మిస్‌ స్నేహశీల

3 Feb, 2017 16:33 IST|Sakshi
మిస్‌ స్నేహశీల

అందం దేవుడిస్తాడు. సుగుణాలు తల్లిదండ్రులిస్తారు. కాని మంచి పనులు చేయాలనే స్ఫూర్తి మాత్రం మనమే వృద్ధి చేసుకోవాలి. అలాంటి స్ఫూర్తి కావాలంటే అందానికి మించిన సంస్కారం ఉండాలి. క్రిస్టల్‌ అలాంటి సంస్కారం ఉన్న అమ్మాయి. అందుకే తన సంస్కారం, స్నేహశీలతకు నిదర్శనంగా అమెరికాలో ఇటీవల జరిగిన  ‘మిస్‌ కంజీనియాలిటీ’ కాంటెస్ట్‌లో ‘మిస్‌ టీన్‌ కంజీనియాలిటీ’ గా గెలుపొందింది.

క్రిస్టల్‌ పూర్తిపేరు క్రిస్టల్‌ ఫేవరిటో. వయసు 14. జార్జియాలోని అట్లాంటాలో నైన్త్‌ గ్రేడ్‌ చదువుతోంది. సెంటెనియల్‌ హైస్కూల్‌ స్టూడెంట్‌. కథక్‌ డ్యాన్సర్‌ కూడా. ఈ టాలెంట్‌ ఈవెంట్‌లో కథక్కే క్రిస్టల్‌ లక్‌ అయింది! క్రిస్టల్‌ ‘మిస్‌ టీన్‌ కంజీనియాలిటీ’ మాత్రమే కాదు, ‘మిస్‌ టీన్‌ ఇండియా యు.ఎస్‌.ఎ.’ ఫస్ట్‌ రన్నరప్‌ కూడా! 

న్యూరో సర్జన్‌ అవడం క్రిస్టల్‌ లక్ష్యం. ఇంకా చాలా అశలున్నాయి. పెద్ద మోడల్‌ అవాలనీ; ఫిల్మ్, ఫ్యాషన్‌ ఇండస్ట్రీలను ఏలాలనీ! అక్కడితో అయిపోలేదు. బాలికల చదువుకు తన వైపు నుంచి ఏమైనా చెయ్యాలని అమె అనుకుంటోంది. ఈ వేసవికి డొమినికన్‌ రిపబ్లిక్‌లో పాఠశాలలను నిర్మించడానికి తన స్కూలు తరఫున వెళుతోంది.

జార్జియా రాష్ట్రం నుంచి ‘మిస్‌ టీన్‌ ఇండియా’ టైటిల్‌ గెలుచుకుని, ‘మిస్‌ ఇండియా యు.ఎస్‌.ఎ.–టీన్స్‌’ ఫైనల్స్‌కు చేరుకుంది క్రిస్టల్‌. ఈ పోటీలు న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌లో డిసెంబర్‌ 16–18 మధ్య జరిగాయి. రియా మంజ్రీకర్‌ టైటిల్‌ గెలిచింది. సెకండ్‌ రన్నరప్‌ ఈషా కోడెకు దక్కింది. ఫస్ట్‌ రన్నరప్‌ క్రిస్టల్‌. ఆరేళ్లుగా నేర్చుకుంటున్న కథక్‌నీ, లేటెస్ట్‌ బాలీవుడ్‌ సాంగ్‌నీ (ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో) కలిపి ‘టాలెంట్‌’ కేటగిరీలో ప్రదర్శించి, జడ్జీలను మంత్రముగ్ధుల్ని చేసింది క్రిస్టల్‌. డాన్స్‌లో కుముద్‌ సావ్లా, ముంజుల నేర్పిన మెళకువలు అవి. ఎన్నారైలు డాక్టర్‌ జి.ఎస్‌.విజయగౌరి, జి.గౌరీశంకర్‌ల మేనకోడలు క్రిస్టల్‌. తల్లి విజయలక్ష్మి. పోటీలకు జడ్జిలుగా వందనశర్మ, లలిత్‌ కె.ఝా, దీపక్‌ చోప్రా, రుచి ప్రసాద్, అలేషా మిల్స్‌ వ్యవహరించారు.

- టీన్‌ బ్యూటీ

మరిన్ని వార్తలు