ఖతీజా-ముహమ్మద్ల పరిణయం

1 May, 2016 02:03 IST|Sakshi

ఖతీజా కేవలం అందం, సిరిసంపదలు కలిగిన స్త్రీ మాత్రమే కాదు. ఎంతో వివేకం, విజ్ఞత, తెలివితేటలు, దూరదృష్టి గల మహిళామణి కూడా! అందుకే ఆమె సచ్ఛీలత, సత్యసంధత, నీతి, నిజాయితీల ప్రతిరూపమైన ముహమ్మద్ (స) గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు.

నఫీసా వెళ్లి అబూతాలిబ్‌తో మాట్లాడింది. ముహమ్మద్ (స) ఆ విషయాన్ని ధృవీకరించారు. అబూతాలిబ్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయారు.

 ‘అవును, నా ముహమ్మద్‌కు ఏం తక్కువ? ఇంతటి సత్యసంధుడు, సచ్ఛీలుడు, నిజాయితీపరుడు అరేబియా అంతా కాగడా పట్టి వెతికినా కనపడడు’ అనుకున్నారు అబూతాలిబ్.

 వెంటనే సోదరులను వెంటబెట్టుకుని ఖతీజా బాబాయి అమ్రూబిన్ అసద్, సోదరుడు అమ్రూబిన్ ఖువైలిద్‌లను కలుసుకుని, సంబంధం గురించి మాట్లాడారు. అసద్, ఖువైలిద్‌లిద్దరూ పరమ సంతోషంగా వెంటనే ఒప్పేసుకున్నారు.

 ఖతీజాతో చర్చించి వివాహ తేదీని నిశ్చయించుకున్నారు. చూస్తూ చూస్తూనే ఆ రోజు కూడా రానే వచ్చింది. ఇరుకుటుంబాల పెద్దలు, పిన్నలంతా ఖతీజా ఇంట సమావేశమయ్యారు. ముహమ్మద్ బాబాయి అబూతాలిబ్ నికాహ్ ప్రసంగం చేశారు. దైవాన్ని ప్రస్తుతించిన అనంతరం, అబూతాలిబ్ మాట్లాడుతూ, ‘ఇతను నా సోదరుడు అబ్దుల్లాహ్ కుమారుడు. పేరు ముహమ్మద్. ఖురైష్ వంశం మొత్తంలో ఇంతటి సుగుణ సంపన్నుడు మరొకరు లేరు. అతనివద్ద ధన సంపదలు లేకపోవచ్చు కానీ సుగుణ సంపదకు కొదవ లేదు. అయినా ధనసంపదలు శాశ్వతం కావు. సంపద తరిగే, పెరిగే నీడలాంటిది.

ఈ రోజు ఉండవచ్చు. రేపు లేకపోవచ్చు. ఈ రోజు ఒకరి దగ్గరుంటే, రేపు మరొకరి దగ్గర ఉండవచ్చు. ముహమ్మద్ నాకు ప్రాణసమానం. ఈ విషయం మీకందరికీ తెలుసు. ముహమ్మద్, ఖువైలిద్ కూతురు ఖతీజాను వివాహమాడుతున్నాడు. ఈ శుభసందర్భంగా నేను నా ఆస్తిలో నుండి 20 ఒంటెల్ని మహర్‌గా నిర్ణయిస్తున్నాను. దైవసాక్షి! ఇతని భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోంది. దైవకృప, ఆయన కారుణ్యం తనవెంట ఉన్నాయి’ అంటూ వివాహ ప్రసంగం ముగించారు అబూతాలిబ్.

 ఈ విధంగా ఈ వివాహ శుభకార్యం ఆనందోత్సాహాలతో ముగిసింది. తాహిరా ఆమిన్ ఇంట కాలుమోపింది. అప్పుడు ముహమ్మద్ వయసు ఇరవై ఐదు సంవత్సరాల రెండునెలల పదిరోజులు. బీబీ ఖతీజా వయసు నలభై సంవత్సరాలు.

 ఖతీజా, ముహమ్మద్ గార్ల దాంపత్యజీవితం హాయిగా, ఆనందంగా గడిచిపోతోంది. ఒకరి సహచర్యం మరొకరికి శాంతిని, ప్రశాంతతను పంచిపెడుతోంది. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఖతీజా కేవలం అందం, సిరిసంపదలు కలిగిన స్త్రీ మాత్రమే కాదు. ఎంతో వివేకం, విజ్ఞత, తెలివితేటలు, దూరదృష్టి గల మహిళామణి కూడా! అందుకే ఆమె సచ్ఛీలత, సత్యసంధత, నీతి, నిజాయితీల ప్రతిరూపమైన ముహమ్మద్ (స) గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు.

 ఒక ఆదర్శ ఇల్లాలుగా, ఉత్తమ భర్తగా వారిద్దరూ కూడా తమను తాము నిరూపించుకున్నారు. మూఢాచారాలు, మార్గభ్రష్టత్వంలో మునిగి ఉన్న సమాజాన్ని ఎలాగైనా సంస్కరించి, మంచి సమాజంగా, సౌశీల్యం ఉన్నత మానవీయ విలువలు ఉట్టిపడే సమాజంగా తీర్చిదిద్దాలన్నది  ముహమ్మద్ (స) ఆలోచన. దీనికోసం ఆయన ఎంతగానో పరితపించేవారు. ఏకాంతంలో కూర్చొని ఆలోచించేవారు. దైవధ్యానంలో లీనమైపోయేవారు.

 - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)

మరిన్ని వార్తలు