పూలు కడితే పైసలు వచ్చేవి

19 Apr, 2017 00:16 IST|Sakshi
పూలు కడితే పైసలు వచ్చేవి

వేసవి జ్ఞాపకం

వేసవి వచ్చిందంటే పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడే కోసిన పూలలా తాజా అవుతుంటాయి. వేసవిలో బాల్యం, బాల్యంలో వేసవి రెండూ బాగుంటాయి. అబ్బాయిల సంగతేమోకాని అమ్మాయిలకు వేసవి వచ్చిందంటే సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషానికి కారణం మల్లెపూలు. సాయంత్రం అయ్యాక వీధి దీపాలు వెలుగుతుండగా చుట్టుముట్టిన వేడిని ఆరుబయట నీళ్లు చల్లి చల్లబరుచుకుంటూ ఉండగా వీధిలోకి మల్లెపూల బండి వచ్చేది. నాలుగు చక్రాల బండిపై రాశులు పోసిన మల్లెపూలను అమ్ముతూ ‘మల్లెమొగ్గల్‌... మల్లెమొగ్గల్‌’... అని అరుస్తూ బండివాడు తిరుగుతూ ఉంటే వాటిని కొనడానికి అమ్మ దగ్గర మారాము చేయాల్సి వచ్చేది.

కొని, మాల కట్టి, తలలో పెట్టుకునేదాక కాలు నిలువదు. ఉత్త పూలు ఒకోసారి, మరువం వేసి ఒకోసారి, దవనంతో ఒకసారి, అప్పుడప్పుడు మధ్య మధ్య అలంకారంగా నాలుగు కనకాంబరాలు వేసి ఒకసారి అల్లి పూలు పెట్టుకుంటే మనసు విప్పారేది. రాత్రి పూట నిద్రపోతే దిండు మీద అవన్నీ నలిగిపోయి నిద్రలో కదలడం వల్ల పక్కంతా అయ్యి తెల్లవారుజామున నిద్ర లేస్తుంటే ఒకటే సువాసన. వేసవి అంటే పెద్ద పెద్ద ఎండలే కాదు పొడవు పొడవు మల్లెపూల జడలు కూడా. ఆ జడలు వేసుకొని ఫొటో స్టుడియోకి వెళ్లి అద్దంలో జడ కనిపించేలా ఫొటో దిగి దానికి ఫ్రేమ్‌ కట్టించుకుని గోడకు వేలాడదీసే దాకా అదో పెద్ద హడావిడి.

మా ఊళ్లో మే నెలలో మల్లెపూల గిరాకీ ఇంకా పెరిగిపోయేది. అంగళ్లలో విడిపూలకు కాకుండా మాలలకే డిమాండ్‌ ఎక్కువ. అప్పుడు మాకు తెలిసిన ఒక షాపు వాళ్లు మా ఇంటికి విడి పూలు తెచ్చి ఇచ్చేవారు. వాటిని మాలలుగా కట్టి ఇస్తే కట్టినందుకు కూలి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేవారు. అవి పెద్ద డబ్బులు కాకపోయినా చిల్లర పైసలే అయినా పూలు కట్టి సంపాదించిన ఆ డబ్బులు పెద్ద పెన్నిధిగా అనిపించేవి. వారమంతా పూలు అల్లితే ఆదివారం దర్జాగా సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‌లో గోల్డ్‌స్పాట్‌ తాగేంత డబ్బులు వచ్చేవి.

మా ఇంట్లోనే కాదు చుట్టుపక్కల ఇళ్లల్లో చాలామంది ఆడపిల్లలు వేసవిలో మల్లెపూలను మాలలుగా కట్టి ఇచ్చే కాంట్రాక్టుల్లో బిజీగా ఉండేవారు. ఇప్పుడు పెద్దవాళ్లం అయిపోయాం. కాని బజారులో నిలబడి ఈ సాయంత్రాల్లో మల్లెలు కొన్నప్పుడల్లా ఆ జ్ఞాపకం చటుక్కున మనసును తాకుతుంది. గుప్పెడు పూలను దోసిట్లో తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకున్నంత మధురంగా అనిపిస్తుంది. వేసవీ... జిందాబాద్‌. మల్లెమాలా వర్థిల్లు.
– షబీనా, బాపట్ల

మరిన్ని వార్తలు