స్వేచ్ఛే సంతోషం

30 Jan, 2014 23:37 IST|Sakshi
స్వేచ్ఛే సంతోషం

Howard Roark laughed. అయాన్ రాండ్ రాసిన ప్రసిద్ధ నవల ‘ది ఫౌంటేన్‌హెడ్’ తొలివాక్యం ఇది. ఈ వాక్యాన్ని చదివిన బిల్‌కి మతిపోయింది! అప్పుడతడు మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అర్కిటెక్చర్ విద్యార్థి. రెండో పేజీ తిప్పలేదు, అసలు రెండో వాక్యంలోకే వెళ్లలేదు. అక్కడే, ‘హోవార్డ్ రోర్క్ లాఫ్‌డ్’ అనే దగ్గరే ఆగిపోయాడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఆ వాక్యం అతడికి జీవితం మీద ప్రేమ కలిగించింది.

జీవితం ఇంత అందమైనదా! ఇంత సంతోషకరమైనదా! ఇంత అద్భుతమైనదా.. అని అతడి హృదయం ఈ భూగోళంపై కృతజ్ఞతతో నిండిపోయింది. అయాన్ రాండ్ రాసిన ఇంకో పుస్తకం ‘అట్లాస్ షగ్‌డ్’్ర కూడా అతడి ఆలోచనా దృక్పథాన్ని విస్త్రృతం చేసింది. ముఖ్యంగా అందులో అయాన్ ప్రతిపాదించిన ‘ఆబ్జెక్టివిజం’! ఆబ్జెక్టివిజం మీద అధ్యయనం చేయడానికి న్యూయార్క్‌లో అయాన్‌ను వెతుక్కుంటూ వెళ్లాడు బిల్! కలుసుకున్నాడు. చాలా మాట్లాడాడు. అయాన్ శత జయంతి సందర్భంగా 2005లో బిల్ ఈ సంగతులన్నీ వెల్లడించారు. బిల్ వంటి ‘పడిచచ్చిపోయే’ (డై హార్డ్) అభిమానులు అయాన్‌కు ప్రపంచం అంతటా ఉన్నారు. అయాన్ 1982లో చనిపోయారు. జీవితంపై ఆమె కలిగించిన ప్రేమ మాత్రం నేటికీ సజీవంగా ఉంది ఆమె పుస్తకాల రూపంలో.
 
బతకడానికి ఏం కావాలి? బతక నేర్చినతనం. కానీ ‘నిజంగా’ బతకడానికి ‘బతక నేర్వనితనం’ అవసరం అంటారు అయాన్ రాండ్. దానికి ఆమె పెట్టిన పేరు ‘ఆబ్జెక్టివిజం’. బయట కనిపించేది వేరు. లోపల మనకు వినిపించేది వేరు. మనసు చెప్పినట్లు చెయ్యడమా? మనిషిగా నిలబడడానికి మనం చెయ్యవలసింది చెయ్యడమా? ఏదైనా చెయ్యండి. మనసుకు మట్టి అంటకుండా ఎవరికి వాళ్లు సంతోషం కోసం తమకో జీవనసౌధాన్ని నిర్మించుకోవాలి. అందులో మనం, మనం నమ్ముకున్న విలువలు జీవించాలి. ఇదే ఆమె చెప్పిన ఆబ్జెక్టివిజం! అయాన్ నిర్మించుకున్న సౌధం.. సాహిత్య సృజన. ఇలాంటి నిర్మాణాలు 1900 నాటి నియంతృత్వపు రష్యాలో చెల్లుతాయా? ఊహు. అందుకే తన జన్మభూమిని వదిలి ఈ సెయింట్స్ పీటర్స్‌బర్గ్ అమ్మాయి అమెరికా వచ్చేసింది.
 
విక్టర్ హ్యూగో అయాన్ అభిమాన రచయిత. ఈ ఫ్రెంచి నవలాకారుడు చనిపోయిన ఇరవై ఏళ్లకు పుట్టిన అయాన్.. జీవితాంతం ఆయన రచనల వల్ల ప్రభావితం అవుతూనే ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులో అమెను మంత్రముగ్ధురాలిని చేసిన మరో హీరో కూడా ఫ్రెంచి జాతీయుడే. అయితే పత్రిక  సీరియల్‌లో అతడొక పాత్ర మాత్రమే. ఆ తర్వాత తొమ్మిదో యేట తనో పెద్ద రచయిత్రి అయిపోవాలని ఆయాన్ నిర్ణయించుకున్నారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమెకు రష్యా నచ్చడం లేదు. వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన అక్కడి శుద్ధ సామాజిక సముదాయ ధోరణులు అస్సలు నచ్చడం లేదు. స్కూల్లో ఉండగనే తన దేశంలో జాతీయవాద కెరెస్కీ,  అతివాద బోల్షెవిక్ విప్లవాలను చూశారు అయాన్. మొదటిదాన్ని సమర్థించారు.

రెండో దాన్ని వ్యతిరేకించారు. రష్యాలో కమ్యూనిస్టులు అధికారాన్ని సంపూర్ణంగా హస్తగతం చేసుకునే నాటికి అయాన్ హైస్కూల్‌లో ఉంది. అమెరికా గురించి మొదటిసారిగా ఆమె తెలుసుకుంది తరగతి గదిలోనే. ‘అబ్బ! ఎంత స్వేచ్ఛ’ అనుకున్నారు. ఫిలాసఫీలో డిగ్రీ చేశాక, అమెరికా వెళ్లిపోయారు. చివరి వరకూ అక్కడే ఉండిపోయారు.  ‘వియ్ ద లివింగ్’ అమె తొలి నవల. ‘ఫిలాసఫీ: హూ నీడ్స్ ఇట్’ చివరి రచన. హాలీవుడ్‌కు మంచిమంచి స్క్రిప్టులు కూడా రాశారు కానీ, రచయితగానే ఆమె నిలబడిపోయారు. ‘నీ సంతోషం కోసం నువ్వే పోరాడాలి’ అంటారు అయాన్ రాండ్.
 

మరిన్ని వార్తలు