గాయం చెక్కిన ధ్యేయం

27 Jul, 2016 23:26 IST|Sakshi
గాయం చెక్కిన ధ్యేయం

ఫస్ట్ పర్సన్
 
ఆ శ్రమా, ఈ శ్రమా చేసి బతకడం...
లేదా... నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం!
ఇది తప్ప...
సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనా, అవకాశం
రెండూ... సగటు మనిషికి సాధారణంగా ఉండవు.
ఏ శ్రమ చేసినా... మనిషి ఆశ్రమంలా ఉండాలని
పద్మజ అంటున్నారు.
చిన్నప్పుడు అయిన పెద్ద గాయం
పద్మజ సేవ ముందు చిన్నబోయింది.
మనిషికి అలంకారం... ఆ సంస్కారమే అని...
ధ్యేయం గొప్పదైతే గాయం గాంధేయం అవుతుందని
పద్మజ చాటి చెబుతున్నారు.
మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు
.
 
కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్విలో  1971 ఏప్రిల్ 9న పద్మజ జన్మించారు. తల్లి వెనిగళ్ల లలిత, తండ్రి భీమేశ్వర్రావు. ప్రాథమిక విద్యను హైదరాబాదులో చిన్నాన్న దగ్గరుండి అభ్యసించారు. హైస్కూల్ చదువు ప్రకాశం జిల్లాలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర సాగింది. బీఎస్సీ ధార్వాడ్ కర్ణాటక యూనివర్శిటీలో పూర్తి చేశారు. చదువయ్యాక నాలుగేళ్లపాటు మానసిక వికలాంగుల కోసం పనిచేసే ‘లార్ష్ ఇంటర్నేషనల్’ సంస్థలో వలంటీర్‌గా ఉన్నారు. అదొక జీవిత అధ్యయనం ఆమెకు. అయితే ప్రస్తుతం పద్మజ చేస్తున్న సేవకు ప్రేరణ మాత్రం.. ఆమె బాల్యంలో జరిగిన ఒక సంఘటన నుంచి కలిగిందే. ఆమె గురించి పూర్తి వివరాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
 
చేదు బాల్యం
అమ్మమ్మ, తాతయ్యల దగ్గరుండి చదువుకున్నానని చెప్పాను కదా. అమ్మమ్మ, తాతయ్యలతో పాటు మేనమామా ఇంట్లో ఉండేవాడు.అతను  నన్ను బాగా చూసుకుంటున్నట్టుగా బయటకు ప్రవర్తిస్తూ నా దగ్గర వెకిలి, వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. ఏడుపొచ్చేది. ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. భరించలేక ఎవరికైనా చెప్పాలనిపించేది. కానీ  వెంటనే మామయ్య గురించి అలా చెప్తే నమ్ముతారో లేదో అని భయమేసేది. ఆ నరకం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలనిపించేది. అందుకే .. ‘నన్ను ఇక్కడెందుకు ఉంచుతున్నారు? మీ దగ్గరే పెట్టుకొని చదవించొచ్చు కదా.. నేను ఇక్కడ ఉండను .. వచ్చేస్తాను’ అంటూ నాన్న దగ్గర మారాం చేసేదాన్ని. బెంగతో అలా అంటుందని అమ్మానాన్న అనుకున్నారే కాని నా భయాన్ని వాళ్లు గుర్తించలేకపోయారు. ఆ హింస గురించి వాళ్లకు చెప్పే ధైర్యం నేనూ చేయలేకపోయాను. కాని అవకాశం దొరికితే మాత్రం బయటపడాలనే ఆలోచనతోనే పెరిగాను. అందుకే ఇంటర్ అవగానే కర్ణాటకకు వెళ్లిపోయాను.
 
ఏదో సాధించాలని కసి
బాగా చదివి  ఏదో సాధించాలన్న కసితో చదువుల్లో, ఆటల్లో ముందుండేదాన్ని. డిగ్రీ అయ్యాక, స్వచ్ఛంద సేవాసంస్థలో పనిచేస్తూనే  కర్ణాటక రాష్ట్ర గ్రూప్ 1 పరీక్ష రాశాను. సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షకూ హాజరయ్యాను. 6వ ర్యాంక్ వచ్చింది. జిల్లా ఉపాధి అధికారిగా ఉద్యోగంలో చేరాను.  అందరి పిల్లల గురించి తల్లిదండ్రులు కలలు కన్నట్టే నా గురించీ అమ్మానాన్న కలలు కన్నారు. బాగా చదువుకొని, మంచి ఉద్యోగంలో చేరి.. పెళ్లి, పిల్లలతో హాయిగా జీవితంలో స్థిరపడాలని. చదివి, మంచి ఉద్యోగం సంపాదించి కొంత వరకు అమ్మానాన్న కలల్ని నిజం చేశాను. అమ్మానాన్న మాటలకు ఏ రోజూ ఎదురు చెప్పని నేను పెళ్లికి విషయంలో  మాత్రం చెప్పాను . అయితే మా పెద్దమ్మ పెళ్లి చేసుకోవలసిందేనని (భారతి)  ఒత్తిడి తెచ్చింది. తప్పించుకున్నా.  చెల్లి పెళ్లి అయిపోయాక నా మీద ఆ ఒత్తిడీ తగ్గింది. కాని తర్వాత చాలా రోజులకు అప్పుడప్పుడు అనిపించేది... భర్త, పిల్లలు ఉండే బాగుండు అని. మళ్లీ వెంటనే నా చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూశాక భర్త కంటే కూడా పిల్లలుంటే చాలు అన్న ఆలోచన వచ్చేది. అయితే అది క్షణం వరకే. ‘కంటేనే అమ్మా.. కనకపోతే అమ్మ కాలేమా?’ అనిపించేది. ఓ వైపు ఆ తలపులు.. ఇంకోవైపు ఏదో సాధించాలనే తపనతో చేస్తున్న ఉద్యోగంలో ఆనందాన్ని, సంతృప్తినీ పొందలేకపోయా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నా అనేవాళ్లను సంపాదించుకోవడం కన్నా నా అన్నవాళ్లు లేనివారికి అంకితం చేయడం మిన్న అనుకున్నాను.
 
ఓప్రా విన్‌ఫ్రే ప్రభావం
ఆ సమయంలోనే ఓప్రావిన్‌ఫ్రే జీవితం, ఆమె షో నా మీద చాలా ప్రభావం చూపించింది. మారుతండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైన విన్‌ఫ్రే  తనలాంటి ఎంతోమంది బాధితులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన తీరు.. పిరికిదాన్నయినా నాకు  స్ఫూర్తినిచ్చింది. ఆ ప్రేరణ, అప్పటికే వాలంటరీ వర్క్‌లో ఉన్న అనుభవం, రామమకృష్ణా మిషన్‌తో ఉన్న అనుబంధం,  చదివిన పుస్తకాలూ నా గమ్యాన్ని మార్చాయి. చిన్నప్పుడు నాకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఇంకే ఆడపిల్లకు ఎదురు కాకుండా, ఇంకే ఆడపిల్లా బలికాకుండా ఇటు పిల్లలను, అటు తల్లిదండ్రులను జాగృతం చేయాలనుకున్నాను.
 
‘జట్టు’లో ఒకరిగా
ఆ సమయంలో నేను ఉద్యోగరీత్యా ప్రకాశం జిల్లాలో ఉన్నాను.  అప్పటి జిల్లా కలెక్టర్ కరికల్ వలెవన్..  ‘జట్టు ’ అనే ఆశ్రమ వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడును పరిచయం చేశారు. జట్టు కోసం ఆతను టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని చేసిన త్యాగాన్ని వివరించారు. ఇక నేను రెండో ఆలోచన చేయలేదు. నా నిర్ణయాన్ని ఆపలేదు. ఉద్యోగం వదిలేశాను. ‘జట్టు’లో చేరాను. ఈ పిల్లలతో బాగానే జట్టు కుదిరింది. అమ్మా...నాన్న... ఎటువంటి ఆధారం లేని ఈ పిల్లల  ‘అమ్మా’ అన్న పిలుపు, వాళ్ల మమకారం నన్ను ఇక్కడ కట్టిపడేశాయి.
 
అంతర్జాతీయ స్థాయిలో..
ఈ  పిల్లల్లో ఉన్న ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ  ఆశ్రమంలో శ్రీ రజనీరాజ అంతర్జాతీయ శాస్త్రీయ నృత్య కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశాం.  ఈ పిల్లలతోపాటు చుట్టుపక్కల పిల్లలకూ శాస్త్రీయ నృత్యంతోపాటు, సంగీతం,  పలు జానపద కళలు, కత్తిసాము, కర్రసాము,  హాకీలాంటి ఆటలను నేర్పుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పిల్లలు బహుమతులు, అవార్డులు, రివార్డులు సాధిస్తున్నారు. ఈ విషయంలో జట్టు పారినాయుడు మాస్టారు, నృత్య శిక్షకులు రజనీ, శ్రీనివాస్‌లు, జట్టు ట్రస్ట్ ప్రోత్సాహం గొప్పది.

ఆశ్రమంలో పిల్లలతో పాటు వృద్ధులకు కూడా ఆసరా ఇస్తున్నాం.  సుబ్బాయమ్మలాంటి వారు పెద్ద దిక్కుగా ఉన్నారు. జట్టులోని పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలకు అంగరంగవైభవంగా పెళ్లి చేశాం. వారు ఇప్పుడు అమ్మా...నాన్నలున్నా...ఇంత చక్కగా చూసుకోరేమోనన్న సంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నారు.
 
లైంగిక దాడుల బాధితుల కోసం
బాల్యంలో, యవ్వనంలో లైంగిక దాడులకు గురవుతున్న ఆడపిల్లలను చైతన్య పరచాలి. ఎదిరించే గుణాలను అలవాటు చేయాలి. అన్యాయాలకు గురైన పిల్లలు మానసిక వత్తిడికి గురి కాకుండా చూడాలి. లేదంటే ఆ వత్తిడితో వివాహమయ్యాక వారు ప్రశాంతంగా ఉండలేక, కట్టుకున్న వారిని ఉంచలేక మథన పడ్తుంటారు. అలాగే దాడులకు పాల్పడుతున్న మగవాళ్లనూ  కౌన్సిలింగ్ ద్వారా మార్చాలి.
 
మెప్పుకోసం.. గొప్ప కోసం కాదు
ఎదుటివారు నా గురించి ఏమి అనుకుంటారో అన్న చింతను అధిగమించాను. మెప్పు కోసమో, గొప్ప కోసమో పనులు చేయడం అలవాటు చేసుకోలేదు. మనస్సులో కోర్కెలు అణచుకొని నేనేదో గొప్ప త్యాగం చేశానని అనుకోవడం కంటే వాటిని జయించడం ఉత్తమమని తెలుసుకున్నాను. ఆచరిస్తున్నాను. తద్వారా ఆత్మానందం, అనంత శ క్తిని పొందుతున్నాను. ఎంతో మంది చేసిన దాన, త్యాగ ఫలితమే నేను. అందరి నుంచి పొందిన లబ్ధికి, అంతకంటే ఎక్కువగా జోడించి తిరిగి సమాజానికి చెల్లించడమే నా పని. అదే నా భవిష్యత్.  చిన్నప్పుడు అనుకునేదాన్ని  కష్టపడి డబ్బు సంపాదించాక  సేవ చెయ్యడం మొదలుపెట్లాలని. సంపాదనకే సమయం సరిపోతే సేవ ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్న కూడా వేధించింది. మంచికి సమాజంలో ఆదరణ ఉన్నప్పుడు చేయడానికి భయమెందుకు అని పనిలోకి దిగాను. ఇక్కడ ఆశ్రమంలో ఈ బిడ్డల ప్రేమను, కష్ట సుఖాలను పంచుకొనే అదృష్టం దక్కింది . వీళ్లు  సన్మార్గంలో నడవడానికి తగిన వాతావరణం ఏర్పాటు చెయ్యటమే నా  కర్తవ్యం. గతంలో బతకలేను... గతాన్ని మార్చలేను. కనుక నిస్వార్థ సేవే లక్ష్యంగా... ఉన్నంత కాలం ఏ ఆధారం లేని ఈ పిల్లలకు తల్లిగా ఉండిపోదామనే ఆశతో సాగుతున్నాను.
 
సంభాషణ:
వంగల దాలినాయుడు, సాక్షి, పార్వతీపురం
 
 

మరిన్ని వార్తలు