంతో అలరారే ఎత్తై గోపురం కనిపిస్తుంది. సువిశాలమైన ఆవరణలో గరుడ స్తంభాన్ని దాటిన వెంటనే ముఖమండపం వస్తుంది. ప్రధాన ఆలయాన్ని కళింగ శిల్పశైలిలో నూతనంగా నిర్మించారు. మూలవిరాట్టు వద్ద సౌరయంత్రం ప్రతిష్ఠితమై ఉంది. దీనినే సౌరమండలం అంటారు. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో ఈ యంత్రాన్ని రచించి, మూలవిరాట్టు వద్ద ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అనివెట్టి మండపం, రెండు ముఖద్వారాలు తదితర నిర్మాణాలను దాతల సహకారంతో చేపట్టారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణుడు శివ స్వరూపుడిగా జ్ఞానాన్ని, కేశవ స్వరూపుడిగా మోక్షాన్ని, తేజో స్వరూపుడిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు అనే పన్నెండూ సృష్టికి కారణమవుతున్నాయని, ద్వాదశ మాసాత్ముడైన సూర్యుడు వీటి ద్వారా లోకపాలన చేస్తున్నాడని పెద్దలు చెబుతారు. సూర్య భగవానుడు త్రిదోషాలను, సమస్త రోగాలను హరిస్తాడని పలు స్తోత్రాలు చెబుతున్నాయి. అరసవల్లిలోని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అభిషేక జలమైన సోమసూత్ర జలాన్ని తలపై చల్లుకుంటే సర్వరోగాలు నశిస్తాయని సూర్యమండలాష్టకం చెబుతోంది. సూర్య భగవానుడినే ప్రధాన దైవంగా ఆరాధించే సౌరోపాసకులు ఎర్రని దుస్తులు ధరించి, ఎర్రమందారాలతో సూర్యుని పూజిస్తారు. మూలవిరాట్టుకు బంగారు పాదుకలు, నేత్రాలు, వజ్రకవచం ధరింపజేసి, ఆరాధిస్తారు.
 
సూర్యనమస్కార సేవ

 ఈ ఆలయంలో సూర్యనమస్కార సేవ భక్తులకు అందుబాటులో ఉంది. దీనికి దేవాదాయ శాఖ రూ.50 టికెట్టు ధరగా నిర్ణయించింది. టికెట్టు తీసుకున్న భక్తుల కోసం ఆలయ అర్చకులు అనివెట్టి మండపంలో సూర్యనమస్కారాలు నిర్వహిస్తారు. సూర్యనమస్కారాల వల్ల ఆరోగ్యం చక్కబడుతుందనే విశ్వాసంతో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ సేవ కోసం ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
 - దువ్వూరి గోపాలరావు, శ్రీకాకుళం కల్చరల్
 ఫొటోలు: కళ్లేపల్లి జయశంకర్
 
మూలవిరాట్టుకు అన్నీ విశేషాలే!
ఇక్కడి మూలవిరాట్టు విగ్రహం అరుదైన అరుణ సాలగ్రామ శిలతో రూపొందింది. ఐదున్నర అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ విగ్రహం అష్టధాతు సమ్మేళనం. విశ్వకర్మ చేతిలో రూపొందిన స్వామివారి మూలవిరాట్టు వద్ద సౌర, త్రిచ, అరుణ యంత్రాలను ప్రతిష్ఠించడం వల్ల ఆధ్యాత్మికంగా మరింత శక్తి సంతరించుకుంది. సింహలగ్న జాతకుడు కావడం వల్ల తలపై సింహతలాటం, పద్మాలతో కూడిన రెండు అభయహస్తాలు, ఇరువైపులా పింగళుడు, మరలుడు, నడుమ చురిక, రథసారథి అనూరుడితో సప్తాశ్వ రథారూఢుడిగా ఉషా, ఛాయా, పద్మినీ సమేతుడిగా భక్తులకు దర్శనమిచ్చే సూర్యభగవానుడి నిజరూపాన్ని రథసప్తమి రోజున భక్తులు కనులారా చూసి తరలించాల్సిందే. - ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకుడు
 
ఇలా చేరుకోవచ్చు

అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చే భక్తులకు నేరుగా శ్రీకాకుళం రోడ్ వరకు రైల్వే సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా ఆటో లేదా ట్యాక్సీలలో అరసవల్లి చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడల నుంచి శ్రీకాకుళం వరకు నేరుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సుల ద్వారా వచ్చే భక్తులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవల్లికి సిటీబస్సులు లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు. విమానాల్లో వచ్చే భక్తులు విశాఖ విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి అక్కడి నుంచి అరసవల్లికి చేరుకోవాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు