నేనసలు అద్దమే చూడను..

12 Aug, 2014 22:53 IST|Sakshi
నేనసలు అద్దమే చూడను...

అంతర్వీక్షణం
 
ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడాలనుకున్నారు?

అలాంటిదేమీ అనుకోలేదు, రచయితగా స్థిరపడడం కూడా అనుకోకుండా జరిగిపోయింది. అలాగే ఫలానా ప్రదేశంలోనే స్థిరపడాలనే ఆలోచనలు అప్పట్లో పెద్దగా ఉండేవి కాదు.

ఇప్పటికి ఎన్ని నవలలు, కథలు రాసి ఉండవచ్చు?
150 నవలలు, మూడు వేలకు పైగా కథలు.

మీ రచనల్లో మీకు అత్యంత ఇష్టమైనవి?
రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయి, విధాత

ఏదైనా ఒక పాత్రను మలిచిన తర్వాత కొన్నాళ్లకు ఆ పాత్రను మరోలా రూపొందించి ఉండాల్సింది అనుకున్న సందర్భం ఉందా?
లేదు. రచన మొదలు పెట్టే ముందే సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మొదలు పెట్టాక మార్చకూడదు. నాకెప్పుడూ మార్చాల్సిన అవసరం కూడా రాలేదు.

మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? ఏ రకంగా ప్రభావం చూపారు?
 కొమ్మూరి సాంబశివరావు గారు. ఆయన రచనలే నాకు స్ఫూర్తి. ఆయన లేకపోతే మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఉండేవాడు కాదు.
     
మీకు ఇష్టమైన పుస్తకాలు...

 అమ్మ ఒడిలోకి పయనం, ఒక యోగి ఆత్మకథ.
    
ఇన్నేళ్లుగా ఎన్నడూ మీ ఫొటో ప్రచురించడానికి ఇష్టపడకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా?
 నాలో కీర్తి కాంక్ష కొద్దిగా కూడా లేదు. ఫొటోలు తీసుకుని చూసుకోవాలనే కోరిక కూడా లేదు. నా జీవితంలో తీసుకున్న ఫొటోలు బస్ పాసు, పాస్ పోర్టు, స్కూలు రికార్డుల కోసమే.

మీ అభిమాన పాఠకులలో ఒకరి పేరు చెప్తారా?
 వైజాగ్ నుంచి ఎం. ఎన్. దేవి అనే పాఠకురాలు, తాడేపల్లి గూడెం నుంచి రాము అనే పాఠకుడు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వారు.

ఎలాంటి విషయాలకు భయపడతారు?
ఒక సాధారణమైన మనిషికి ఉండే భయాలన్నీ నాకూ ఉన్నాయి. పామును చూసి భయపడడం మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చినట్లుంది. ఆధ్యాత్మిక మార్గంలో తరచూ పాములుండే ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో ఇప్పుడా భయం పోయింది.

అబద్ధం చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు?
ఒకప్పుడు స్వీయరక్షణ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబద్ధం చెప్పేసే వాడిని. ఆధ్యాత్మికంలో సత్యానికి దగ్గరగా ఉండడాన్ని సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా మానేశాను.

అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు?
నేనసలు అద్దమే చూడను. తల దువ్వడానికి కూడా చూడను. షేవింగ్ సమయంలో కూడా చెంపల మీదే తప్ప ముఖం మీద నా దృష్టి పడదు.

మీరు ఎన్నడైనా మీ శ్రీమతిని క్షమాపణ అడగాల్సి వచ్చిందా?
చాలాసార్లు వచ్చింది. కానీ గతంలో మగాడిననే అహంతో క్షమాపణ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీమతికే కాదు బయటి వాళ్లకు కూడా గతంలో వాళ్లకు కలిగించిన అసౌకర్యాలను గుర్తు చేసుకుని మరీ క్షమాపణ చెప్తున్నాను.

పిల్లల గురించి...
నాకు ముగ్గురమ్మాయిలు. పెద్దమ్మాయి కావ్య అమెరికాలోని హ్యూస్టన్‌లో, రెండో అమ్మాయి ఊహ ఇండియానాపోలిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో అమ్మాయి లిపి... విచిటా స్టేట్ యూనివర్శిటీలో ఎం.ఎస్ చేస్తోంది.

ఈ తరాన్ని చూస్తే ఏమనిపిస్తుంటుంది?
 సెల్ఫ్ సెంటర్‌డ్‌గా ఉంటున్నారు. వారి కారణంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే దానికి కనీసంగా కూడా స్పందించడం లేదు. పొరపాటు జరిగిందనే భావన మనసులోకే రానివ్వడం లేదు. ఆ ధోరణి మారాలి.

మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఉందా?
 జీవితం నిండా అవే ఉన్నాయి.
     
సంస్కరించుకునే ప్రయత్నం జరిగిందా?
 జరిగింది. అందులో భాగంగానే మద్యం, మాంసం,మగువల జోలికెళ్లడం పూర్తిగా మానేశాను.

దేవుడు ప్రత్యక్షమై ‘నీ జీవితంలో ఒక్కరోజే ఉంద’ంటే.. మీ చివరి కోరిక..?
మోక్ష సాధన కోసం ఏమేమి చేయాలో ఆ దేవుణ్ణే అడిగి, ఆయన చెప్పినట్లు చేస్తాను.

 - వాకా మంజులారెడ్డి
 

మరిన్ని వార్తలు