తొలివిజన్

20 Nov, 2014 22:50 IST|Sakshi
తొలివిజన్

జాన్ లోగీ బైర్డ్

టెలివిజన్‌ను ఎవరు కనిపెట్టారన్న ప్రశ్న వచ్చినప్పుడు రెండు మూడు పేర్లు వినిపిస్తాయి. ఆ ఇద్దరు ముగ్గురి కన్నా  ముందు.. చిత్ర ప్రతిబింబం కదలడాన్ని ప్రత్యక్ష ప్రయోగం ద్వారా ప్రదర్శించి చూపింది మాత్రం జాన్ లోగీ బైర్డ్. ఈయన స్కాటిష్ ఇంజినీరు. క్రైస్తవ మతాధికారి కుమారుడు. బైర్డ్ 1888 ఆగస్టు 14న స్కాట్లాండ్ పశ్చిమ తీర ప్రాంతమైన హెలెన్స్‌బర్గ్‌లో జన్మించాడు.

బైర్డ్ నిత్య రోగి. కానీ చలాకీగా ఉండేవాడు. తెలివైనవాడు. ఆ తెలివి కొన్నిసార్లు అతడి చేత పిల్లచేష్టలు చేయిస్తుండేది.  టెలిఫోన్ ఎక్స్ఛేంజి నుంచి రహస్యంగా తన పడక గదికి వైరు లాక్కుని, అక్కడి నుంచి ఆ వీధిలో ఉన్న తన స్నేహితులకు లింకు కలుపుకుని, వారితో ఫోన్‌లో హస్కు కొడుతుండేవాడు బైర్డ్. అతడి దృష్టిలో అదొక ప్రయోగం. అసలలాంటి ప్రయోగాల మీద ఆసక్తితోనే అతడు స్కాట్లాండ్ టెక్నికల్ కాలేజీలో చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో బైర్డ్ చదువుకు అంతరాయం కలిగింది. కాలేజీ లేదు. కొలువూ లేదు. ఏం చేయాలి? సైన్యంలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడు. అవసరమైన పరీక్షలన్నీ చేసి ‘అన్‌ఫిట్’ అని తేల్చేశారు వాళ్లు. ఆ తర్వాత ఎలాగో క్లైడ్ వ్యాలీ ఎలక్ట్రికల్ పవర్ కంపెనీలో సూపరింటెండెంట్ ఇంజినీరుగా చేరాడు. అక్కడా కొన్నాళ్లే. యుద్ధం ముగిసేనాటికి ఏవో రెండు మూడు వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నాడు బైర్డ్. ఆ సమయంలోనే అతడి ధ్యాస ‘టెలివిజన్’ వైపు మళ్లింది. అలాంటి ఒక పరికరాన్ని కనిపెట్టగలిగితే! నిజాకది ఎందరో శాస్త్రవేత్తల దశాబ్దాల కల. దాన్ని బైర్డ్ నిజం చేస్తాడని ఎవరూ ఊహించలేదు.

టెలివిజన్‌ను కనిపెట్టాలన్న ఆలోచన రాగానే బైర్డ్ ఇంగ్లండ్ దక్షిణ తీర ప్రాంతానికి వెళ్లి సంబంధిత శాస్త్రావిష్కరణల విభాగంలో తన పేరు నమోదు చేయించుకున్నాడు. రకరకాల ప్రయోగాలు చేసి 1924 నాటి కల్లా కొన్ని అడుగుల పరిధి వరకు మినుకు మినుకుమనే చిత్రాన్ని ప్రసారం చేయగలిగాడు! 1926 నాటికి కదిలే చిత్రానికి స్పష్టతను, స్థిరత్వాన్ని ఇవ్వగలిగాడు. ఆ ఏడాది జనవరి 26న లండన్‌లోని ఒక పై అంతస్తు గదిలో 50 మంది శాస్త్రవేత్తల సమక్షంలో ప్రపంచంలోనే మొట్టమొదటిదైన టీవీ ప్రసారాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. ఆ తర్వాతి సంవత్సరం ప్రసారాల నిడివిని లండన్, గ్లాస్‌గో ప్రాంతాల మధ్య 438 మైళ్ల వరకు విస్తరించగలిగాడు! శాస్త్ర పరిజ్ఞాన రంగంలో అదొక పెద్ద విజయం. దాంతో అతడు సొంతంగా ‘బైర్డ్ టెలివిజన్ డెవలప్‌మెంట్ కంపెనీ’ (బి.టి.డి.సి) స్థాపించాడు. ఏడాదికల్లా ఆ కంపెనీ లండన్, న్యూయార్క్‌ల మధ్య, మధ్య అట్లాంటిక్ సముద్రంలోని ఒక నౌకలోకి టీవీ ప్రసారాలను పంపగలిగింది. బైర్డ్ ఈ ప్రయోగాలన్నీ చేసింది అప్పటికి అందుబాటు లో ఉన్న యాంత్రిక విధానాలతో.  మొదట్లో శబ్దం, చిత్రం వేర్వేరుగా ప్రసారం అయ్యేవి. 1930 నాటికి గానీ రెండిటినీ ఏకకాలంలో ప్రసారం చెయ్యడానికి బైర్డ్‌కు సాధ్యపడలేదు. సరిగ్గా అప్పుడే ఎలక్ట్రానిక్ శకం ఆరంభమైంది. దాంతో బైర్డ్ యాంత్రిక విధానానికి ఆదరణ తగ్గి, మార్కోనీ నేతృత్వంలోని ఇ.ఎం.ఐ. (ఎలక్ట్రికల్ అండ్ మ్యూజికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) చేతుల్లోకి టీవీ టెక్నాలజీ వెళ్లిపోయింది. బైర్డ్ కూడా కొంతకాలం ఎలక్ట్రానిక్ విధానాలతో టెలివిజన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాడు కానీ ఇ.ఎం.ఐ. దూకుడును ైబె ర్డ్ కంపెనీ బి.టి.డి.సి. తట్టుకోలేకపోయింది.
 
ఇవాళ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. ఈ సందర్భంగా టెలివిజన్ ఆవిష్కరణకు ఆద్యుడైన జాన్ లోగీ బైర్డ్‌ను స్మరించుకోవడం సముచితం. 1996 నవంబర్ 21న తొలి ప్రపంచ టెలివిజన్ ఫోరం సమావేశం జరి గింది. అందుకే ఆ రోజును ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ టెలివిజన్
 దినోత్సవం’గా ప్రకటించింది.
 
 
 
 

మరిన్ని వార్తలు